ఆంధ్రప్రదేశ్‌

మీ కళ్లలో ఆనందమే నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూడటమే తన లక్ష్యమని, అందుకే ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసం పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం వెటర్నరీ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మార్గమధ్యంలో ఎస్వీ యూనివర్శిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెండో విడత పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ పేదల కోసం ఆర్థిక, రాజ్యాంగ పరమైన అంశాలను తీసుకువచ్చారని అయితే వాటి అమలుకు పాలకులు తూట్లు పొడిచారని, అందుకే పేదలు పేదలుగాను, నిరుపేదలు నిరుపేదలుగాను, ధనవంతులు ధనవంతులుగాను మిగిలిపోతున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకపోయినా అభివృద్ధిలో ముందుకు సాగుతూ వౌలిక వసతుల కల్పన చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ మాటల మనిషని, ఎన్నికల మనిషని, చేతల మనిషి కాదని బాబు విమర్శించారు. 1995లో ఆర్థిక సమస్యలు తలెత్తాయని పెట్రో ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలన్నా నిధులు లేక బంగారాన్ని కుదవ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఆ సమయంలో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత కేంద్రంలో మైనార్టీతో కూడుకున్న సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఈక్రమంలోనే తాను ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టానన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఆకలి తీర్చలేని పరిస్థితులు ఉండేవన్నారు. అందుకే పేదల ఆదాయాన్ని పెంచాలన్న ఆలోచనతోనే తాను పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు గుర్తింపును కల్పిస్తూ వారిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి డాక్టర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం, జ్యోతిరావ్ పూలే వీరంతా సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణమైన ప్రతిభను కనబరచారని అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెండ్ల సత్య, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ వంటి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాణిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు జ్ఞానభేరి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఉద్యోగాలకు అవసరమైన యువత మన దగ్గర ఉందని సీఎం అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 4 సంవత్సరాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్నామని, రెండంకెల వృద్ధి సాధించామని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎం పార్కును మంజూరు చేయడం జరుగుతోందన్నారు. ఒకప్పుడు గ్రామాల్లోకి అడుగుపెడితే చెత్తదిబ్బలు దర్శనమిచ్చేవన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని, చెత్తను వర్మీకంపోస్టు ద్వారా ఎరువుగా మారుస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలను ఎల్‌ఈడి బల్బులతో నింపామన్నారు. దీంతో 30 శాతం ఆదా చేస్తే మిగిలిన 70 శాతం ప్రైవేట్ వారికి విక్రయించి ఆదాయం పెంచుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందువల్ల ప్రతిఒక్కరికి ఆరోగ్యం కూడా అందుతోందన్నారు. రూ. 64,422 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ల ద్వారా నిధులు అందిస్తున్నామన్నారు. మైనార్టీ, కాపు, బ్రాహ్మణ సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇలా 8 కార్పొరేషన్లకు రూ. 1.16 లక్షల కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ రూ.27వేలు కోట్లు, ఎస్టీలకు రూ. 9వేల కోట్లు, బీసీలకు రూ. 23వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. వెనుకబడిన వారికి 90 శాతం సబ్సిడీతో రుణాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 9లక్షల డ్వాక్రా సంఘాలున్నాయని పట్టణాల్లో మెప్మా ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. వెనుకబడినవారు ఆర్థికంగా ఎదగడానికి రూ. 1000 కోట్లు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడు నెలకు రూ. 10వేలు ఆదాయం పొందేలా తగిన పనులు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు వివిధ రకాల చేతి వృత్తుల వారికి రూ. 2లక్షల కోట్లు విలువచేసే పరికరాలు పంపిణీ చేశామని సీఎం అన్నారు. రజకులకు రెండు విడతలుగా రూ. 20వేలు చెల్లిస్తున్నామని, కల్లుగీత కార్మికులకు రూ. 10వేలు విలువచేసే సైకిల్ ఇతర పనిముట్లు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో 25 వేల కిలోమీటర్లు మేర సిమెంట్ రోడ్లు వేశామన్నారు. మహిళల ఆత్మగౌరువాన్ని కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించామన్నారు. కట్టెల పొయ్యితో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని ప్రతి ఇంటికి వంటగ్యాస్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలను చేస్తూ వర్మీకంపోస్ట్ తయారు చేస్తున్నామన్నారు. బీసీలను ఆదుకునేందుకు బీసీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వివిధ బీసీ కులాలను బలోపేతం చేసేందుకు ఫెడరేషన్ ఏర్పాటు ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
ఈ నెలాఖారుకు హంద్రీ-నీవా
చిత్తూరు జిల్లాకు ఈనెలాఖరునాటికి హంద్రీ-నీవా జలాలను తీసుకువస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హంద్రీ-నీవా, సోమశిల, స్వర్ణముఖిని పూర్తిచేసి అన్నివిధాల ఆదుకుంటామన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని అన్నారు. తద్వారా రాయలసీమ జిల్లాలకు నీరు అందుతుందని సీఎం వివరించారు. హంద్రీ-నీవా జలాలు కుప్పం, చిత్తూరుకు రావడానికి ఎంతోకాలం పట్టదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చన్నాయుడు, మంత్రులు అమరనాధరెడ్డి, ఫరూక్, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, గౌనివారి శ్రీనివాసులు, రాజసింహులు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, తలారి ఆదిత్య, సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఓ మహిళకు కుట్టుమిషన్ అందజేస్తున్న సీఎం