ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, డిసెంబర్ 9 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే చెప్పారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ‘మహర్షి వాల్మీకి మహారథయాత్ర’ ముగింపు యాత్ర సభలో కన్నా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమయంలో హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అని ఆయన కోరడం వల్లే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందన్నారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఎన్డీఏ నుంచి వైదొలగి బీజేపీపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేసిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము వైసీపీతో పొత్తు పెట్టుకుంటామని టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలో వాల్మీకులందరూ బీజేపీకి మద్దతుగా నిలవాలని, భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి బీజేపీ సుముఖంగా ఉందన్నారు.
కేంద్ర మాజీ మంత్రి పురంధ్రేశ్వరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్భ్రావృద్ధి జరుగుతోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయకుండా చంద్రన్న పథకాలుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోతే నిర్మాణం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. గతంలో ఎన్టీ రామారావు కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించగా ప్రస్తుతం చంద్రబాబు ఆ పార్టీతోనే కలిసి పని చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

చిత్రం..వాల్మీకి మహారథయాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ