ఆంధ్రప్రదేశ్‌

అసదుద్దీన్ ప్రభావం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పాత బస్తీలో ఏడెనిమిది నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతోన్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటన రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తానని ప్రకటించడంతో అన్ని రాజకీయ పక్షాల్లోనూ ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది. అసద్ కారణంగా టీడీపీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా ముస్లిం ఓటర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయడం ఖాయమని దాంతో టీడీపీ నష్టపోవడం ఖాయమని వైసీపీ విశే్లషిస్తోంది. అసదుద్దీన్ ఒక మతతత్వ పార్టీ వ్యక్తిగా ముద్రపడ్డారని, ఆయన పార్టీ కేవలం హైదరాబాద్‌లోని ముస్లిం ప్రభావిత పాతనగరానికే పరిమితమైన పార్టీగా గుర్తుంచుకోవాలని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. అలాంటి పార్టీ తెలంగాణాలో టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని వారు పేర్కొంటున్నారు. అసదుద్దీన్ వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తే ఆయన ప్రభావంతో రాయలసీమలోని మూడు, నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ నష్టం తప్పదని విశే్లషిస్తున్నారు. అసదుద్దీన్ ప్రకటనతో రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, బనగానపల్లె నియోజకవర్గాలు, కడప జిల్లాలోని కడప, రాయచోటి, అనంతపురం జిల్లాలోని కదిరి వంటి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట అసదుద్దీన్ కారణంగా వైసీపీ లబ్ధి పొందవచ్చని వారంటున్నారు. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అంత బలంగా లేని విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇక రాయలసీమలో మత రాజకీయాల కంటే గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఉండటంతో అసదుద్దీన్ ప్రసంగాలు ముస్లిం ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది ప్రశ్నార్థకమేనని వారంటున్నారు. ఆయన ప్రచారాన్ని వైసీపీ అంగీకరిస్తే మాత్రం రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అసదుద్దీన్ ప్రభావం హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ మినహా నగరంలో ఎక్కడా ఉండదని, అంతేగాక తెలంగాణా వ్యాప్తంగా అక్కడక్కడా అసద్ తన ప్రసంగాలతో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలరని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే రాయలసీమలో ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఒకింత ప్రభావం చూపినా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసద్ స్నేహాన్ని ముస్లిమేతర ఓటర్లు వ్యతిరేకిస్తే వైసీపీ విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీస్తాయని వారు పేర్కొంటున్నారు. వైసీపీ అసద్‌ను ప్రచారానికి అంగీకరిస్తే ప్రస్తుతం స్నేహంగా ఉంటున్న బీజేపీ వైఖరిలో కూడా మార్పు రావడం తథ్యమని, దాంతో ఆ పార్టీ ఓటర్లు టీడీపీ వైపు చూసినా ఆశ్చర్యం లేదని వారు హెచ్చరిస్తున్నారు. అసదుద్దీన్ ప్రకటన రాజకీయవర్గాల్లో కలకలం రేపడంతో ఆయన ప్రచారానికి వైసీపీ అంగీకరిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు టీడీపీకి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణాకు చెందిన ఈ ఇద్దరి నేతల ప్రభావం టీడీపీకి నష్టం చేస్తుందా లాభం చేకూరుస్తుందా అన్నది వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉందని విశే్లషకులు పేర్కొంటున్నారు.