ఆంధ్రప్రదేశ్‌

రాజీనామా యోచనలో ఎమ్మెల్యే ఈరన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 13 : అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈరన్న విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని, అతడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం దాచారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై గత నెల 27వ తేదీ విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెల్యేగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికల్లో ఓట్ల పరంగా రెండో స్థానంలో నిలిచిన డాక్టర్ తిప్పేస్వామిని కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఈరన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత నెల 29వ తేదీ సుప్రీం కోర్టును ఆశ్రయించి మూడు వారాల పాటు స్టే తెచ్చుకున్నారురు. అయితే మంగళవారం సుప్రీం కోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పునే అమలు చేయాలని, ఈరన్న పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సి ఉండటంతో కోర్టు నుంచి ఉత్తర్వులు స్పీకర్‌కు అందకమునుపే తన పదవికి రాజీనామా చేయాలని ఈరన్న భావిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై ఎమ్మెల్యే ఈరన్నను అడగ్గా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నానని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే ఈరన్న రాజీనామా చేస్తే వైసీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామికి ఎమ్మెల్యే పదవి దక్కుతుందా లేదా అనే విషయమై చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈరన్న రాజీనామా ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈరన్న రాజీనామా చేస్తే ఆరు నెలల్లోపు ఖాళీ పడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉండటంతో కేవలం వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే పదవి దక్కకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామాకు ముందే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.