ఆంధ్రప్రదేశ్‌

ప్రజలను వంచిస్తున్న వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: సుపరిపాలనలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష వైసీపీ పరాయి పక్షంగా మారిందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్ విజయంతో వైసీపీ సంబరాలు చేసుకున్న తీరు ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. రాష్ట్రంలో లాలూచీ రాజకీయాలు చేయడంలో వైసీపీ, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన శుక్రవారం 20 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను రాశారు. ఏపీ జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా అంశంలో కేసీఆర్ బహిరంగంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే అయినా టీఆర్‌ఎస్ గెలుపుతో వైసీపీ సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో వైసీపీ సమావేశమై టీఆర్‌ఎస్‌కు మద్దతుగా తీర్మానం చేయడం నవ్యాంధ్ర ప్రజలను వంచించడమేనన్నారు. వారికి మద్దతివ్వాలనుకుంటే వైసీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి సంతోషంగా తీర్మానం చేయాలన్నారు. వైసీపీ వ్యవస్థాపకులలో ఒకరైన శివశంకర్ కాంగ్రెస్‌కు మద్దవ్వాలని చెప్పడంతో ఆయన్ని పార్టీ నుండి బహిష్కరించడం టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడం కాదా అని ప్రశ్నించారు. స్థానికతపై తెలంగాణాలోని ఏపీ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే నాడు వైకాపా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఏపీకి వచ్చే వాహనాలపై పన్ను, నంబర్ ప్లేట్లు విషయంలో కఠిన నిబందనలతో సెటిలర్లను ఇబ్బందులకు గురి చేస్తే ఎప్పుడైనా నోరుమెదిపారా అని ప్రశ్నించారు.
కట్టుబట్టలతో, నెత్తిన అప్పుల భారంతో ఏపీ ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబడినా, నమ్ముకున్న ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలపాలన్నారు. కోస్తా ప్రజల నాలుక కోస్తా, రాక్షసులు మొత్తం ఆంధ్రలోనే పుట్టారు, కుక్కల్లాంటి వారు, తెలివి తక్కువ దద్దమ్మలు, చీమూనెత్తురు లేకుండా పొమ్మంటున్నా సిగ్గులేకుండా ఇక్కడే తగలడ్డారు అని ఏపీ ప్రజలను అవమానించినా కేసీఆర్‌కు మద్దతివ్వడం సిగ్గుగా అనిపించట్లేదా అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై అవిశ్వాసం పెడితే చీప్ పాలిటిక్స్ అంటూ కేంద్రానికి మద్దతుగా నిలిచి ఏపీకి తీరని ద్రోహం చేసిన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నారన్నారు. తెలంగాణలో వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోనికి ఫిరాయించిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో గవర్నర్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. 2016లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని మీ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పింది వాస్తవం కాదా అన్నారు. ఎన్నికల ముందు వైసీపీ ముఖ్యనేతలు చెవిరెడ్డి, విజయసాయిరెడ్డిలు రహస్యంగా కేటీఆర్‌తో సమావేశమై మంతనాలు జరపడం మీ అనుబంధానికి నిదర్శనం కాదా అన్నారు. ఏపీకు అన్యాయం చేయటమే మీ రహస్య అజెండానా అని ప్రశ్నించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణారావు గెలుపుకోసం కృషి చేశారంటూ వైకాపా కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతూ బహిరంగ ప్రకటన చేయడం వాస్తవం కాదా అన్నారు. ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాల్లో తెలంగాణా ప్రభుత్వ బహిరంగంగా అడ్డుపడినా మీరు ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణా నుండి ఏపీకి రావాల్సిన నిధులు బకాయిల గురించి ప్రతిపక్ష నేతగా మీరేనాడైనా స్పందించారా అన్నారు. తెలంగాణాలోని లోటస్ పాండ్, బయ్యారం గనులు, భూములు, మీ అక్రమ వ్యాపారాలు బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్‌కు వంత పాడుతున్నారనేది నిజమా కాదా అన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనలో తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహిరించడంపై టీడీపీ పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఒక్కరోజైనా స్పందించారా అన్నారు. రాష్ట్రాన్ని సస్వశ్వామలం చేసేందుకు పట్టిసీమను నిర్మిస్తే దాని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తే ఏనాడైనా స్పందించారా అన్నారు. జాతీయ సమగ్రతకు సంబంధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా ప్రభుత్వం గులాబిరంగు వేయించినా స్పందించే ధైర్యమే లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు మద్దతు తెలియజేస్తూ, ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఏపీ ప్రజలకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని కళావెంకట్రావు లేఖలో వివరించారు.
ఈ లేఖపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తక్షణమే స్పందించాలన్నారు.