ఆంధ్రప్రదేశ్‌

బాబు అసమర్ధతతో రాష్ట్రం తిరోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 16: చంద్రబాబునాయుడు అసమర్ధత వల్ల కేంద్రం నుంచి విడుదలయ్యే సబ్సిడీ నిధులు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో వుండటంతో ఆరోగ్యశ్రీని బంద్ చేస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యాలు నిర్ణయించినట్టు తెలిసిందని, దీనితోపాటు రాష్ట్రంలో అన్ని విధాల బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని విమర్శించారు.
కేంద్రం ఇచ్చిన నిధులు తెచ్చుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోందని, ఇందులో ప్రధానంగా మన రాష్ట్రానికి వెంకయ్యనాయుడు అర్బన్ డవలప్‌మెంట్ మంత్రిగా ఉండగా సుమారు ఆరు లక్షల ఇళ్లను కేటాయించారని, ఇప్పుడు మళ్లీ రెండు లక్షల ఇళ్ళు వచ్చాయని, వీటన్నింటికీ కేంద్రం సబ్సిడీ సుమారు రూ.1400 కోట్లు ఇచ్చిందని, కానీ రాష్ట్రం ఇప్పటి వరకు ప్రధాన మంత్రి ఆవాజ్‌యోజన కార్యక్రమంలో 1.40వేల ఇళ్లు మాత్రమే కట్టి 8 లక్షల ఇళ్లు రూ.14వేల కోట్లకు గాను సబ్సిడీ రూ.3వేల కోట్లు మాత్రమే వినియోగించుకోగలిగిందన్నారు. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు విడుదల చేసుకోలేక కాకినాడ స్మార్ట్ సిటీ నిధులను కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందుతోందన్నారు. నీరు-చెట్టు పనులకు బడ్జెట్‌కు మించి ఖర్చు చేస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు తవ్వుతున్న చెరువులకు బిల్లులు చెల్లించడానికి ఇచ్చిన బడ్జెట్ అయిపోవడం మూలంగా వాటికి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కార్యకర్తలందరికీ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని, ఎన్నికల ముందు కార్యకర్తలను సంతృప్తిపర్చాలి కాబట్టి ఈ విధంగా చేశారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో వుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శే్వతపత్రం విడుదల చేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నానని సోము వీర్రాజు అన్నారు. కేంద్రం తన వాటా నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర వాటా నిధులు సమకూర్చుకోలేని స్థితి వల్లే కేంద్రం నుంచి నిధులను వినియోగించుకోలేకపోతోందన్నారు. దీంతో గత నాలుగు సంవత్సరాలుగా కట్టాల్సిన ఇళ్ళను ఒకే సారి కొత్త టెక్నాలజీ పేరిట ఒకే సారి కడుతున్నారన్నారు. ఇది ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోన్న వైఖరి కాదా అని ప్రశ్నించారు.
వైద్యానికి డబ్బులు లేని దుస్థితిలో మీసాలకు చెంపంగి నూనె అన్నట్టు ఎయిర్‌షో, బోట్స్‌షోలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈవెంట్ల పేరుతో నిధులను వెనక్కి లాక్కునే ప్రయత్నమన్నారు. ఇస్ర్తి పెట్టె రూ.1400 అయితే దానికి రూ.3వేలు పెట్టడం, దాంట్లో కూడా రూ. ఆరేడు వందల కోట్లు వెనక్కి తీసుకోవడమేనన్నారు.
ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా వైఫల్యం చెందుతూ రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేసే పరిస్థితిలో వుందని, హాస్టల్‌లో సరైన భోజనం లేదని, హాస్టల్ విద్యార్థులకు కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేక మంచాల కింద పడుకుంటున్నారని, కానీ జీడీపీ గ్రోత్ రేటు మాత్రం 14 శాతం అని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. హాస్టల్ విద్యార్థులు కప్పుకోడానికి దుప్పట్లు లేకపోవడమే చంద్రబాబునాయుడు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. కనీసం రక్తహీనత కూడా తగ్గించలేని ముఖ్యమంత్రి విమర్శించారు.
రూ.30వేల కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టి విద్యను నారాయణ, చైతన్యకు అప్పగించడం చంద్రబాబునాయుడు సమర్ధతకు చిహ్నమా అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల్లో రూ.1.50 లక్షల కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టి విద్యను ప్రైవేట్ హస్తగతం చేయడం చంద్రబాబునాయుడు పరిపాలన తీరుకు అద్ధం పడుతోందన్నారు. పరిపాలనను గాడి తప్పిందని, ఏపీ రాష్ట్రాన్ని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు గంటల తరబడి రివ్వ్యూలు చేయకుండా ఉంటే రాష్ట్రంలో పని క్వాలిటీ పెరిగేదని, ఉపన్యాసాలతో అధికారుల సమయాన్ని వృధా చేస్తూ, తానే పని చేస్తున్నాననే బిల్డప్ ఇస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నమని, పరిపాలనలో డొల్లతనం కన్పిస్తోందన్నారు. మహా కూటమి మహా ఓటమి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు తెలంగాణా ప్రచారానికి వెళ్ళడం వల్ల కొంత మంది కీలక నాయకులు రాజకీయ ఆత్మహత్యలకు గురయ్యారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, గద్దర్, ఆర్ కృష్ణయ్య, మందా కృష్ణమాదిగ తదితరులంతా రాజకీయ ఆత్మహత్యలకు గురికాబడ్డారని ఆరోపించారు. తెలంగాణాలో ఆయన ప్రచారం వల్ల ఘోరంగా ఓడిపోతే, మూడు రాష్ట్రాల్లో తన మూలంగా బీజేపీ ఓడిపోయిందని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు నాలికా తాటిపట్టో అర్ధం కావడం లేదని, చంద్రబాబునాయుడు భాష చూస్తుంటే దగాకోరు అనాలో, అబద్ధాల కోరు అనాలో అర్ధం కావడం లేదని సోము ధ్వజమెత్తారు.
మూడు రాష్ట్రాల ఓటమిపై బీజేపీ ఆత్మ పరిశీలన
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. ఛత్తీస్‌గడ్‌లో ఘోరంగా దెబ్బతిన్నాం, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని, రాజస్థాన్‌లో 50 సీట్ల నుంచి 80 స్థానాలకు వచ్చామని, ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ వచ్చి కూడా మధ్యప్రదేశ్‌లో ఓటమి చెందామన్నారు. తామేమీ మహాకూటమి మాదిరి మహా ఓటమి చెందలేదన్నారు. చంద్రబాబునాయుడు చేసిన హడావిడి వల్లే కేసీఆర్‌కు 65 రావాల్సింది 85 తీసుకొచ్చారన్నారు. దొంగ సర్వేను బయట పెట్టారని, దాని వల్లే తెలంగాణా మరింత జాగ్రత్త పడిందన్నారు. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న లగడపాటికి సర్వే చేసేందుకు నైతిక హక్కులేదన్నారు. పదేళ్ల పాటు ఎంపీగా వుండి ఒక ఫ్లై ఓవర్ వేయించలేకపోయారని, ఈ పదేళ్ళలో ఎన్ని లైసెన్స్‌లు సంపాదించారని ప్రశ్నించారు.
రుణాలు తీసుకుని ఎగ్గొట్టి సర్వేలు చేస్తామని ప్రజలను నమ్మిస్తారా అని సోము ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిమెళ్ళ చిట్టిబాబు, సత్తి మూలారెడ్డి, కొంతం వెంకటమహేష్ కృష్ణ, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆదిత్య, మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి గీతా విజయలక్ష్మి, బూరా రామచంద్రరావు, వీరా వీరాంజనేయులు, తంగెళ్ళ పద్మావతి, రాయుడు వెంకటేశ్వరరావు, కోరుకొండ చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.