ఆంధ్రప్రదేశ్‌

దూసుకొస్తున్న తుపాను .. అధికారులు అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 16: తుపాను కాకినాడకు 500కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ-విశాఖపట్నంల మధ్య పెథాయ్ తుపాను తీరందాటే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తుపాను సహాయ కార్యక్రమాలకు ఒక హెలీకాఫ్టర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ నుండి జిల్లాలో తుపానును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆదివారం కలెక్టర్ మిశ్రా, ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తిలతో కలసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడకు సుమారు 500కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుపాను కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ తుపాను కాకినాడ-విశాఖపట్నంల మధ్య తీరందాటే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో 14 తీర ప్రాంత మండలాల్లో తుపాను తాకిడి ఉంటుందని ముందుగా అంచనావేసిన దృష్ట్యా అధికారులు అందరూ సమిష్టిగా తుపాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టంచేశారు. తుపాను సహాయ కేంద్రాల్లో వసతి, భోజన సదుపాయాలు, జనరేటర్స్ సిద్ధంచేశామన్నారు. అదే విధంగా విద్యుత్ సబ్‌స్టేషన్లలో కరెంట్‌పోల్సు తదితర సామాగ్రి ఏర్పాటుచేశామని, మండల కేంద్రాల్లో నిత్యావసర వస్తువులు తరలింపు, హెల్త్‌క్యాంపులు ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలియజేశారు. కాకినాడ, రాజమండ్రి నుండి 600మంది పోలీసు బలగాలు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ టీములు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. టెక్నాలజీ ప్రకారం పక్కా ప్రణాళికతో తుపానును ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలియజేశారు. ఈసమీక్షా సమావేశంలో చింతూరు, రంపచోడవరం సబ్ కలెక్టర్లు అభిషిక్త్ కిషోర్, వి వినయ్‌కుమార్, డిఆర్వో ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, కాకినా ఆర్డీవో జి రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె రమేష్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు: పెథాయ్ తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారును ఆదేశించారు. తుఫాన్ ప్రకటన నేపథ్యంలో రాష్టస్థ్రాయి మున్సిపల్ అధికారులతో ఆయన నెల్లూరు నుండి టెలీ కానె్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకూ ఉన్న అన్ని పురపాలక సంఘాల పరిధిలో అధికారులు, సిబ్బంది ముందస్తు, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పట్టణాల పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, చెట్లను నరికేందుకు గొడ్డళ్లు, రంపాలు, జనరేటర్లు, నీటి ట్యాంకులు, ఇంధనం సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అత్యవసరంగా ఆహారం అందించేందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని, తుఫాన్ ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు.
జనరేటర్లు, ట్యాంకర్లు సిద్ధం
విజయవాడ: పెథాయ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విద్యుత్ లేకపోయినా మంచినీటి పథకాలు పనిచేసేలా, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో 24గంటలూ వివిధ శాఖల సిబ్బంది పని చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆదివారం మంత్రి లోకేష్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించి, అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. పెథాయ్ పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో విద్యుత్ లేకపోయినా మంచినీటి పథకాలను నిర్వహించేందుకు వీలుగా జనరేటర్లను, ట్యాంకర్లను సిద్ధం చేశారు. వాటర్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు. ఆర్టీజీఎస్, వాతావరణ శాఖ సూచనలు ఆయా జిల్లాల అధికారులకు పంపుతూ, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పంచాయతీ భవనాలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని, తుపాను తీరం దాటేంతవరకూ అన్ని మంచినీటి ట్యాంకులను నింపి ఉంచాలని మంత్రి ఆదేశించారు. మంచినీటి పథకాలకు విద్యుత్ సరఫరా సమస్య ఉండకుండా 816 జనరేటర్లను, 622 ట్యాంకర్లను తరలించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు.
తుపాను బాధితులకు ‘యాప్’న్న హస్తం!
పెథాయ్ తుపాను బాధితులను ఆదుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోస్తాలో తుపాను ప్రభావంతో ఆస్తి, పంట నష్టం జరిగితే బాధితులకు తక్షణమే పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తుపాను వల్ల నష్టపోయిన బాధితులు తమకు జరిగిన నష్టం మదింపు చేసేందుకు, అధికారుల కోసం ఎదురుచూడకుండా వారే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు పీపుల్స్ ఫస్ట్ యాప్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమకు జరిగిన నష్టానికి సంబంధించి ఫొటోలను సెల్‌ఫోన్ ద్వారా తీసి పీపుల్స్ ఫస్ట్ యాప్‌లో పొందుపరిస్తే ఆర్టీజీఎస్ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సంబంధిత విభాగాలకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి అధికారులకు పంపుతుంది. ఈ ఫొటోల ఆధారంగా సిబ్బంది దానికి సంబంధించి నష్టాన్ని మదింపు చేస్తారు. అనంతరం నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. దీనికి బాధితులు కేవలం పీపుల్ ఫస్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బాధితుని ఆధార్ సంఖ్య, గ్రామం, మండలం, జిల్లా వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫిర్యాదును నమోదు చేయాలి. పొలం సర్వే నెంబర్, పంట, జరిగిన నష్టం వివరాలు, ఇందుకు సంబంధించిన చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వివిధ వివరాలు ఆర్టీజీఎస్ ద్వారా మ్యాపింగ్ చేశారు. మ్యాప్‌ను పంట నష్టం, కూలిన ఇళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, తదితర 11 అంశాలుగా విభజించారు. ఎవరైనా అందులోకి వెళ్లి క్లిక్ చేయగానే, ఆ ప్రాంత ప్రజలు పంపిన చిత్రాలు, జరిగిన నష్టం వివరాలు స్పష్టంగా తెరమీద కనిపించేలా ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలోని బృందాలు నష్టాన్ని మదింపు చేస్తాయి. దాని ఆధారంగా నష్టపరిహారం బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తారు. పంట, ఆస్తి నష్టానికి సంబంధించి మూడు ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ డౌన్‌లోడ్, చిత్రాల అప్‌లోడ్, తదితర సమయాల్లో ఇబ్బందులు తలెత్తినా, అనుమానాలున్నా 1100కు ఫోన్ చేయాలని ఆర్టీజీఎస్ విజ్ఞప్తి చేసింది. తిత్లీ తుపాను సమయంలో ఆస్తి, పంట నష్టం చెల్లింపులో కొంతవరకూ ఈ విధానంలో మదింపు చేశారు. అది విజయవంతం కావడంతో ఈసారి ముందుగానే ఆర్టీజీఎస్ రంగంలోకి దిగింది. బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం చెల్లింపే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
రాజమండ్రి, కాకినాడకు 56 వేల పోల్స్ తరలింపు
శ్రీకాకుళం: పెథాయ్ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన సమీపంలో తీరం దాటుతుందని అంచనా. ఏ తుపాను వచ్చినా విద్యుత్ శాఖపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందుకు ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు చెప్పారు. ఆదివారం ఇక్కడ ఆర్ అండ్ బి వసతి గృహంలో ‘ఆంధ్రభూమి’తో ఆయన మాట్లాడారు. పెథాయ్ తుపాను నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి 56 వేల కరెంటు స్తంభాలు రాజమండ్రి, కాకినాడకు పంపిస్తున్నామని వివరించారు. ఎస్పీడీసీఎల్ నుంచి 1500, ఈపీడిసీఎల్ నుంచి 2000 మంది వివిధ స్థాయిల్లోని సిబ్బందిని పంపిస్తున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ సమస్యలు లేకుండా ప్రతీ పంచాయతీకి ఒక ఛార్జింగ్ మేషిన్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
డ్రిల్లింగ్ మిషన్లు, మెటీరియల్‌ను ఇప్పటికే కొంతమేరకు పంపించామని చెప్పారు. తుపాను ఎక్కడ తీరం దాటితే అక్కడికి త్వరితగతిన చేరుకునేలా విద్యుత్‌శాఖ సర్వం సిద్ధంగా ఉందన్నారు.
కాకినాడలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, తుపానుపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. హుదూద్, తిత్లీ వంటి తుపానులు నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా ప్రాణనష్టం కలగకుండా, ఆస్తి నష్టాలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 13 జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ప్రతీ రెండు గంటలకు నిర్వహిస్తూ వారిని దిశదశ నిర్దేశిస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు.

చిత్రాలు.. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఎగసి పడుతున్న సముద్ర అలలు
*తుపానుపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మిశ్రాతో కలసి సమీక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప