ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన తుఫాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెథాయ్ పెను తుపాను ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం కాకినాడ-యానాం నడుమ తీరం దాటింది. తొలుత తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన తుపాను ముందుకు కదిలి కాకినాడ-యానాం మధ్య తీరం దాటింది. సోమవారం ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షాలు, అధికార్ల హెచ్చరికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్, అనంతరం ముందుకు కదిలి మధ్యాహ్నం 3.27 గంటల సమయంలో కాకినాడ, కేంద్రపాలిత ప్రాంతం యానాం మధ్య తీరం దాటింది. పెథాయ్ తీరాన్ని తాకే సమయంలో కాకినాడ ప్రాంతంలో మూడు గంటల పాటు విపరీతమైన పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. ముందస్తు అప్రమత్త చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఉప్పాడ కొనపాప పేట ప్రాంతంలో సుమారు 50మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాలు తుపాను ప్రభావితమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుపాను తీరం దాటుతుందని భావించిన ఐ పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారం అలుముకుంది. ముమ్మిడివరం మండలం అయినాపురంలంక శివారు దూడలవారిచెర్వు గ్రామంలో రహదారిపై వెళుతున్న కారుపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. కారు ధ్వంసమైనా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కాట్రేనికోన గ్రామంలో పార్కింగ్ చేసివున్న కారుపై చెట్టుకొమ్మ విరిగిపడటంతో కారు ధ్వంసమయ్యింది. అలాగే పలు ప్రాంతాల్లో ఇళ్లపై చెట్లు విరిగిపడటంతో ధ్వంసమయ్యాయి. కాకినాడ సూర్యారావుపేట, యు కొత్తపల్లి మండలం ఉప్పాడ, అమీనాబాద, తొండంగి మండలం కొనపాపపేట, అద్దరిపేటలలో పలు తాటాకు ఇళ్లు నేలకూలాయి. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతానికి ఏడుగురు జాలర్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కరప మండలం ఉప్పలంకకు చెందిన ఏడుగురు జాలర్లు కాకినాడ జగన్నాధపురం నుంచి వేటకు వెళ్ళి పడవ బోల్తా పడ్డంతో ఈదుకుంటూ సురక్షితంగా బయట పడ్డారు. తుపాను ప్రభావంతో గత 48 గంటలుగా భారీ వర్షాలు, తీవ్రమైన చలిగాలులు చుట్టుముట్టాయి. ఆదివారం రాత్రి నుంచే ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. ఏజెన్సీలో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. రహదారుల్లో సైతం ముందస్తుగా రవాణాను రద్దు చేయడంతో నగరాలు, పట్టణాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తీరప్రాంత మండలాల్లో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాకపోకలు నిలిపివేశారు. యానాం-ఎదుర్లంక వంతెన, పాశర్లపూడి వంతెన, దిండి వంతెనలపై రాకపోకలను రద్దుచేశారు. ఏజెన్సీలో కూడా భారీ వర్షాలు కురవడంతో భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. దీంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి, దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో 28వేల మందిని, పశ్చిమ గోదావరి జిల్లాలో 2638మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఐ పోలవరం మండలం భైరవపాలెంలో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కాకినాడలో మకాంవేసి పరిస్థితులను సమీక్షించారు. తీరప్రాంతంలో మొత్తం 13 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కె భాస్కర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, అధికార్లకు తగు ఆదేశాలు జారీచేశారు.