ఆంధ్రప్రదేశ్‌

రామాయపట్నం పోర్టులో జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో జిందాల్ సౌత్ వెస్టు (జెఎస్‌డబ్ల్యూ) గ్రూపు భాగస్వామి కానుంది. దాదాపు 3500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం పోర్టులో రెండు జెట్టీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది. పోర్టు నుంచి స్లర్రీ పైపులైను ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యు సంస్థ 2500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా 215 మందికి ఉపాధి లభిస్తుంది. రానున్న కాలంలో పోర్టు సమీపంలో ఉక్కు కర్మాగారం, అపెరల్ పార్కు ఏర్పాటుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరించారు. దీనిపై జేఎస్‌డబ్ల్యు సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తమ బృందం ఇప్పటికే అనేక సార్లు ఏపీలో పర్యటించిందని తెలిపారు. తమ బృందం ఎప్పుడు తనతో మాట్లాడినా ఏపీ గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఒక ప్రభుత్వం టెక్నాలజీ సహాయంతో రియల్ టైమ్ గవర్నెన్సు అమలు చేయడం తానెక్కడా చూడలేదన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ఏపీ పాలసీలు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు. త్వరలోనే ఏపీకి వస్తానని, కియా గురించి తెలుసుకున్నానన్నారు. అతి తక్కువ సమయంలో ఏపీలో అనుమతులు, వౌలిక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తున్నారన్నారు. తమ బృందం ఏపీ అధికారుల స్పీడ్ గురించి చెబుతున్నారన్నారు. సింగపూర్, లక్సంబర్గ్ తరహాలో పన్ను విధానం మన దేశంలో ఉంటే దేశం మరింతగా పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయా దేశాల్లో పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల ఆధారంగా పన్నులు, రాయితీలు కల్పిస్తున్నారన్నారు.
పాలనలో విప్లవాత్మక మార్పులు అవసరం
పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో మేకింగ్ డిజిటల్ గవర్నెన్సు వర్కు, ఇండియా 4.0 మేకింగ్ టెక్నాలజీ వర్క్ ఫర్ ఆల్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు ఉంటుందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, వివిధ సర్ట్ఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా రియల్ టైమ్ గవర్నెన్సు ఉపయోగపడుతుందన్నారు. ఏపీలో ప్రభుత్వం కనిపించకుండా కేవలం పాలన మాత్రమే కనిపించే వ్యవస్థ తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఏపీలో భారీగా టెక్నాలజీ వినియోగిస్తున్నామని, కాగిత రహిత పాలన, ఈ-గవర్నెన్సు, రియల్ టైమ్ గవర్నెన్సు అమలు చేస్తున్నామన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం వల్ల ఉద్యోగాలు పోతాయన్న అపోహ ఉందని, కానీ ప్రతి పారిశ్రామిక విప్లవం తరువాత ఉద్యోగాలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. మహిళలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.