ఆంధ్రప్రదేశ్‌

మంజునాథ్ కమిషన్ ఎదుట బిసిల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ స్థానిక మంజునాథ్ కమిషన్ ఎదుట పలు బిసి సంఘాలు శుక్రవారం ఆందోళన జరిపాయి. అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిసి సంఘాలు శుక్రవారం విజయవాడ చేరుకున్నాయి. స్థానిక బెంజ్ సర్కిల్ దగ్గరున్న మంజునాథన్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకువెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత బిసి సంఘాల నాయకులు మంజునాథ కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాయి. ఆ తరువాత వారు విలేఖరులతో మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. కాపుల్లో ఎవ్వరూ వెనుకబడి లేరని అన్నారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా బిసిలు ఉంటే, ఇందులో కేవలం 26 శాతం మందికి మాత్రమే రిజర్వేషన్లు లభిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లను కూడా లాక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాపులను బిసిల్లో చేర్చే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అసైన్డ్ భూముల వినియోగంపై జీవో
విజయవాడ, జూలై 22: అసైన్డ్ భూముల వినియోగంలో రాష్ట్రంలోని పేదరైతుల ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రైతుల ఆదాయ వనరులను పెంపొందించి వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు గాను అసైన్డ్ భూములలో కూడా చేపలు, రొయ్యల చెరువులు, కోళ్ల పెంపకంతోపాటు ఉద్యానవన పంటల సాగుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 128 జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం భూమి లేని నిరుపేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిలో లాభాలు కురిపించే వ్యవసాయం చేసుకోవచ్చు. వర్షాభావం, గిట్టుబాటు ధరలు సక్రమంగా లేక సాధారణంగా ఎక్కువ పొలం ఉన్న పెద్ద రైతులే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టతరమైనందున అనుబంధ వ్యవసాయమైన ఉద్యానవన, పట్టుపురుగుల పెంపకం, పశుపోషణ, చేపల, రొయ్యల, కోళ్ల, గొర్రెలు, మేకలు వంటి ప్రయోజనకరమైన వాటికోసం వినియోగించుకోవచ్చు.
మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి
గోరంట్ల, జూలై 22: అనంతపురం జిల్లా గోరంట్లలో నాలుగేళ్ల చిన్నారి మెదడువాపు వ్యాధితో మృతి చెందింది. రెండో వార్డుకు చెందిన నేత కార్మికులు విజయ్, రజిత దంపతుల కుమార్తె కీర్తన(4) మెదడువాపు వ్యాధి సోకి గురువారం రాత్రి మృత్యువాతపడింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఐదు రోజుల క్రితం కీర్తనకు జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం స్థానిక పిహెచ్‌సికి తీసుకెళ్లగా ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం పలు ఆసుపత్రుల్లో చూపించి చివరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పాపకు మెదడువాపు వ్యాధి సోకినట్లు వైద్యులు చెప్పినట్లు తండ్రి విజయ్ తెలిపారు.
తూ.గో.లో పిడుగుపాటుకు మహిళ మృతి
రంపచోడవరం, జూలై 22: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం చుప్పరిపాలెంలో శుక్రవారం పిడుగుపాటుకు ఒక మహిళ మృతిచెందగా, మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం చుప్పరిపాలెం గ్రామంలో భారీ వర్షం కురిసింది. దుంప తోటలో గొప్పు పనులు చేయడానికి వెళ్లిన మహిళలు వర్షానికి పొలం సమీపంలోని చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో ఆ ప్రదేశంలో పిడుగు పడటంతో వెనుమల లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందింది. వెనుమల పెంటమ్మ, వేట్ల మంగాయమ్మ, వేట్ల అచ్చియ్యమ్మ అనే మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 22: తన ప్రభుత్వంలో అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వైసిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్యమంత్రి సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ అవినీతి రహిత పాలనను అందిస్తోందని అన్నారు. అభివృద్ధికి ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే, మొట్టమొదట ఆనందించే వ్యక్తిని తానేనని చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చంద్రబాబు సమర్థవంతమైన పాలనాదక్షుడని అన్నారు. ఆయన హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిడిపిలో చేరుతున్నానని ఆదిరెడ్డి చెప్పారు.