ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల... సోషల్ మీడియా ఖాతాలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి 89 నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాయలంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మీడియా సర్ట్ఫికేషన్, మానిటరింగ్ కమిటీ పని చేస్తోందని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. కొన్ని కీ పదాల ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు, ఇతర ప్రచారాలను గుర్తిస్తున్నామన్నారు. దేశంలోనే ఈ తరహా ప్రక్రియ ఏపీలో మొదటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ టీడీపీకి 48, వైకాపాకు 30, జనసేన పార్టీకి 11 నోటీసులు ఇచ్చామన్నారు. ఇవి ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లకు సంబంధించినవిగా తెలిపారు. ఆయా పార్టీల నుంచి ఇంకా సమాధానాలు రావాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని, వారిచ్చే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే చర్యలు ఉండవని స్పష్టం చేశారు. వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనిపక్షంలో ఆయా ప్రచారానికైన ఖర్చులను అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయడం లేదా పునరావృతం కాకుండా హెచ్చరించడం, పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ల పర్వం ముగిసిన నాటి నుంచి అభ్యర్థుల వారీగా సామాజిక మాధ్యమాల ఖాతాలను పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు సి-విజిల్ యాప్ అందుబాటులో ఉందన్నారు. ఇందుకు సంబంధించి 2635 బృందాలను ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఇప్పటివరకూ 1304 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వీటిలో 22 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫిర్యాదు వచ్చిన 100 నిమిషాల్లో దీనిపై స్పందించాల్సి ఉందని గుర్తుచేశారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే 2.39 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8.026 కిలోగ్రాములు, వెండి 22 కేజీలు, 7.35 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏప్రిల్ 5లోగా రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిందని, జనవరి 11 నుంచి ఇప్పటి వరకూ 15 లక్షల మంది ఓటర్లు నమోదు అయ్యారన్నారు. ఇంకా ఫారం-6కు సంబంధించి 10.62 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. పరిశీలన అనంతరం గరిష్టంగా మరో 10 లక్షల మంది ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ 1.55 లక్షల ఓట్లు తొలగించామని, చనిపోయిన, డూప్లికేట్ ఓట్లు తొలగించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియామావళిని అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని కోరారు. ఎన్నికల నియామవళి రాజకీయ పార్టీలకే కాదని, ఎన్నికల్లో పాల్గొనే వారందరికీ కూడా వర్తిస్తుందన్నారు. ఎన్నికల నియామవళిని అతిక్రమిస్తే, చర్యలతో పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్న ఫిర్యాదుపై ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సినీ నటుడు పోసాని, డైరెక్టర్ రాంగోపాల్ వర్మలకు జారీ చేసిన నోటీసులకు వారు బదులు ఇచ్చారని తెలిపారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై తదుపరి చర్యలు ఏప్రిల్ 11 తరువాత చేపడతామన్నారు. విధి నిర్వహణలో వేరే ప్రాంతంలో పని చేస్తున్న మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పనపై సానుకూలంగా స్పందించారు. వినతిపత్రాలు ఇస్తే, దానిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది