ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాదీ మామిడి రైతుకు నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 21: మామిడి ఎక్కువగా పండించే చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో రైతులకు కష్టాలే ఎదురయ్యాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులు, వర్షాలు సక్రమంగా కురవకపోవటం మామిడిపంటపై తీవ్రప్రభావం చూపింది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడే. జిల్లాలో జలవనరులు లేక పోవడం, మరోపక్క ఇతర పంటలకు ఆశించన విధంగా లాభాలు లేకపోవడం, ఇంకోపక్క ఉపాధిహామి పథకం మామిడిపంట సాగుకు కొంత చేయూతనిస్తుండటంతో జిల్లాలో ప్రతిఏటా మామిడిపంట విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడిగుజ్జు పరిశ్రమలు ఉంటడంతో ఎక్కువమంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష హెక్టార్లల్లో ప్రస్తుతం మామిడి పంట సాగవుతోంది. గత ఏడాది పంటకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులు ఉండటంతో కొంతవరకు పంట దిగుబడలు అధికంగా వచ్చినా, ధరలు లేకపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని గత ఏడాది మామిడి రైతులు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం తొలిసారిగా మామిడికి మద్దతు ధర కల్పించి జిల్లాలోని మామిడిగుజ్జు పరిశ్రమలు ద్వారా మామిడి పంటను కొనుగోలు చేసింది. జిల్లాలో ఎక్కువగా దిగుబడులు వచ్చేది తోతాపురి రకమే. దీంతో గత ఏడాది కిలో రూ 7.50 ధరతో ప్రభుత్వం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసింది.
అందులో ఐదు రూపాయలు మామిడి గుజ్జు పరిశ్రమలు, మిగిలిన 2.50 రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. కానీ మందులు, దున్నకాలు తదిత పంటసాగుకు అయిన ఖర్చులను లెక్క వేసుకొంటే రైతుకు నష్టమే మిగిలింది. విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాదైనా పంట మంచి దిగుబడులు వస్తాయని, మంచి లాభాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూసిన మామిడి రైతులకు చేదు అనుభవమే మిగిలింది. ఈ ఏడాది విపరీతమైన ఎండల కారణంగా పూతదశలోనే పంట దెబ్బతింది. వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రభావం చూపింది. దీంతో ఈసారి కూడా మామిడి రైతులు అన్ని విధాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి వాతావరణంలో నెలకొన్న మార్పులు కారణంగా సుమారు 30శాతం పంట దిగుబడి మాత్రమే వచ్చినట్లు ఉద్యానశాఖ అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవంగా పంట ఇప్పటికే రావాల్సి ఉండగా నేటికీ జిల్లాలో కాయలు పక్వానికి రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు వేలకువేలు వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఉన్న పంట కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొంత మేరకు మంచిధర ఉన్నా పంట దిగుబడులు లేకపోవడంతో రైతులు మదనపడుతున్నారు. మరోపక్క ఉన్న పంటను కాపాడుకోవాడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ జిల్లానుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు మామిడి కాయలు ఎగుమతి అయ్యేవి. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆ రాష్ట్రాల్లో కూడా పంటసాగు ఎక్కువ కావడం, ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో పంటకు అనుగుణంగా వర్షాలు కురవడంతో మంచి దిగుబడులు వచ్చాయి. దీంతో ఈసారి జిల్లానుంచి మామిడి ఎగుమతులు జరిగే పరిస్థితులు కనబడటం లేదు. దీంతో ఈ ఏడాది జిల్లా మామిడి రైతులు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మంచిధర ఉన్నపుడు దిగుబడులు లేకపోవడంతో కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులైనా దక్కితే చాలని రైతులు ఆశిస్తున్నారు.