ఆంధ్రప్రదేశ్‌

‘మట్టి’ కొట్టుకుపోతున్న ఇంజినీరింగ్ పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: మట్టి గుణం తెలియకుండా నిర్మాణం దుర్లభం..ఎటువంటి నిర్మాణానికైనా పునాది చాలా కీలకం. అటువంటి పునాది ఎంత లోతు తవ్వాలనే విషయాన్ని నిర్మాణ ప్రాంతంలోని మట్టికి నమూనా పరీక్షలు నిర్వహించి చెప్పగలిగే జలవనరుల శాఖ ప్రాంతీయ ఇంజనీరింగ్ పరిశోథనా కేంద్రాలకు ఇపుడు పునాదే లేకుండాపోయింది. ఈ కేంద్రాలకు పునాదిగా వుండే ఏపీఈఆర్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చి లేబరేటరీ) ప్రధాన కేంద్రం తెలంగాణకు పరిమితమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక అవసరాలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చి లేబరేటరీ (ఏపీఈఆర్‌ఎల్) హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 1986లో ఏర్పాటైంది. సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలోవున్న ఈ కేంద్రంలో అనేక నమూనా అధ్యయన పరీక్షలు జరిగేవి. ఈ కేంద్రం పరిధిలో మట్టి నమూనా పరీక్షలు, కాంక్రీటు, స్టీలు, మోడల్ స్టడీస్, బ్యారేజిల సెడిమెంటేషన్, ప్రాజెక్టు విశే్లషణలు, ఏ భవనానికి మృత్తిక పరీక్ష ద్వారా ఎంత లోతు పునాది తీయాలి, కాంక్రీటు మిక్సింగ్, అందుకు వాడాల్సిన మెటల్ సైజు, భవనం ఎత్తును బట్టి సిమెంటు, ఇసుక పాళ్ళు కలపడం, ప్రాజెక్టులవంటి నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు గానీ ఈ కేంద్రం నుంచి నమూనా అధ్యయన పరీక్షలు నిర్ధేశిత ఫీజు చెల్లించి పొందే అవకాశం ఉండేది. హైదరాబాద్‌లోని రాష్ట్ర స్థాయి కేంద్రం పరిధిలో కర్నూలు, ధవళేశ్వరం, వరంగల్‌లో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అధీనంలో హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌ఎల్ నడిచేది. ఇదంతా ఒకప్పటి ప్రాభవం. రాష్ట్ర విభజన అనంతరం ప్రధాన కేంద్రంతో పాటు వరంగల్ ప్రాంతీయ కేంద్రం తెలంగాణ పరిధిలో ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు కడప, ధవళేశ్వరం ప్రాంతీయ ప్రయోగశాలలు మిగిలాయి. కడప రాయలసీమ ప్రాంతానికి పరిమితమైతే, ధవళేశ్వరంలోని ప్రాంతీయ మృత్తిక ప్రయోగశాల కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రా పరిధికి పరిమితమైంది. ప్రధానమైన కేంద్రం, అధునిక ప్రయోగ యంత్ర పరికరాలు, రూ. కోట్ల విలువైన భూములు, ప్రయోగ క్షేత్రాలు, సిబ్బంది సహా తెలంగాణలో వుండిపోయాయి. వీటిని 10వ షెడ్యూలులో పెట్టడంతో ఇప్పటికీ ఆస్తుల పంపకం జరగలేదు. బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటున్నామని గొప్పలు చెప్పుకునే నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ పరిశోధనా సామర్థ్యం తగ్గడంతో పోలవరం మోడల్ స్టడీస్‌కు మాత్రం పూణే వంటి ప్రాంతాలకు మన ఇంజనీర్లను పంపించి, రూ.కోట్లు ఖర్చుపెట్టి అధ్యయన పరీక్షల నివేదికలు తెచ్చుకోవాల్సిన అగత్యంఏర్పడిందనే విషయాన్ని మరచిపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జల వనరుల శాఖ ప్రయోగశాల కీలక భాగాలు తెలంగాణలో ఉండిపోవడంతో ముఖ్యమైన ప్రయోగాలకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చి లేబరేటరీ కీలకమైన భాగమంతా తెలంగాణలో మిగిలిపోవడంతో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతీయ కేంద్రాలు అచేతనమయ్యాయి. సిబ్బంది, ప్రయోగ యంత్ర సామాగ్రి, సరంజామా అంతా తెలంగాణాలో ఉండిపోయింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో 10వ షెడ్యూల్‌లో పెట్టిన ఈ జల వనరుల శాఖ ఆస్తులు పంపకాలు లేక తెలంగాణలో ఇరుక్కుపోయాయి. మనకు పంచాల్సిన ఆస్తులన్నీ తెలంగాణలో ఇరుక్కున్నప్పటికీ పట్టించుకునే నేతలు కరవయ్యారు.ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోన ధవళేశ్వరంలో మిగిలిన ప్రాంతీయ కేంద్రానికి 432 జీవో ప్రకారం అప్పట్లోనే క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ పరిధికి అప్పగించారు. ఈ కేంద్రాలు చీఫ్ ఇంజినీర్ అధీనంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కేడర్‌లో జాయింట్ డైరెక్టర్, ఆ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేడర్‌లో డిప్యూటీ డైరెక్టర్, ప్రాంతీయ కేంద్రాల రీసెర్చి ఆఫీసర్లుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వారి దిగువన డిఈఈ కేడర్‌లో ఏఆర్వోలు, వారికి అనుసంధానంగా రీసెర్చి అసిస్టెంట్లుగా ఏఈఈలు ఉండాలి. ప్రస్తుతం అరకొర సిబ్బంది, అధికారులతో, తుప్పు పట్టిన యంత్ర పరికరాలతో నిర్వీర్యమై, నిరాదరణకు గురైన స్థితి దాపురించింది. ఇంతటి దుస్థితిలోనూ ధవళేశ్వరంలోని ప్రాంతీయ మృత్తిక పరిశోథనాశాల ఈ ఏడాది రూ.6 లక్షల ఆదాయాన్ని సముపార్జించడం గమనార్హం. అదే ఆధునిక పరిశోథనా పరికరాలు, సిబ్బంది ఉంటే పరిస్థితి ఎలావుంటుందో ఊహించవచ్చు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ పరిశోథనా కేంద్రాలను బలోపేతం చేసుకుని, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటాలను సమీకరించుకుని, మన ఇంజనీరింగ్ శక్తి, సామర్ధ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

చిత్రం...ధవళేశ్వరంలోని ప్రాంతీయ ఇంజనీరింగ్ పరిశోధనా కేంద్రం