ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల విధులతో సీఎస్‌కు సంబంధమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిది అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా నిర్వహిస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎస్ సమీక్షకు అధికారులను ఈసీ పిలవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అమలైన మూడు పథకాలకు సంబంధించి నిధుల విడుదలలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న సీఎస్ వైఖరిని బుధవారం ఒక ప్రకటనలో యనమల తప్పుపట్టారు. పేదల పథకాలకు నిధుల విడుదలపై సీఎస్ సమీక్షించటం సహేతుకం కాదన్నారు. పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతుల పెట్టుబడి సాయం బడ్జెట్‌లో ఉన్న అంశాలేనని గుర్తుచేశారు. ఈ పథకాలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు జరిపామన్నారు. ఇవి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావని, కోర్టులు కూడా ఇదే తీర్పు ఇచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు కూడా వైసీపీ నేతల పిటిషన్లను తిరస్కరించిందని చెప్పారు. కొత్తగా సీఎస్ వీటిపై రివ్యూ జరపటం హాస్యాస్పదమన్నారు. ఈ మూడు పథకాలపై 2019-20 బడ్జెట్ స్పీచ్ 2వ పేజీ 7వ పాయింట్‌లో ఉందన్నారు. తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పెద్దఎత్తున రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని, మహిళా సంఘాలకు పసుపు-కుంకుమ అందిస్తామని, పింఛన్లను పదిరెట్లు పెంచుతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పామన్నారు. దేనికి ఎన్ని నిధులు కేటాయించామో 31వ పేజీ ఎన్‌క్లోజర్‌లో ఉందని తెలిపారు. అన్నదాత సుఖీభవకు రూ. 5వేల కోట్లు, పసుపు-కుంకుమకు రూ. 4వేల కోట్లు, పింఛన్లను పదిరెట్లు చేస్తామని, వితంతువులకు రూ. 10,401 కోట్లు, దివ్యాంగులకు రూ. 2133 కోట్లు, కల్లుగీత కార్మికులకు రూ. 76 కోట్లు, డప్పు కళాకారులకు రూ. 108 కోట్లు కేటాయించటం ఎన్‌క్లోజర్లలో ఉందని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించిందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రైతులు, మహిళలకు చెక్కుల పంపిణీ జరిగిందన్నారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని కోర్టులు చెపుతున్నా సీఎస్ సమీక్షించటం సమంజసం కాదన్నారు. ఐజీఎస్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిధులే అన్నారు. అంతర్ రాష్ట్ర నిధులను కేంద్రం రాష్ట్రాలకు వాటాలు పంచుతుందని, రాష్ట్ర నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తే తప్పేంటని నిలదీశారు. ఐజీఎస్టీ నిధుల వినియోగాన్ని సీఎస్ ప్రశ్నించటం అర్ధరహితమన్నారు. రైతు రుణమాఫీ 4, 5 విడతల నిధులను కూడా వెంటనే చెల్లిస్తామన్నారు. ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల మొదటి వారంలో చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. రుణం తీసుకోమని ఇప్పటికే సాధికార సంస్థకు ఆదేశాలిచ్చామని, నిధులు సమీకరించుకోవాలని సూచించామని, ఆలస్యమైనా 10శాతం వడ్డీతో సహా రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీనిపై రైతుల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. ఎన్నికల ప్రక్రియతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎలాంటి సంబంధం ఉండదని చెప్తూ 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 13సీ(సీ)లో ఈ విషయాన్ని పొందుపరిచారన్నారు. కోడ్ అమలులోకి వచ్చాక కలెక్టర్లు అంతా రిటర్నింగ్ అధికారులేనని, మిగిలిన ప్రధాన అధికారులంతా ఈసీ కింద డిప్యూటేషన్‌పై ఉన్నట్లు భావించాలని చాప్టర్ పార్ట్-2(ఎ)లో ఉందన్నారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులంతా సీఈఓ పర్యవేక్షణలో ఉంటారని, అలాంటిది సీఎస్ సమీక్షకు హాజరుకావాల్సిందిగా కలెక్టర్లను సీఈఓ ఆదేశించటం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు.