ఆంధ్రప్రదేశ్‌

పంట ధరను రైతు నిర్ణయించే రోజులు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 24: దేశంలో పండించే పంటకు రైతే ధర నిర్ణయించే రోజులు రావాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం బుధవారం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవగా, కులపతి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ హాజరయ్యారు. వీరికి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, స్టేట్ ప్రొటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ బాబు, జేసీ గిరీష, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, వర్శిటీ ఉప కులపతి డాక్టర్ వై హరిబావు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదరంలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్నాతకోత్సవ సభలో ప్రసంగిస్తూ రైతు మరణాలపై 3500 మందిపై సమీక్షిస్తే వ్యవసాయంతోపాటుగా పాడి పశుసంపద లేనివారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. పాడి పశువుల పెంపకం ప్రతి రైతు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదివిన చదువుకు, ప్రతిభకు, గురువుల శిక్షణకు నేడు విద్యార్థులు పట్టాలు అందుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులను. మాతృదేశాన్ని, జన్మభూమిని, మాతృభాషను, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను ఎప్పటికీ మరచిపోరాదన్నారు. మన సంస్కృతికి విలువనివ్వాలని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నామని, ప్రతి వస్తువు ధరను ఆయా కంపెనీలు నిర్ణయిస్తుంటే రైతు మాత్రం తాను పండించిన పంటకు ధరను నిర్ణయించలేని స్థితి నేడు ఉందన్నారు. గతంలో వ్యవసాయంలో రైతు నష్టపోతే పాడి పశువుల పెంపకం వల్ల ఆ నష్టాన్ని సరిచేసుకునే వారని చెప్పారు. గతంలో ప్రతి రైతు ఇంట సహజీవనం చేసే విధంగా పశువులు, గొర్రెలు, ఆవులు పెంచేవారని, నేడు అది లేదన్నారు. అందుకే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు ఆలోచించి ఆనాటి రోజులు గుర్తు చేసుకుని వ్యవసాయానికి తోడు పశు సంపదను పెంచాలని చెప్పారు. ఇందుకు పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులుగా మీ పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. మన దేవుళ్లకు పశువులే వాహనాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పశువుల కోసం ఒక పండుగ ఉందని గుర్తు చేశారు. మనది పవిత్ర సంస్కృతి అని, రానున్న తరాలకు దానిని అందించాలని సూచించారు. ప్రపంచానికి మనదేశం విశ్వగురువని, నలంద, తక్షశిల, పుష్పగిరి విశ్వవిద్యాలయాల్లో విద్యకోసం విదేశాల నుంచి వచ్చేవారన్నారు. చైనా చరిత్రకారులు హుయత్సాంగ్, పాహియాన్‌లు వంటి వారే మనదేశం విద్యారంగంలో మేటి అని ఆనాడే పొగిడారన్నారు. విద్యారంగంలో మనదేశం విశ్వ గురువుగా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. పరాయి పాలనలో సంపద, విజ్ఞానం వంటివి పోగొట్టుకున్నామని చెప్పారు. అందుకే మార్పు రావాలని, యూనివర్శిటీల స్నాతకోత్సవంలో విద్యార్థులు పాశ్చాత్య గౌన్లు ధరించడం మానుకుని ఇక నుంచి మన సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ ఛాన్సలర్‌కు, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులకు, వైస్ ఛాన్సలర్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు. పాశ్చాత్య పరిపాలన నుంచి మనం బయటకు వచ్చి అన్ని రంగాల్లో మార్పు తీసుకురావాలని రాజ్యసభలో సభ్యులు ఏదైనా ప్రశ్న వేయాలంటే ఐ బెగ్ అని ప్రారంభించే విధానాన్ని నేడు ఐ రైజ్ అనే ప్రారంభించే విధంగా మార్పు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రకృతిలో పశు సంపద ప్రధానం, వాటితో మన అనుబంధం ప్రధానమని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన అనుబంధం వాటితో ఉంటుందని, అందుకే వాటి అభివృద్ధి ప్రధానమని ఆయన వివరించారు. మనదేశ జీడీపీ 17 శాతంగా ఉంటే అందులో 27 శాతం పశుసంపద వల్లేనన్నారు. మన జాతి సంపద ఒంగోలు గిత్త, పుంగనూరు ఆవులకు ప్రాధానత్యనిచ్చి ప్రోత్సహించాలన్నారు. నేడు ఒంగోలు గిత్తను బ్రెజిల్ దేశంలో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అగ్రికల్చర్ మన దేశ కల్చర్ అనే విషయం మరచిపోరాదన్నారు. వెటర్నరీ విద్యార్థులు, సైంటిస్టులు తమ ప్రజ్ఞా పాటవాలను, సాంకేతికతను రైతన్నలకు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పాడి పరిశ్రమను, పశుపోషణను, ఇంటి ముంగిట కోళ్ల పెంపకాన్ని రైతన్నలకు ప్రత్యామ్నాయ, లాభసాటి ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని చెప్పారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పాలన్నారు. రానున్న 10 సంవత్సరాల్లో 10 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం రూపుదిద్దుకోనున్నదని, దానికి కారణం నేటి సంస్కరణలు, సాంకేతిక అభివృద్ధి, పరస్పర సహకారం అన్నారు. ఇది ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్‌ల అంచనాలన్నారు. మానవుని ఆరోగ్యం ముఖ్యమని, యోగ మన ప్రాచీన కళన్నారు. ఇది ప్రధాని మోదీ కోసం కాకుండా మన బాడీ కోసం యోగ చేయాలన్నారు. లేదంటే ఎవరికి నచ్చిన క్రీడల్లో గంటపాటు పాల్గొనాలన్నారు. మన ఆహారపు అలవాట్లు మరచిపోరాదని ఆయన తెలిపారు. అనంతరం వర్శిటీ కులపతి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ పశువులు, జంతువులు ఇతర ప్రాణులపట్ల కరుణ, సానుభూతితో మెలగాలని చెప్పారు. పశువైద్యులుగా విద్యార్థుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. మారుతున్న పోకడలు బట్టి కొత్త ఔషధాలపై దృష్టి సారించాలన్నారు. మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు కావాలని సూచించారు. అనంతరం 2018 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాపరమైన ప్రతి కనబరచిన ఇద్దరు పీహెచ్‌డీ, ఆరుగురు పీజీ, 19 మంది యూజీ, ఇద్దరు డెయిరీ టెక్నాలజీలో బీటెక్, ముగ్గురు మత్స్యశాస్త్ర విద్యార్థులకు 32 బంగారు పతకాలను, ఒకరికి కాంస్య పతకాన్ని, మరొకరికి నగదు బహుమతిని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అందించారు. అలాగే 2018లో బివీఎస్సీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, ఏఎఫ్‌ఎస్పీ పూర్తి చేసిన 231 మంది యూజీ విద్యార్థులకు, పీహెచ్‌డీ పూర్తి చేసిన 80 మందికి, ఎంవీ ఎస్సీ పూర్తి చేసిన ముగ్గురికి, డెయిరీ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన ఒకరికి పట్టాలను ప్రదానం చేశారు. రీసెర్చ్ అండ్ టీచింగ్‌లో డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ జీవన సాఫల్య పురస్కారాన్ని బెంగళూరులోని ఎన్.ఐ.ఏ.ఎన్.పి. విశ్రాంత సంచాలకులు డాక్టర్ సి.ఎన్.ప్రసాద్‌కు, నీలకంఠాపురం శ్రీరామరెడ్డి ఉత్తమ పరిశోధన పురస్కారాన్ని తిరుపతి పశువైద్య కళాశాల పశు ఆహార పోషక విభాగాధిపతి డాక్టర్ అరుణాచలం రవికి, పశువైద్య విశ్వవిద్యాల ప్రతిభావంతమైన అధ్యాపకుల అవార్డును ఈ ఏడాది పశువైద్య కళాశాల సహ ఆచార్యులు డాక్టర్ ఎన్.వి.వి.హరికృష్ణకు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాల సహ ఆచార్యులు డాక్టర్ టి.నీరజకు, పశువైద్య కళాశాల పూర్వపు విద్యార్థి జాతీయస్థాయి డాక్టర్ ప్రతాప్ వి.రెడ్డి బంగారు పతకాన్ని తెలంగాణలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి డాక్టర్ బాల్సింగ్ జీవన్ ప్రకాష్‌కు అందించారు.
చిత్రం... శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు, సర్ట్ఫికెట్లు అందజేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్