ఆంధ్రప్రదేశ్‌

ఎడతెగని ఉత్కంఠకు నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 22: సార్వత్రిక ఎన్నికల సమరంలో విజేతలెవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. గత నెలా పదిరోజులుగా పలురకాల ఊహాగానాలు, విశే్లషణలు, సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ సర్వేలతో నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అమరావతికి క్యూ కడుతున్నారు. కేంద్రంలో ఎన్డీయేతర ఐక్య ఫ్రంట్ ఏర్పాటుపై గత మూడు రోజులుగా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక టూర్లతో బిజీబిజీగా గడిపిన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నానికి ఉండవల్లి చేరుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజధానికి వచ్చిన చంద్రబాబు కౌంటింగ్‌కు సంబంధించి క్యాడర్‌కు టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై తమ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తోందని ఏ మాత్రం ఆదమరచినా నష్టం తప్పదని హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు లెక్కింపు కేంద్రాల వద్ద అధికారులపై ఆధారపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నేతలతో ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఫలితాలపై విశే్లషించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని లేకపోతే మొత్తం ప్రక్రియకే విఘాతం కలుగుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో కొన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినందున ప్రతి ఒక్క ఓటు లెక్కింపుపై జాగ్రత్త వహించాలన్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుని పార్టీ నేతలతో విశే్లషణలు జరిపారు. ఓట్ల లెక్కింపుపై పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని జగన్ ఆదేశించారు. జగన్ గృహప్రవేశానంతరం కౌంటింగ్ సందర్భంగా సొంతింటికి వస్తున్న సందర్భంగా తాడేపల్లిలో ఆయన ఇంటి వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు, జగన్ నివాసాలకు చేరువలోనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు, బాపట్ల పార్లమెంట్‌తో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో జాతీయ రహదారిపై పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయటం, అధినేతల నివాసాలు ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఇంతకు ముందనె్నడూలేని రీతిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉండవల్లి ప్రజావేదిక, తాడేపల్లి జగన్ నివాసాల వద్ద పార్టీనాయకులు, మీడియాకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ భీమవరం, గాజువాకతో పాటు పలు కేంద్రాల్లో కౌంటింగ్ సరళిని పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు పూర్తయ్యే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచనలిస్తున్నారు. పోలింగ్ ఎన్నికల సందర్భంగా రాయలసీమ ప్రాంతంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు పోలీస్ యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామరక్షగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ సారి పోలింగ్ అత్యధికశాతం జరిగినందున బొటాబొటీ మెజారిటీ అనేది ఉండదని పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత వల్లే ఓటింగ్ పెరిగిందని ఇది తమ పార్టీకే అనుకూలిస్తుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల మేర జోరుగా పందేలు జరిగాయి. ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపారనేది తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.