ఆంధ్రప్రదేశ్‌

జగన్ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 24: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. పది స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఇపుడు గెలుపొందిన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జిల్లాలో విస్తృతంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. వారి వారి సమర్థత, పార్టీ పట్ల విధేయతను బట్టే జగన్మోహన్‌రెడ్డి మంత్రి పదవికి అవకాశం కల్పిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పలువురు ఆశావహుల పేర్లు అందరి నోటా నానుతున్నాయి. అందరిలోనూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన విధంగా తన వంతు సహకారం అందిస్తూ వచ్చిన గౌతంరెడ్డిపై జగన్‌కు సదుద్దేశ్యం ఉంది. ఇదే సమయంలో పార్టీ వ్యవస్థాపక సమయంలో వెంట ఉన్న గౌతంరెడ్డి తండ్రి మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆ తర్వాత కూడా పార్టీ కోసం ఒకసారి, ప్రత్యేక హోదా కోసం మరోసారి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీనికి తోడు ప్రస్తుత ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయాలని భావించినా పార్టీ అధ్యక్షుడు జగన్ సూచనమేరకు పోటీ నుంచి తప్పుకుని తెలుగుదేశం నుంచి వలస వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అవకాశం కల్పించిన సంఘటనలు మేకపాటి కుటుంబానికి జగన్మోహన్‌రెడ్డి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచాయనడంలో అతిశయోక్తి లేదు.
దీంతో గౌతంరెడ్డికే తొలి అవకాశం ఉంటుందనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రిగా ఎంతో సీనియర్ అయిన ఆనం రామనారాయణరెడ్డి సహకారం కేబినెట్‌లో ఉంటే బాగుంటుందని, మొదటిసారి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో గతంలో ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించారనే పేరున్న ఆనంను కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఆయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. వీరిద్దరితో పాటు సూళ్లూరుపేట, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పొలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోనే 61వేల రికార్డు మెజార్టీ సాధించడంతో కిలివేటి పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించాలని భావిస్తే కిలివేటి పేరు తప్పక పరిశీలనలోకి తీసుకుంటారని సూళ్లూరుపేట వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే బీసీ వర్గాల నుండి నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కు అవకాశాలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో బలమైన అభ్యర్థయిన మంత్రి నారాయణను ఢీకొని గెలవడం ఆయనకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. మంత్రి పదవి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేలకు మాత్రమే ఇవ్వాలని భావిస్తే మాత్రం అనిల్‌కుమార్ కాస్తా అమాత్యుడిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేరు కూడా మంత్రి పదవికి వినిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీకి వీర విధేయుడిగా మెలుగుతుండడం, వివాదరహితుడనే ముద్ర ఆయనకు కలిసొచ్చే అంశాలుగా పేర్కొనవచ్చు. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో శనివారం సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఎవరెవరు మంత్రి పదవుల్లో ఉంటారు, ఏ ఏ శాఖలు కూడా కేటాయిస్తారో ముందుగానే వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతుండడం కొసమెరుపు.