ఆంధ్రప్రదేశ్‌

తూర్పు తీర్పు విలక్షణం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 24: వైవిధ్యమైన ఫలితాలకు ఆలవాలమైన తూర్పు గోదావరి జిల్లా ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం విలక్షణ తీర్పునిచ్చింది. ఏ పార్టీకైనా ఎపుడైనా స్పష్టమైన మెజార్టీనే ఇస్తూవచ్చిన తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే ఆనవాయితీని మరోసారి రుజువైంది. వైఎస్ పాదయాత్ర చేసిన అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో తూర్పులో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అపుడు పనికి ఆహార పథకంలో అవినీతి పెచ్చుమీరి పోయిందని వెళ్ళిన ప్రతీ చోటా వైఎస్ ఎండగట్టేవారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఆ పాదయాత్ర సమయంలోనే మొగ్గతొడిగాయి. ఇపుడు ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో నవరత్నాలు చల్లుకుంటూ వెళ్లడంతో ప్రజలు అందుకున్నారు. అదేక్రమంలో ఇసుక, మట్టి అక్రమ విక్రయాలతోపాటు జిల్లోలోని పలువురు శాసన సభ్యుల అవినీతిని ఎండగట్టారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీపై ప్రజల కోపం ఇంతలావుంటుందా అనే తీరులో ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లాలో పూర్తిస్థాయిలో విజయఢంకా మోగించింది. ఏడాది క్రితం ఇదే రోజుల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తూ వెళ్ళారు. జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ ఖాతాలోకి వెళ్ళగా టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలోనే జనసేనకు ఒకే ఒక్క సీటు ఇక్కడ నుంచే దక్కింది. ఎంతో ధీమాగావున్న తెలుగుదేశం పార్టీని సంక్షేమ పథకాలు గట్టెక్కించలేక పోయాయి. గత సార్వత్రిక (2014) ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్ధి ఎస్‌విఎస్‌వర్మ సాధించగా ఇపుడు రాష్ట్రంలోనే అధిక మెజార్టీ ఈ జిల్లాలోని అనపర్తి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సాధించారు. పిఠాపురంలోని అప్పటి స్వతంత్ర అభ్యర్ధి, ఇపుడు టీడీపీ అభ్యర్ధి వర్మకు అప్పట్లో 48వేల 80 ఓట్లు మెజార్టీ రావడం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ అయితే ఇపుడు అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి 53వేల 791 ఓట్లు అత్యధిక మెజార్టీ సాధించడం రికార్డుగా నిలిచింది. అయితే నాడు పిఠాపురం నుండి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన వర్మ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరాజయం చెందారు. ఇపుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు 14వేల 992 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రంపచోడవరంలో 39 వేల 106 ఓట్ల మెజార్టీతో రెండు అతి పెద్ద మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి నాగులపల్లి నాగలక్ష్మి విజయం సాధించారు. ఆ తర్వాతి స్థానంలో 31వేల 772 ఓట్ల మెజార్టీలో రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు జక్కంపూడి రాజా విజయం సాధించారు. గత ఎన్నికల్లో మండపేట నుంచి 36వేల 14 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధి వేగుళ్ళ జోగేశ్వరరావు ఇపుడు 10 వేల 680 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ సాధించారు. ఇక టీడీపీ గెలుచుకున్న మరో స్థానమైన పెద్దాపురంలో రాష్ట్ర డిప్యూటీ సీ ఎం నిమ్మకాయల చిన రాజప్ప గత 2014లో 10వేల 663 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా ఇపుడు కేవలం 4వేల 417 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధి డాక్టర్ ఆకుల సత్యనారాయణ 26వేల 377 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 30వేల 436 ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావుపై టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి భవానీ ఘన విజయం సాధించారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి 2014లో 18 వేల 178 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుత ఎన్నికల్లో 10వేల 662 ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్ధి ఆకుల వీర్రాజుపై విజయం సాధించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇటు టీడీపీ నుంచి అటు వైసీపీ నుంచి ఒక్కో మహిళా శాసన సభ్యురాలు ప్రాతినిధ్యం వహించడం గత ఎన్నికల నుంచి ఆనవాయితీగా కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించిన వంతల రాజేశ్వరి అనంతరం టీడీపీలో చేరి ఈ ఎన్నికల్లో పోటీచేశారు. దీంతో ఆమె స్థానంలో నాగులాపల్లి ధనలక్ష్మి వైసీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో సమీపం టీడీపీ అభ్యర్ధి వంతల రాజేశ్వరిపై విజయం సాధించి వైసీపీ మహిళా స్థానాన్ని నిలిపారు. టీడీపీలో గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంతలక్ష్మి విజయం సాధించగా ఇపుడు ఆ స్థానంలో కూడా వైసీపీ అభ్యర్ధి కురసాల కన్నబాబు విజయం సాధించారు. ఆ స్థానానికి ప్రతిగా అన్నట్టుగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి భవాన్ని 30వేల 436 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించి టీడీపీ మహిళా స్థానాన్ని పదిల పర్చినట్టయింది. ఇటు టీడీపీకి, అటు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు పదిలంగానే దక్కాయని చెప్పొచ్చు. కాగా 2 లక్షల 53వేల 87 ఓట్లు కలిగిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి 30వేల 436 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి భవాని విజయం గెలుపొందగా, 2 లక్షల 60వేల 323 ఓట్లు కలిగిన రంపచోడవరం నియోజకవర్గం నుంచి జిల్లాలోనే రెండవ అతి పెద్ద ఆధిక్యతగా 39వేల 106 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు.
గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే..1999లో టీడీపీకి తిరుగులేని ఆధిపత్యం లభించింది. బీజేపీతో స్నేహంతో 18 స్థానాల్లో పోటీచేసి అన్నీ కైవసం చేసుకుంది. అప్పట్లో ఒక్క కడియం మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. 2004లో కాంగ్రెస్ గాలి ప్రభంజనంగా మారింది. దీంతో జిల్లాలో 16 స్థానాలను స్పష్టమైన మెజార్టీ ఇచ్చి అధికారం లభించడంతో రాష్ట్ర అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బీజేపీ నుండి గెలిచిన పెండెం దొరబాబు ఇపుడు వైపీసీ నుంచి అక్కడ నుంచే గెలవడం విశేషం. ఇక 2009లో ప్రజారాజ్యం రాకతో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు, ప్రజారాజ్యం నాలుగు స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట, రంపచోడవరం స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇపుడు (2019) కూడా ఈ ఐదు స్థానాలతో పాటు పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, కొత్తపేట, రాజానగరం స్థానాల్లో విజయం ఢంకా మోగించి జిల్లాలో స్పష్టమైన మెజార్టీతో రాష్ట్ధ్రాకారాన్ని సాధించుకుంది.