ఆంధ్రప్రదేశ్‌

గ్రిడ్లపై చంద్రబాబు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: నవ్యాంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమిస్తున్న బాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐదు గ్రిడ్లను పూర్తి చేసేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇవి పూర్తయితే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు పరిష్కారమవుతాయన్న ప్రణాళికతో బాబు వాటిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా గ్రిడ్ల నిర్మాణాలు పూర్తయితే పెట్టుబడులు పెద్ద సంఖ్యలో వస్తాయన్న ధీమాతో బాబు ప్రభుత్వం కనిపిస్తోంది. ఏపిలో ఉన్న అపార వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, దానికోసం ఎంచుకున్న ఐదు గ్రిడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తోంది. పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్‌గ్రిడ్, వాటర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్లతో రాష్ట్రంలో ఉన్న 977 కిలోమీటర్ల సముద్ర గర్భతీర ప్రాంత పరిథిలోని ఖనిజ సంపదను వినియోగంలోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటుచేసిన పవర్ గ్రిడ్ లక్ష్యసాధనలో పురోగమిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. లోటు నుంచి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మారిన నేపథ్యంలో విద్యత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, పొదుపు, సంరక్షణ విధానాలపై బాబు చూపిన వ్యక్తిగత ఆసక్తి, కృషి ఫలితంగా ఏపికి వరసగా అవార్డులు లభించడంతోపాటు, వందశాతం విద్యుదీకరణ పూర్తయిన రాష్ట్రంగా రికార్డుకెక్కింది. 4.35లక్షల మందికి కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా, రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు కనెక్షన్లు ఉన్న జిల్లాగా పశ్చిమగోదావరి అవతరించింది. 3010 కోట్ల ఖర్చుతో భారీ తుపాన్లు వచ్చినా విద్యుత్ లైన్లు దెబ్బతినకుండా, భూగర్భ విద్యుత్ లైన్ల కోసం ప్రణాళిక రూపొందించారు.
రానున్న ఐదేళ్లలో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా, గ్యాస్ సరఫరా కోసం యాక్షన్‌ప్లాన్ రూపొందించింది. విశాఖ జిల్లా గంగవరం వద్ద ఎల్‌పిజి టెర్మినల్ ఏర్పాటుచేస్తున్నారు. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు వద్ద ఫ్లోటింగ్‌స్టోరేజీ, రీ గ్యాసిఫికేషన్ యూనిట్ నిర్మాణంలో ఉంది. కాకినాడ-విశాఖ వరకూ గ్యాస్ పైప్‌లైన్, ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పర్యావరణ అనుమతులు కూడా రావడం ఊరట కలిగించింది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా జిల్లాలోని ప్రతి ఇంటికి ఈ సంవత్సరంలోనే గ్యాస్ పంపిణీ చేయనుంది. 2017 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్ సర్వే చివరి దశకు వచ్చింది. కొవ్వూరు సీఎన్‌జి స్టేషన్ ఇప్పటికే ప్రారంభం కాగా, రోజుకుసగటున 50 కిలోల అమ్మకం జరుగుతోంది. ఇలాంటివి మరో 10 స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2019 నాటికి మారుమూల ప్రాంతాల్లో నీటి సమస్య తీర్చేందుకు రూపొందించిన వాటర్ గ్రిడ్ కోసం, బాబు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. దీనికి 10వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ ఏడాదిలో చేపట్టిన పనులు పూర్తి చేయడానికి, వెయ్యికోట్ల రూపాయలను జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద పొందేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తోంది.
ఇక ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఫైబర్‌గ్రిడ్ మరికొద్దిరోజుల్లో రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురానుంది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్, కేబుల్ టివి ప్రసారాలు, టెలిఫోన్ సౌకర్యాన్ని 149 రూపాయలకే ఇచ్చేలా ప్రాజెక్టు రూపొందించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 8 జిల్లాల్లో ఈ పనులు పూర్తయ్యాయి. 23500కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌లైన్లలో 21300 కిలోమీటర్ల లైన్లు పూర్తవగా, తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామంలో ఆగస్టు 15న బాబు ఈ ఫైబర్‌నెట్‌వర్క్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాల నుంచి 9 జిల్లాల సముద్రతీరం-జాతీయ రహదారులను కలిపేలా, రోడ్లు నిర్మించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన రోడ్‌గ్రిడ్‌ను బాబు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. 46,440 కిలోమీటర్ల రోడ్లను క్రమంగా జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నారు. ప్రధాన నగరాల చుట్టూ ఔటర్‌రింగ్‌రోడ్లను ఏర్పాటుచేస్తారు. కీలకమైన ఈ ఐదు గ్రిడ్లు పూర్తి చేయటం ద్వారా, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, పెట్టుబడిదారులు కూడా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువస్తారని బాబు ప్రభుత్వం భావిస్తోంది.