ఆంధ్రప్రదేశ్‌

నూతన మద్య విధానం అమలుపై మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 14: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధాన్ని తీసుకువస్తామన్న హామీని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో ఈనెల 30వ తేదీతో 2017-19 సంవత్సరాలకు గాను మద్యం షాపులు, బార్‌ల లైసెన్సు గడువు ముగియనుంది. జూలై నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అయితే నూతన మద్యం పాలసీని రూపొందించే అంశంపై ఉన్నత స్థాయి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 4,200 మద్యం షాపులు, 800కు పైగా బార్‌లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 17,500 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతోంది. తొలిదశలో ఇప్పుడున్న వాటిలో 10 శాతం మేర వైన్‌షాపులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. షాపుల సంఖ్య తగ్గించినప్పటికీ ఆదాయం తగ్గకుండా ఉండేలా చూసేందుకు ఎక్సైజ్, రెవెన్యూ అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు సమాచారం.
2017-19 సంవత్సరాలకు గాను అప్పటి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో మద్యం షాపులు, బార్‌లకు లైసెన్సు ఫీజులను నిర్ణయించింది. 5 వేల మంది జనాభాలోపు ఉన్న ప్రాంతంలో మద్యంషాపుల నిర్వహణకు సంవత్సరానికి 7.5 లక్షల మేర చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5 వేల నుంచి 10 వేల మంది జనాభా గల ప్రాంతంలో 8.5 లక్షలు, 10 నుండి 20 వేల మంది జనాభా గల ప్రాంతంలో 9.25 లక్షలు, 25 వేల నుంచి 50 వేల మంది జనాభా ఉన్న ప్రాంతంలో 10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతంలో 11.25 లక్షలు, 3 నుండి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతంలో 12.50 లక్షలు, 5 లక్షల మంది జనాభా పైబడి ఉన్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 16.25 లక్షల రూపాయల మేర పాటదారుడు చెల్లించాల్సి ఉంది. బార్‌ల లైసెన్సు మంజూరు విషయంలోనూ 2017-22 సంవత్సరాలకు గాను వివిధ శ్లాబ్‌లను అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద 8 లక్షల రూపాయలు, లైసెన్సు ఫీజు కింద మరో రూ. 2 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 50 వేల నుంచి 5 లక్షల మంది జనాభా గల ప్రాంతంలో రూ.18 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల జనాభా పైబడిన ప్రాంతాల్లో రూ.28 లక్షలు, లైసెన్సు ఫీజు కింద 2 లక్షల రూపాయలను నిర్ణయించింది. నూతన మద్యం పాలసి రూపొందించే క్రమంలో ఉన్నతస్థాయి అధికారులు ప్రభుత్వం ముందు పలు సూచనలు, సలహాలు ఉంచనున్నారు. ఇందులో భాగంగా 10 శాతం మేర షాపుల సంఖ్యను తగ్గిస్తూనే ఆదాయాన్ని యథాతథంగా ఉంచేందుకు లైసెన్సు ఫీజును రెట్టింపు చేయాలన్న సూచనను ప్రభుత్వానికి సూచించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధానాన్ని అమలులోకి తెచ్చి సఫలీకృతమైన అంశాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం పాలసీ అమలుపై అధ్యయనం చేయాల్సిందిగా అధికార బృందాలను పంపించారు. నూతన మద్యం పాలసీని రూపొందించేందుకు ఆలస్యమయ్యే క్రమంలో ప్రస్తుతం ఉన్న లైసెన్సులను మరో మూడు నెలలు పొడిగించేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ ప్రభుత్వమే మద్యంషాపులను నిర్వహించాలంటే ఒక్కో మద్యంషాపుకు ఒక ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు సహాయకులు అవసరం ఉంది. ప్రభుత్వమే నేరుగా మద్యం షాపులను నిర్వహించదలిస్తే అందుకుతగిన విధివిధానాలు, సాద్యాసాధ్యాలపై అధికార యంత్రాంగం అధ్యయనం ప్రారంభించింది. మొత్తమీద రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేద హామీని అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.