ఆంధ్రప్రదేశ్‌

ఏపీఈపీడీసీఎల్‌కు సవాల్‌గా మారిన విద్యుత్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: నైరుతి రుతు పవనాలు విద్యుత్ శాఖ ఆశలను నీరుగారుస్తున్నాయి. రుతు పవనాలు కేరళను తాకడంతో ఇక ఏపీలోకి ప్రవేశిస్తాయని, వర్షాలకు లోటు ఉండదని భావించిన ఈ శాఖకు మండుడున్న ఎండలతో గట్టి దెబ్బే తగిలింది. రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురిసినా, ఏపీ, తెలంగాణాకు నైరుతి రుతు పవనాలు తాకినా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఏపీఈపీడీసీఎల్ పడిన ఆశలు ఇపుడు అడియాశలే అయ్యాయి. జూన్‌లో సగం రోజులు గడిచినా తొలకరి ఎక్కడా తొంగి చూడకపోవడం, రుతు పవనాలు ఏపీకి సమీపించకపోవడం, దీనికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఇవన్నీ ఈపీడీసీఎల్ యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తున్నాయి.
అనూహ్యంగా పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను ఏ విధంగా తట్టుకోవాలా అని మదన పడుతోంది. సోలార్, విండ్ ప్రత్యామ్నాయంగా ఉన్నా ఏమాత్రం ఫలితం లేకపోతోంది. గత రెండు రోజులుగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంధించి రోజూ 3450 మెగావాట్ల విద్యుత్ వాడకం ఉంటోంది. పెరిగిన విద్యుత్ వాడకానికి అనుగుణంగా ఏం చేయాలో తెలియక సంబంధిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గత మే 10న ఒక్కరోజులోనే 3479 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగింది.
ఈ రికార్డును అధిగమించి తొలకరి వర్షాలు పడే జూన్ రెండో వారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఈపీడీసీఎల్ యాజమాన్యం అనేక మార్గాలను అనే్వషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం క్షేత్రస్థాయి నుంచి ఇంజనీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో వేర్వేరుగా సీఎండీ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగలే తొమ్మిది గంటలపాటు ఇవ్వాలని, దీనిపై ఏపీఈపీడీసీఎల్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తరచూ ఎదురయ్యే సాంకేతికపరమైన సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ సవ్యంగా ఉండి తీరాలని, గాలులు వీస్తున్న సందర్భాల్లో ఇవి దెబ్బతినే పరిస్థితులను ఎప్పటికపుడు గుర్తించాలని సూచించారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండల కేంద్రాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధమైన విద్యుత్ సంబంధిత సమస్యలు లేకుండా చేయాలన్నారు. రుతు పవనాలు ప్రవేశించి పడే వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అంతరాయాల్లేని సరఫరాను అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు, తుపాన్లతో విద్యుత్ వ్యవస్థకు నష్టం ఏర్పడే పరిస్థితులను ముందుగానే సమీక్షించుకుని అందుకు తగినట్టుగా సంస్థ యాజమాన్యం అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.