ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో 6 బొటానికల్ గార్డెన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఏపీ పీఎస్సీ ద్వారా 504 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో 6 బొటానికల్ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐఎఫ్‌ఎస్‌ఆర్ 2017 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2141 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
తమ ప్రభుత్వం పచ్చదనానికి మరింత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా 2019-20 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందని వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం, సీఎఎంపీఏ పథకాల ద్వారా రూ. 175 కోట్ల విలువైన చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రూ 54.30 కోట్లతో 5 నగరవనాలు, 5 పర్యావరణ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 12 నగరవనాలు ఏర్పాటయ్యాయని, కొత్తగా రూ. 30 కోట్లతో మరో ఐదింటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎకో టూరిజంలో భాగంగా గతంలో 22 టూరిజం కేంద్రాలు ఏర్పాటయ్యాయని, ఈ ఏడాది రూ 22.30 కోట్ల వ్యయంతో మరో 5 కేంద్రాలను నెలకొల్పుతామని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఆరు బొటానికల్ గార్డెన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అటవీశాఖ అధీనంలో ప్రస్తుతం 5వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే విక్రయాలు జరుపుతామన్నారు. ఎర్ర చందనం వృక్షజాతి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు 287 మందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని వారికి అధునాతన ఆయుధాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే 125 రివాల్వర్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్తూ మరో 250 యాక్షన్ పంప్ తుపాకులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశామన్నారు. రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ఫోర్స్ విభాగాన్ని ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మృతివనాన్ని పావురాల గుట్టలో ఏర్పాటు చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో రూ 22.5 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఒడిశా సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలో గత కొంత కాలంగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయని, ఏనుగుల గుంపు దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవటమేకాక పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో మృతిచెందిన వారికి రూ 5లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ 6వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఏనుగుల దాడిలో మృతిచెందిన ఇరువురు మహిళల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా త్వరలో చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, పీసీసీఎఫ్ (ఎఫ్‌ఆర్) డాక్టర్ భాస్కర రమణమూర్తి, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి నళినీమోహన్, పలువురు అటవీ, కాలుష్యనియంత్రణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి