ఆంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 9: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. పశ్చిమ దిశగా పయనిస్తూ తీరాన్ని దాటవచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేనప్పటికీ రుతుపవనాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో ఒకటి,రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ధవళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి ఉద్ధృతి

రాజమహేంద్రవరం, ఆగస్టు 9: గోదావరి నది పరవళ్లు తొక్కుతూ సముద్రం పాలవుతోంది. వరద కారణంగా నిత్యం లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద తాకిడితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి మంగళవారం తగ్గుముఖం పట్టింది. వరద తాకిడి మొదలైనప్పటి నుంచి రోజూ లక్షల క్యూసెక్కుల జీవ జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. అంత్య పుష్కరాలు మొదలైన మొదటి మూడు రోజులు వరద తాడికి లేకపోవడంతో స్నానాలకు అనువుగా ఉండే విధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత వరద ఉద్ధృతి పెరగడంతో బ్యారేజి గేట్లను ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గత నాలుగు రోజులుగా పరిశీలిస్తే రోజుకు సరాసరి ఆరు లక్షల చొప్పున 25 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి. కృష్ణా జిల్లాలో ఏర్పడిన గండి కారణంగా పట్టిసం ఎత్తిపోతల పథకం కూడా నిలిపివేయడంతో కొన్ని వేల క్యూసెక్కుల తరలింపు కూడా నిలిచిపోయింది.

రూ. 3కోట్లు విలువైన ఎర్రచందనం స్వాధీనం

రేణిగుంట, ఆగస్టు 9: రేణిగుంట పోలీసులు మంగళవారం భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు రూ.3 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 20 మంది పరారు కాగా ఒక్కరిని అరెస్ట్‌చేసినట్లు టాస్క్ఫోర్స్ డి ఎస్పీ రవికుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం మామండూరు, శెట్టిపల్లి మధ్యలోని అటవీప్రాంతం వద్ద ఉన్న రైల్వేట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలు రవాణాకు సిద్దంగా ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు హఠాత్తుగా వారిపై దాడిచేయగా సంఘటనా స్థలం నుంచి 20 మంది ఎర్రకూలీలు పరారుకాగా ఒక బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి రెండున్నర టన్ను ఎర్రచందనం దుంగలను, వాహనంను స్వాధీనం చేసుకొన్నారు.

చత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

భద్రాచలం, ఆగస్టు 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరో మారు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా కువ్వాకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నకుల్‌నార్ - గడ్‌మిరి గ్రామాల మధ్య రహదారిని తవ్వేశారు. దీంతో అక్కడి గిరిజనులు వైద్యం, ఇతర అవసరాలకు వెళ్లడానికి వీలులేకుండా పోయింది. ఇక్కడే ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటిఐ భవనం వద్ద మిక్సర్‌కు నిప్పుపెట్టారు. సంఘటన స్థలంలో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు వదిలారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలని, బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా కోహెకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మృతదేహంతో పాటుగా భారీగా నిత్యావసర వస్తువులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు కాంకేర్ జిల్లా పోలీసుల సమక్షంలో లొంగిన నక్సల్స్ జంటలు రెండు వివాహం చేసుకున్నాయి.