ఆంధ్రప్రదేశ్‌

మహిళలపై నేరాల అదుపునకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: మహిళలపై జరుగుతున్న నేరాల నిరోధం తమ ప్రాధాన్యత అంశాల్లో ఒకటని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడంపైనా దృష్టి సారిస్తున్నామన్నారు. ఉండవల్లిలో మంగళవారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలు, నేరాల సరళిపై వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో గత ఏడాది 880 హత్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రంలో 1,22,268 కేసులు నమోదైనాయన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 7400 మంది చనిపోయారని, అంతకుముందు రెండు సంవత్సరాల్లో 8500, 8100 మంది చనిపోయారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కల్గించే అంశమని, దీనిపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. వైట్ కాలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై అత్యాచారాలు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.
ఆస్తి గొడవలు తగ్గుముఖం పట్టాయన్నారు. విజయవాడ సిటీ, గుంటూరు అర్బన్, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు జిల్లా ఈ తరహా నేరాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయన్నారు. వైట్ కాలర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, చీటింగ్, నమ్మించి మోసం చేయడం వంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు. విశాఖ సిటీ, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ, నిరంతరం ప్రత్యేక దృష్టిసారించాల్సిన అంశమన్నారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, కొన్ని ఘటనలు పోలీసుల దృష్టికి రావన్నారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు, విశాఖ సిటీలో ఎక్కువగా ఈ తరహా నేరాలు జరుగుతున్నాయన్నారు. గత కొంత కాలంగా తీసుకున్న చర్యల కారణంగా రహదారి భద్రతలో దేశంలో ఏపీ 10వ స్థానంలో ఉందన్నారు. రహదారి భద్రత వివిధ విభాగాలతో ముడివడి ఉంటుందన్నారు. రహదారి భద్రత, రహదారిపై ప్రమాదాల్లో మరణించడంపై రాష్ట్రం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది మే వరకూ రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, ఎక్కువ మంది రాష్ట్ర, జాతీయ రహదారులపై చనిపోతున్నారన్నారు. పిల్లలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, దీనిని నియంత్రించేందుకు ఒక వ్యూహం రూపొందించాలన్నారు.గుంటూరు రూరల్, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, గత ఏడాది 1556 నమోదు అయ్యాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తమ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. విశాఖ సిటీ, రూరల్, శ్రీకాకుళం, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ అవుతుండటం ఆందోళన కల్గిస్తోందన్నారు. నగరాల్లో కొత్త రకం మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందన్నారు. ఈ కొత్త అంశంపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ సిటీ, రూరల్‌లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు.