ఆంధ్రప్రదేశ్‌

సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: పనె్నండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాలు గురువారం లాంఛనంగా ప్రారంభమవుతున్నాయి. గోదావరి నదికి అంత్య పుష్కరాలు గురువారం సాయంత్రంతో ముగియనున్నాయి. అక్కడి నుంచి పుష్కరుడు కృష్ణానదిలో గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదికి పవిత్ర పూజలు చేస్తారు. వెనువెంటనే నదికి పవిత్ర హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం పవిత్ర సంగమం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పుష్కర పనులు చాలా వరకూ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఈ పనులపై సిఎం సమీక్ష జరిపారు.
పవిత్ర సంగమమే పుష్కర హైలెట్
దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా నదుల అనుసంధానం జరగలేదు. కృష్ణ, గోదావరి నదులను అనుసంధానం చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. పుష్కర వేదికగా ఈ నదుల అనుసంధానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి, జనం చర్చించుకునేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే వివిఐపిలను నదీ సంగమ ప్రాంతానికి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్య ఘట్టమైన పవిత్ర హారతిని ఈ 12 రోజులూ నదీ సంగమం వద్దే ఇవ్వాలని నిర్ణయించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే 25 మంది పండితులు పవిత్ర హారతికి సంబంధించి రిహార్సల్స్ పూర్తి చేశారు.
‘శోభా’యాత్రతో ప్రారంభం
ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి ఘాట్‌ల వరకూ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు 1000 మంది జానపద కళాకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు. గోదావరి నదిలో అంత్య పుష్కర కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పవిత్ర సంగమం వద్దకు చేరుకుంటారు. ముందుగా కృష్ణాతీరం ప్రత్యేక సంచికను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. వందేమాతరం శ్రీనివాస్ సినీభక్తి సంగీతం, ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ వాద్యం, కళాకారుల నృత్య ప్రదర్శనలతో సిఎంను ఘాట్ వద్దకు తీసుకువెళతారు.
22 గంటల పాటు అమ్మవారి దర్శనం
ఇదిలా ఉండగా పుష్కరాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని రోజుకు 22 గంటలు తెరిచి ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజుకు లక్షా 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెల్లవారుజాము ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకూ గుడి తెరిచి ఉంటుందని అధికారులు తెలియచేశారు.
ఘనంగా ఏర్పాట్లు
పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆహారం, మంచినీరు భక్తులకు అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరిగాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహారపదార్థాలను అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అక్షయపాత్ర సంస్థ రోజుకు మూడు లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనుంది. ఇక భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నగరంలో అనేక చోట్ల పుష్కర నగర్‌లు ఏర్పాటు చేశారు. భక్తులు త్వరత్వరగా పుష్కర స్నానం చేసి బయటకు వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏయే ఘాట్ వద్ద ఎంత లోతులో నీరు ఉందన్న విషయాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నారు. భక్తులు ఏ ఘాట్‌లో స్నానం చేసినా పవిత్రత చేకూరుతుందని అధికారులు చెపుతున్నారు. ఒకే ఘాట్‌కు వెళ్లాలన్న భావన మానుకోవాలని వారు సూచిస్తున్నారు. పవిత్ర కృష్ణా జలాలను భక్తులకు అందించేందుకు మూడు లక్షల 75వేల బాటిళ్ళను సిద్ధం చేశారు. ఈ 12 రోజుల పుష్కరాలకు సుమారు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్క విజయవాడ నగరానికే రోజుకు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

నగరంలో పండగ వాతావరణం
పుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని అన్ని రోడ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా కనిపిస్తోంది. అలాగే, అన్ని ఘాట్‌లు ఎల్‌ఇడి వెలుగులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతూ కనిపిస్తోంది.