కృష్ణ

కళకళలాడిన పుష్కరఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల రెండవ రోజైన శనివారం భక్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తొలి రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు లేక పుష్కర ఘాట్‌లు వెలవెలపోగా రెండవ రోజైన శనివారం పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్‌లలో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. నదీతీరాన ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. పరమ పవిత్రమైన హంసలదీవి సాగర సంగమం, పెదకళ్ళేపల్లి, ముక్త్యాల, వేదాద్రి, ఐలూరు పుష్కర ఘాట్‌లలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాగాయలంక వద్ద కృష్ణానదీ తీరాన ఉన్న శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద సాయం సంధ్యా సమయంలో కృష్ణవేణమ్మకు హారతి ఇచ్చారు. వేద పండితులు శిష్ట్లా సుబ్రహ్మణ్య శాస్ర్తీ, దీవి మురళీ ఆచార్యులు, కౌసిక్‌లు వేదమంత్రోచ్ఛరణల మధ్య కృష్ణమ్మకు హారతులిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎపి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు రాజాతో పాటు వేలాది మంది భక్తులు తిలకించి పులకించారు. పుష్కర ఘాట్‌ల వద్ద అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. సాగర సంగమానికి వెళ్ళేందుకు తొలి రోజు వాహన సదుపాయం లేక మూడు కిలో మీటర్ల మేర నడిచి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. భక్తుల ఇబ్బందిని గుర్తించిన ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హంసలదీవి వద్ద ఉన్న డాల్ఫిన్ భవనం నుండి సముద్రపు ఒడ్డు వరకు రాత్రికి రాత్రికి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసి సముద్రపు ఒడ్డున సంగమ ప్రాంతానికి వాహనాలను అనుమతించారు. దీంతో రాను పోను ఆరు కిలో మీటర్ల మేర భక్తులు నడిచే అవస్థ తొలిగింది. అత్యంత ప్రమాదకరమైన సంగమ ప్రాంతంలో పెద్ద ఎత్తున గజ ఈతగాళ్ళతో పాటు మర పడవలను ఏర్పాటు చేశారు. అలాగే మెరైన్ షిప్‌ను కూడా ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఏర్పాటు చేశారు. ఇక అన్ని పుష్కర ఘాట్‌ల వద్ద స్వచ్చంద సంస్థలు, ఇతరత్రా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పుష్కర యాత్రీకులకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించారు. పసందైన వంటకాలతో స్వచ్ఛమైన తెలుగు రుచులతో వంటకాలను సిద్ధం చేస్తున్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి
* ఆందోళనకు దిగిన బంధువులు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఆగస్టు 13: కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామ మలుపు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం ఉల్లిపాలెం గ్రామానికి చెందిన దాసరి వెంకట రమణయ్య (60), తోట ముక్తేశ్వరరావు, పుప్పాల కోటేశ్వరరావులు ఉల్లిపాలెం ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని కల్వర్టుపై కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో సాగర సంగమంలో పుష్కర స్నానం చేసి యాత్రికులతో వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందగా ముక్తేశ్వరరావు, పుప్పాల కోటేశ్వరరావు, కారులో ఉన్న మొవ్వ గ్రామానికి పోలిశెట్టి సుధారాణి, విజయనాగ దుర్గ, తరుణి, గుంటూరుకు చెందిన గనివిశెట్టి రమాదేవిలకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముక్తేశ్వరరావు, కోటేశ్వరరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రాత్రి 7గంటల సమయంలో మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఘటనా స్థలి వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేదాద్రిలో వేలాది మంది పుష్కర స్నానాలు
జగ్గయ్యపేట, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాలకు రెండో రోజైన శనివారం వేదాద్రి, రావిరాల ఘాట్‌లలో వేలాది మంది పుష్కర స్నానాలు ఆచరించారు. తొలిరోజైన శుక్రవారం జనం పలచగా ఉన్నా శనివారం ఉదయం నుంచే ఘాట్ వద్దకు పుష్కర యాత్రికుల తాకిడి మొదలైంది. వేలాది మంది జనం తరలిరావటంతో ఘాట్ల వద్ద మహిళలు బట్టలు మార్చుకునే గదులు సరిపోక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పిండ ప్రదానాలు ఆచరించేందుకు రెండు టెంట్లు ఏర్పాటు చేసినా రెండో టెంట్ దూరంగా ఉండటం అక్కడ నుంచి నదిలో పిండాలు కలపడం లేకపోవటంతో జనాలు ఇబ్బందులుపడ్డారు. ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య ఘాట్‌లను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వేదాద్రి ఘాట్ వద్ద ఉదయం సంకల్ప స్నానం చేయించేందుకు పోలీసులు అంగీకరించకపోవటంతో పురోహితులు నిరసనకు దిగారు. ప్రముఖులు చక్రపాణిరావు తదితరులు సంకల్ప స్నానానికి అంగీకరించకపోవటంపై పోలీసుల తీరును తప్పుబట్టారు. పురోహితుల నిరసనతో కార్యక్రమాలు నిలిచిపోవటంతో ఎస్‌పి విజయకుమార్ అక్కడికు విచ్చేసి పురోహితులను సర్దిచెప్పి కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ అంశంపై రెండు రోజులు నిరసనలు వ్యక్తం కావటంతో అధికారులు నిర్ణయం తీసుకోకపోతే ఈ అంశం వివాదాస్పద మారే అవకాశముంది.

కృష్ణాజలం కలుషితం అవాస్తవం
* మంత్రి కామినేని
గన్నవరం, ఆగస్టు 13: కృష్ణానదిలోని నీరు కలుషితమైనట్లు ఒక దినపత్రికలో వస్తున్న కథనాలు నమ్మవద్దని, ప్రతిపక్ష నేతకు పుష్కరాలంటే ఇష్టం లేక దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాకి చెందిన కోటి మంది ప్రజలు కృష్ణానది నీటిని తాగుతున్నారని కృష్ణానది జలాన్ని వాటర్ పొల్యూషన్ బోర్డు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. పుష్కర భక్తులకు వైద్య సేవలు అందించేందుకు రెండు వేల మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఎంసెట్ పరీక్షను ఎపి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తే పేపర్ ఔట్ అయ్యిందని ‘జగన్’ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఇంటికి తాను, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులు పుష్కరాల ఆహ్వానపత్రం అందించడానికి వెళితే అవమానపర్చారన్నారు. ‘జగన్’ తన విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
పుష్కరాల ఆహ్వానాన్ని అందుకోవడంలో ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్ ప్రవర్తించారని సాంఘిక మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. శనివారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మంటగలిపే విధంగా వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు భారత ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి ప్రముఖులు హాజరు కాగా, ప్రతిపక్ష నేత జగన్ హాజరు కాకపోవడం గమనార్హమన్నారు. గత వారం రోజులుగా ఆహ్వానపత్రాన్ని అందించేందుకు యత్నించగా నేడు ఎట్టకేలకు అందజేయడం జరిగిందన్నారు. మంత్రులుగా మేము జగన్ ఇంటికి వెళితే కనీసం గౌరవించలేదన్నారు. జగన్ ప్రభుత్వం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించి, పునీతులు కావాలని రావెల కిషోర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణ పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా నిర్వహిస్తుంటే ప్రతిపక్ష నేత ఓర్వలేక కృష్ణా జలాలు కలుషితమైనట్లు దుష్ప్రచారం చేయడం భావ్యం కాదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉండే పవిత్ర కృష్ణా పుష్కరాల్లో ప్రజలు స్నానాలు ఆచరించి తరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు కుల, మత, జాతి, వర్ణాలకు అతీతంగా పండుగ పుష్కరాలు అని అభివర్ణించారు. పుష్కరాల పవిత్ర కార్యాన్ని సమర్ధించకపోగా విమర్శించడం ప్రతిపక్ష నేత జగన్‌కు తగదన్నారు.

రెండోరోజూ వెలవెలబోయిన సంగమం ఘాట్
* సెంటిమెంట్‌ను పట్టించుకోని భక్తజనం
ఇబ్రహీంపట్నం/మైలవరం/జి.కొండూరు, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని సంగమ్ ఘాట్ రెండోరోజు కూడా భక్తులు లేక వెలవెలబోయింది. కేవలం ఏళ్ళమీద లెక్కించగలిగేంత మంది భక్తులు మాత్రమే ఈఘాట్‌లో సాన్నం చేయటానికి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంగమ్ ఘాట్‌కు నిన్నటి వరకూ గోదావరి నీరు రాలేదు. కేవలం విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ నుండి వచ్చే కృష్ణా రిటర్న్ వాటర్ మాత్రమే వచ్చి తిరిగి కృష్ణాలో కలిసింది. ఈనీరు వేడిగా ఉండటంతోపాటు చర్మవ్యాధులు వస్తాయని భక్తులు తొలిరోజున అటువైపు చూడలేదు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి హారతి ఇచ్చే సమయంలో తన ప్రసంగంలో ఈవిషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. సంగమంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు వస్తాయని కొందరు అపోహపడుతున్నారని అది వాస్తవం కాదన్నారు. ఎప్పటికప్పుడు నీటిని పరీక్ష చేయించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మీ ఆరోగ్యానికి పూర్తి భద్రత, భరోసా నాది అంటూ భక్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే గోదావరి నీరు శనివారం తెల్లవారుఝామున కృష్ణానదిలో వచ్చి చేరింది. ఈనీరు కూడా విటిపిఎస్ రిటర్న్‌వాటర్‌లో కలిసి కృష్ణానదిలో చేరుతుంది. వాస్తవానికి గోదావరి నీరు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ప్రభుత్వం పెద్దయొత్తున భక్తులు విచ్చేస్తారని విశాలంగా ఘాట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంగమం ఘాట్ అని నామకరణం చేసి ఏ,బి,సి,డి గా విభజించింది. ఈఘాట్‌లో ఏ,బి ఘాట్‌లో భక్తులు కొంతమంది వరకూ పుణ్యస్నానాలు చేస్తున్నారుగానీ సి,డి ఘాట్‌లో మాత్రం ఎవరూ చేయకపోవటం గమనార్హం. నదుల అనుసంధానం అనేక ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొంటూ ప్రభుత్వం ఈఘాట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ భక్తులను ఇటువైపునకు మళ్ళించేందుకు గతంలో ఉన్న ఫెర్రి ఘాట్‌ను సైతం మూసివేసింది. ఐనప్పటికీ భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉంది. తొలి రోజుతో పోలిస్తే రెండోరోజు భక్తుల రాక కొద్దిగా మెరుగు పడింది. ఐతే ప్రభుత్వ సెంటిమెంట్ భక్తులపై పని చేయటం లేదని తెలుస్తోంది.