ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ వైద్య బోధకులకు ఏదీ పీఆర్సీ?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 11: వారు భావిభారత వైద్యులను తయారుచేసే కర్మాగారాల వంటి వైద్య కళాశాలల్లో బోధకులు. సుశిక్షితులైన వైద్యనారాయణులకు మార్గదర్శకులు. ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు వచ్చే దీనజనులకు ప్రత్యక్ష దైవాలు. అలాంటివారు ప్రస్తుతం తాము చేసే చాకిరీకి సరైన ప్రతిఫలం అందక ప్రభుత్వాధినేతల వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరు కాదు, రాష్టవ్య్రాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను అభ్యసించి బోధకులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న 2800 మంది వైద్యులు ఏకంగా గత పనె్నండేళ్లుగా పీఆర్సీ ఫలాలు అందక మానసిక వేదనకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరి అత్యుత్సాహం వల్ల పదవీ విరమణ వయసులో పిల్లలు దగ్గర లేక, జీతభత్యాలు అందక మరో 300 మంది ప్రభుత్వ సీనియర్ వైద్యులు కూడా ఆత్మక్షోభకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను అభ్యసించిన బోధకులకు మంచి జీతభత్యాలు అందించాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 నవంబర్ 1న యూజీసీ స్కేలు వర్తింపజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ సాంకేతిక కారణాలు చూపుతూ వాటి అమలులో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. యూజీసీ జీతభత్యాలకు సంబంధించి పూర్తిస్థాయి ఫలాలు అందించడంలో వైఎస్ అనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు విఫలమయ్యారు. అనేకమార్లు 2006 నుంచి రావాల్సిన పీఆర్సీ ఫలాల కోసం పాలకులు, అధికారులకు విన్నవించుకున్న మీదట యూజీసీ 6వ పీఆర్సీ వర్తింపజేయాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016 అక్టోబర్ 16న జీవోఎంఎస్ 163 ద్వారా టైం బౌండ్ పేస్కేల్, కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే జీవోలో పొందుపరిచిన విధివిధానాల్లో సాంకేతిక లోపాలు ఉండటంతో వాటిని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి జీవో విడుదలకు అటు పాలకులు, ఇటు అధికారులకు నేటికీ తీరిక లేకపోవడంతో అసోసియేట్ ప్రొఫెసర్లకు గత పనె్నండేళ్లుగా రావాల్సిన యూజీసీ 6వ పీఆర్సీ బకాయిలు నేటికీ అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. ఓపక్క విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులకు యూజీసీ 7వ పీఆర్సీ జీతాలు అందిస్తుంటే వీరికి మాత్రం 6వ పీఆర్సీ జీతాలే అందలేదు.
ఎంబీబీఎస్ వైద్యులకే అధిక జీతాలు!
ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, సాచివేత ధోరణి పుణ్యమాని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్యుల కంటే పీహెచ్‌సీల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు జీతభత్యాలు అధికంగా వస్తున్నాయి.
1998లో ఒకేసారి ప్రభుత్వ వైద్యులుగా చేరిన వారిలో ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ వైద్యుని బేసిక్ పే రూ. 51వేలు ఉంటే, పీహెచ్‌సీలోనే కొనసాగుతూ వస్తున్న ఎంబీబీఎస్ చేసిన వైద్యుని బేసిక్ పే రూ. 74వేలుగా ఉండటం గమనార్హం. రూ. 74వేల బేసిక్ పేకు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఐఆర్ 27శాతం కలపాల్సి ఉంది. జీతభత్యాల్లో ఈ స్థాయి వ్యత్యాసాలు సూపర్ స్పెషాలిటీ వైద్యుల్లో అసంతృప్తి జ్వాలలు రగుల్చుతున్నాయి.
పదవీ విరమణ వయసులో క్షోభ
గత ప్రభుత్వ హయాంలో ఓ ఇద్దరి అనాలోచిత నిర్ణయం, అత్యుత్సాహం ప్రస్తుతం పదవీ విరమణ వయసు దగ్గర పడిన ప్రభుత్వ వైద్యుల పాలిట శాపంగా మారింది. నలుగురి కోసం 2017 మే 31న ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63ఏళ్లకు పెంచుతూ జీవో తెచ్చారు. నిన్నమొన్నటి వరకు ఆ నిర్ణయం బాగుందనిపించినా 60 సంవత్సరాల వయసు దాటిన ప్రభుత్వ వైద్యుల జీతభత్యాలను నిలుపుదల చేయాలంటూ ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడచిన మూడు నెలలుగా జీతభత్యాలు అందక పదవీ విరమణ వయసు దగ్గరపడిన ప్రభుత్వ వైద్యులు అల్లాడే పరిస్థితి ఏర్పడింది.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా వైద్యులు పాలకుల ఆదేశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తాము ఏనాడూ పదవీ విరమణ వయసు పెంచాలని కోరలేదని, ఎవరికోసమో గత ప్రభుత్వ హయాంలో పాలకుడు, ఓ అధికారి తీసుకున్న నిర్ణయం నేడు తమపాలిట శాపంగా మారిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఉన్నపళంగా పదవీ విరమణ చేయించి, రావాల్సిన ఫలాలు అందిస్తే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని సీనియర్ వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు మేలు చేయకుండా ఉండిపోయింది. దివంగత నేత తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయినా సానుభూతితో కరుణించి తమకు ఉపశమనం కలిగించేలా సానుకూల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.