ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ ఆభరణాలపై అనుమానాల నివృత్తికి సభా సంఘం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: టీటీడీ ఆభరణాలు, తదితర వ్యవహారాలపై ప్రజల్లో చోటు చేసుకుంటున్న అనుమానాల నివృత్తికి సభా సంఘం ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసన మండలిలో గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీటీడీ ఆభరణాల ఆడిట్ తదితర అంశాలపై వైకాపా సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాలరెడ్డి ప్రశ్న వేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ టీటీడీపై వస్తున్న ఆరోపణలు నివృత్తి కావాల్సి ఉందన్నారు. పింక్ డైమండ్ జెనీవాలో వేలానికి వచ్చిందని అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.
బంగారు నాణేలు, పింక్ డైమండ్ వ్యవహారంపై విచారణ చేయించాలన్నారు. గతంలో రాజులు తమ బంగారు ఆభరణాలను దేవాలయాల్లో దాచేవారని, 22 రోజుల పాటు పోటును మూసేసి, గోడ కట్టడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలన్నారు. బీజేపీ పీవీ మాధవ్ మాట్లాడుతూ గతంలో రమణ దీక్షితులు అనేక ఆరోపణలు చేశారని, ఈవో వివరణ మరింతగా అనుమానాలు కల్గించేలా ఉందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి బంగారం తరలింపు తీరు కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు. సభా సంఘాన్ని నియమించి, దర్యాప్తు చేయించాలన్నారు. పోటుకు సంబంధించి చోళ రాజుల గురించి బ్రిటీషర్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. బొక్కసం తాళం చెవి ఒక పదవీ విరమణ చేసిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆడిట్ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారా అని వెన్నపూస గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఏమేమి లోపాలు గుర్తించారు.. తీసుకున్న చర్యలు వివరించాలని కోరారు. పింక్ డైమండ్ ఏమైందని, ఈ వ్యవహారాలపై విచారణకు సభా సంఘాన్ని నియమించాలని దొరబాబు డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టీటీడీ వ్యవహారాలపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీకి 1200 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంటే, అందులో హిందూ ధర్మ పరిరక్షణకు కేవలం 60 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇందులో 40 కోట్లు ఎస్వీబీసీ చానెల్ నిర్వహణకు వెచ్చిస్తున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు మరింతగా నిధులు కేటాయించాలన్నారు. సభ్యుల ఆరోపణలపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ టీటీడీ పరిధిలో 62 దేవాలయాలు ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం బంగారు ఆభరణాల ఆడిట్ జరుగుతుందన్నారు. పింక్ డైమండ్ పగిలిపోగా, మిగిలిన ముక్కను భద్రపరిచామని వివరించారు.
టీటీడీ వద్ద తులం, కాసు తదితర పద్ధతిలో ఇచ్చిన 484 ఆభరణాలు, మెట్రిక్ విధానంలో ఇచ్చిన 378 ఆభరణాలు ఉన్నాయన్నారు. 1304 కిలోల బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయన్నారు. పోటు తవ్వకాలపై అనుమానాలు ఉన్నాయని, దీనిని పరిశీలిస్తామన్నారు. అన్ని పనులు పారదర్శకంగా జరిగేలా చూస్తామన్నారు. అయితే అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని దాటవేశారు.