ఆంధ్రప్రదేశ్‌

నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అధికారం ప్రజలకు సేవ చేయడానికే తప్ప దోచుకోవడానికి కాదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిటి రోడ్డులోని గుంటూరు కనె్వన్షన్ సెంటర్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశ్రాంతి లేకుండా నిరంతరం దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు శ్రమిస్తున్నారన్నారు. తమ పార్టీపై భగవంతుని అనుగ్రహం ఉందని, అందుకే తిరిగి అధికారంలోకి వచ్చామన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశే్లషకులు సైతం చెప్పలేక పోయారన్నారు. ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడినప్పటికీ బీజేపీ గెలుపును అడ్డుకోలేక పోయాయన్నారు. తాము ఇదే అత్యుత్తమ విజయంగా భావించడం లేదని, దేశం మొత్తం బీజేపీ జెండా రెపరెపలాడాలన్నదే తమ లక్ష్యమని, అప్పుడే సంపూర్ణ విజయం సాధించినట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కన్పిస్తోందని, ఇప్పుడున్న గాంధీలంతా నకిలీలన్నారు. విమానం కూలిపోతుంటే కెప్టెన్ అందరినీ సురక్షితంగా దించిన తర్వాతే తాను దిగుతారని, అయితే రాహుల్ గాంధీ మాత్రం ముందుగానే దిగిపోయారన్నారు. ఏపీ రాజకీయాల్లో కుటుంబం, కులానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటోందన్నారు. తమ పార్టీలో కుల, మత, కుటుంబ రాజకీయాలకు స్థానం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను సీఎంగా చూడాలని భావిస్తున్నారని, అయితే ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదని, 2024లో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 46 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, బూత్ కమిటీలన్నింటినీ పూర్తి చేశామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు త్వరలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 25 మందిని సభ్యులుగా చేర్పించని వారికి బీజేపీలో పదవి ఆశించేందుకు అర్హత ఉండదన్నారు. అవినీతి, అక్రమాలకు నిలయంగా తెలుగుదేశం పార్టీ మారిందని, అందుకే ఆ పార్టీ నుండి వలసలు అధికమయ్యాయన్నారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్, కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దుల వెంకట కోటయ్య తదితరులు పార్టీలో చేరారు. వీరికి బీజేపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దియోదార్, సభ్యత్వ ప్రముఖ్ మాణిక్యాలరావు, సహ ప్రముఖ్ పివిఎన్ మాధవ్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పాల్గొన్నారు.

చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్