ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో వైసీపీకి మేమే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ స్పష్టం చేశారు. గుంటూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాం మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ఒక పార్టీ కాదని, భారతీయ సంస్కృతి, జీవన విధానానికి ప్రతిబింబమన్నారు. పార్టీ విధానాలు, నియమాల ప్రకారం ప్రతి నాయకుడు, కార్యకర్త నడుచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోందని, ఆ పార్టీ తానా కార్యక్రమాలు చేసుకోవడానికే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడికి బీజేపీ సహకారం లేకపోవడం వలనే ఓటమి పాలయ్యారని, టీడీపీపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు వైసీపీని గెలిపించారన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ ఓట్లు సాధించిన పార్టీ బీజేపీయేనన్నారు. 2015లో 11 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని, ఈసారి 20 శాతం అదనంగా చేయించాలన్నారు. జూలై 6 నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు ఆగస్టు 11తో ముగుస్తుందన్నారు. వారణాశిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభ్యత్వ నమోదును ప్రారంభించారన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతమవుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూత్‌లు ఉంటే 8.5 లక్షల పోలింగ్ బూత్‌ల్లో పార్టీ కమిటీలు ఉన్నాయన్నారు. దేశ భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. క్రమశిక్షణ, సిద్ధాంతాలు గల పార్టీ బీజేపీ అని, 1984లో రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ నేడు 304 మంది ఎంపీలతో బలంగా ఉందన్నారు. కొన్ని పార్టీలకు అధికారమే పరమావధి అని, తాము అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలు, దేశ ప్రజల భవిష్యత్తు కోసమే పనిచేస్తామన్నారు. కుల, మత, ధనిక రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు. గ్రూపు రాజకీయాలు తమ పార్టీలో ఉండవని, దేశంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థకు బీజేపీ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

బీజేపీ జవాబుదారీ ప్రభుత్వమని, అధికార వ్యవస్థలో అవినీతిని రూపుమాపడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయన్నారు. పరాజయాలను ఛాలెంజ్‌గా తీసుకుని గెలుపునకు బాటలు వేసుకుంటామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరిగిందని, పోలవరం నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 2024లో రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 2015లో రాష్ట్రంలో 25 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఇది రెట్టింపు చేసేందుకు శ్రమించాలన్నారు. సభ్యత్వ నమోదు కోసం త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. 25 మందిని సభ్యులుగా చేర్చిన వారే క్రియాశీలక సభ్యత్వం పొందుతారని, వారే పార్టీ పదవులు పొందేందుకు అర్హులన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే బండి గోపాల్, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీలో చేరారు.
చిత్రం...బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్