ఆంధ్రప్రదేశ్‌

మరుగున పడిన గోదావరి డ్రెడ్జింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 19: ఇసుక తవ్వకమే ప్రధానంగా అన్నట్టు సాగిన గోదావరి డ్రెడ్జింగ్ వ్యవహారం మరుగునపడిపోయింది. కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెంపులో భాగంగా గోదావరి నదిలో గతంలో డ్రెడ్జింగ్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా వెలికివచ్చిన ఇసుక వ్యవహారం ఇప్పటికే పలు సందేహాలను రేకెత్తిస్తూనేవుంది. ధవళేళ్వరం కాటన్ బ్యారేజీ ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను రెండేళ్ల క్రితం ప్రభుత్వం రూ.52.15 కోట్ల వ్యయంతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా డ్రెడ్జింగ్ నిర్వహించి, తొలగించింది. ఈ విధానంలో వెలికితీసిన ఇసుకను విక్రయించి, ఆ సొమ్ముతో తర్వాతి సంవత్సరం డ్రెడ్జింగ్ నిర్వహించాలని భావించారు. అయితే డ్రెడ్జింగ్ ద్వారా భారీగా ఇసుక బయటపడినా, జలవనరుల శాఖకు మాత్రం దక్కింది అంతంతమాత్రమే. దీనితో ఏటా ఇదే మాదిరిగా నిర్వహించాలని భావించిన డ్రెడ్జింగ్ మూలనపడింది. అలాగే కేవలం ఇసుకను వెలికి తీసి వినియోగించుకోవడానికే ఉపయోగించారు తప్ప నది లోతు చేయడంలో మాత్రం శ్రద్ధ చూపలేదని తెలుస్తోంది. డ్రెడ్జింగ్ ద్వారా బయటపడిన దాంట్లో సుమారు రూ.15 కోట్ల విలువైన ఇసుకను పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎత్తుచేసేందుకు వినియోగించారు. ఈ మేరకు నిధులను పర్యాటక శాఖ జలవనరుల శాఖకు రీయింబర్స్ చేయాల్సివుంది. ఆ నిధులను రాబట్టేందుకు అనేక సార్లు పర్యాటక శాఖకు జల వనరుల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఈ నిధులు బకాయిపడటం వల్ల మళ్ళీ డ్రెడ్జింగ్‌కు నిధులు సమకూరలేదని తెలుస్తోంది. రాన్రానూ ఇసుక తాలూకు రూ.15 కోట్ల నిధుల వ్యవహారం మరుగున పడింది. అలాగే డ్రెడ్జింగ్ ద్వారా తీసిన ఇసుకను ఎన్‌సీసీ సంస్థకు కూడా పెద్ద ఎత్తున కేటాయించారు. ఈ విధంగా కేటాయించిన ఇసుకకు నిధులు ఎంతమేర వచ్చాయో అనేది నేటికీ గోప్యంగానేవుంది. అదేవిధంగా రాజమహేంద్రవరంలోని కోటిలింగాలపేట వద్ద కూడా డ్రెడ్జింగ్ ఇసుకను స్టాకుచేసి, ప్రభుత్వ పనులకు సరఫరా చేసే విధంగా కాంట్రాక్టు విధానంపై అప్పగించారు. డ్రెడ్జింగ్ ఇసుకను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించుకున్నారు గానీ ఇందుకు సంబంధించిన నిధులు ఏమయ్యాయో కూడా తెలియని విధంగావుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దిగువకు ఇసుక మేటలు గతంలో మాదిరిగా అంతగారావు. పోలవరం నుంచి కాటన్ బ్యారేజి మధ్యలో మరింత లోతు చేసుకుంటే జలాలు నిల్వలు పెరిగి బ్యారేజి వద్ద ఎపుడు సమృద్ధిగా నిల్వలు ఉండటానికి అవకాశంవుంది. ఈ విధంగా ముందు చూపుతో డ్రెడ్జింగ్ చేయాల్సి వుంది. ప్రభుత్వ పనుల ఇసుక అవసరాల నిమిత్తం కొన్ని ర్యాంపులను కేటాయించారు. ఈ విధంగా తరలించిన ఇసుక పెద్ద ఎత్తున పక్కదారి పట్టిందని ఆరోపణలు వున్నాయి. ఏ ర్యాంపులో ఏ ఏ కంపెనీలకు, ఎంతెంత ఇసుక కేటాయించారు. కేటాయించిన ఇసుక లక్ష్యం మేరకు ఆయా పనులకు దక్కిందా, చేరిందా అనేది కూడా విచారణ జరపాల్సివుంది. వాస్తవానికి ప్రభుత్వ పనులకు తీసుకెళ్ళే వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేయాల్సి వున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదు. ఈ ఇసుక ఎక్కడకు చేరిందో అనే విషయంలోనూ అనుమానాలున్నాయి. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఇసుక వ్యవహారాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం.