ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి అంతకంతకూ వరద నీరు పోటెత్తుతోంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి 7 లక్షల 70వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము సమయానికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుకోగలదని అధికారులు చెబుతున్నారు.
తీరప్రాంతాలు వరద ముంపుకు గురి కాకుండా ముందుజాగ్రత్త చర్యగా బ్యారేజీ మొత్తం గేట్లను పూర్తి సామర్థ్యం మేర పైకి ఎత్తివేయటంతో వచ్చిన వరద నీరు వచ్చినట్లుగా దిగువకు వెళుతోంది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నదీ తీర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పర్యవేక్షణలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు కాగా వాటిలో 12వేల మంది తలదాచుకుంటున్నారు. ఇదిలావుంటే సాయంత్రం నుంచి వర్షం కురవటం ప్రారంభం కావటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
భవానీపురంలో శ్రీకృష్ణచైతన్య ట్రస్ట్ వారి చిల్డ్రన్ హోం వరద నీట మునగటంతో కలెక్టర్ ఇంతియాజ్, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి పడవల్లో వెళ్లి అక్కడ వున్న పిల్లలందరినీ శిబిరాలకు తరలించారు. బ్యారేజీ ఎగువ తీర ప్రాంతంలోని పంట పొలాలన్నీ వరద ముంపుకు గురయ్యాయి. వేలాది ఇళ్లలోకి వరద చేరుతున్నది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలోని పుష్కరనగర్ నీట మునిగింది. ప్రవాహం ఏ మాత్రం పెరిగినా ఇబ్రహీంపట్నంలో ఏకంగా జాతీయ రహదారి పైకే నీరు చేరే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విజయవాడ నగరంలో కరకట్ట ప్రాంతంలోని రామలింగేశ్వరనగర్, భూపేష్‌గుప్తానగర్, రాణిగారితోట తదితర కాలనీలు వరద ముంపుకు గురి కాగా అక్కడి ప్రజలకు వివిధ సహాయక పునరావస శిబిరాలకు తరలించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు.
జలదిగ్బంధంలో అమరావతి మండలం
* 38 లంకలకు తెగిన సంబంధాలు
* వేలాది ఎకరాల పంటమునక * కొట్టుకుపోయిన ఇటుక బట్టీలు
గుంటూరు: కృష్ణవేణి ఉగ్రరూపం దాల్చడంతో గుంటూరు జిల్లాలో నదీ తీరంలోని పలు మండలాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఎక్కడికక్కడ వరదనీరు గ్రామాలను చుట్టుముట్టి భీభత్సవం సృష్టిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన, ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాలైన బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి మండలాలతో పాటు దిగువన ఉన్న దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో వరదతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి మండలంలోని దాదాపు అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అమరావతి- విజయవాడ, అమరావతి-క్రోసూరు, అచ్చంపేట రహదారులపైకి నడుములోతు నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మండల కేంద్రమైన అమరావతితో పాటు పెదమద్దూరు, చావపాడు, దిడుగు, ధరణికోట, మునగోడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. నరుకుళ్లపాడు, యండ్రాయి ప్రాంతాలతో పాటు ఆ మండలంలో దాదాపుగా నాలుగు వేల ఎకరాల పంట నీటమునిగింది. అచ్చంపేట మండలంలోని పలు గ్రామాల్లోకి నీరు రావడంతో సత్తెనపల్లి- మాదిపాడు, అచ్చంపేట-తాడువాయి, చల్లగరిగ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన బెల్లంకొండ మండలంలోని 9, మాచవరంలోని 6 గ్రామాలను పూర్తిగా వరదనీరు కమ్మేసింది.
అయితే ఈ ముంపు గ్రామాల్లోని ప్రజలకు గతంలోనే పునరావాసం కల్పించడంతో పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ అనధికారికంగా సాగవుతున్న వేలాది ఎకరాల పంట నీటిపాలైంది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని దాదాపు 38 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లంక గ్రామాలకు వెళ్లాలంటే పడవల ప్రయాణం తప్ప మరోదారి లేని స్థితి నెలకొంది. కొల్లూరు మండలం పెసర్లంక వద్ద ఏటి గట్టుకు గండిపడటంతో పెద్ద ఎత్తున వరద పెసర్లంక గ్రామ పరిసర ప్రాంతాలను ముంచేసింది. ఆ ప్రాంతంలోని ఇటుకబట్టీలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వరదనీరు గ్రామాల్లోకి ప్రవహించకుండా ఇసుక బస్తాలను అడ్డుపెడుతున్నప్పటికీ ఫలితం కనిపించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా మండల కేంద్రాల్లోని సురక్షిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టి చర్యలు చేపట్టింది.