ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలకు భక్తకోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తుల సంఖ్య కోటి దాటిపోయింది. పుష్కరాలు ప్రారంభమై శుక్రవారానికి వారం రోజులైంది. పుష్కరాల తొలిరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య పలచగా ఉంది. ఆ తరువాత శని, ఆది, సోమవారాలు వరుసగా సెలవుదినాలు కావడంతో భక్తజనం పోటెత్తింది. ఆ తరువాత భక్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గురువారం శ్రావణ పౌర్ణమి కావడంతో భక్తులు పవిత్ర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. శుక్రవారం మళ్లీ యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి సుమారు ఏడున్నర లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. శ్రావణ శుక్రవారం కావడం వలన భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని భావిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం నుంచి నేటి వరకూ స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. పుష్కరాల్లో మూడు వంతుల భాగం పూర్తయింది. కేవలం నాలుగు రోజులు మిగిలి ఉంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుంటూరులో తగ్గిన రద్దీ
గుంటూరు జిల్లాలో పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ తగ్గింది. శ్రావణ శుక్రవారంనోములు ఉన్నందున గుంటూరు జిల్లా ఘాట్లు ఉదయం 10 గంటల నుండి వెలవెలబోయాయి. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి 3,57,735 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. సీతానగరం ఘాట్‌లో త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి నేతృత్వంలో సమతా స్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమరావతి ఘాట్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ ఖైతే స్నానమాచరించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రేపల్లె తీరంలో భక్తులు ఉప్పునీటి స్నానాలు చేశారు. పెనుమూడి రేవు మీదుగా కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో కొన్ని ఘాట్ల వద్దకు ఉప్పునీరు పోటెత్తింది. ఇక కర్నూలు జిల్లాలో శుక్రవారం సుమారు 90 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరంలో భారీ సంఖ్యలో పుష్కర స్నానాలాచరించారు.

చిత్రం... విజయవాడలోని సీతానగరం పుష్కరఘాట్‌లో శుక్రవారం వేలాదిమంది పుష్కర భక్తులతో సమతా స్నానం చేస్తున్న చినజీయరు స్వామి