ఆంధ్రప్రదేశ్‌

తోటలు నరికేస్తున్నారు.. భూములు లాక్కుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 10: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు తమపై దాడులు కొనసాగిస్తున్నారని, వారిని తట్టుకోలేని పరిస్థితి నెలకొందని, తమను ఆదుకుని, రక్షణ కల్పించాలని రాయలసీమకు చెందిన కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి ఈ మేరకు మొరపెట్టుకున్నారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు కూడా గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం, మైల సముద్రానికి చెందిన ఆదిమూర్తి, ఆవులప్పలు మాట్లాడుతూ 18 ఎకరాల్లో వేసిన 5,400 దానిమ్మ చెట్లను వైసీపీ కార్యకర్తలు నరికేశారని, భూములను లాక్కుంటామని బెదిరిస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు మాట్లాడుతూ ఈ ఏడాది మే 23వ తేదీన బ్రహ్మసముద్రం వద్ద ఎన్‌టీఆర్ విగ్రహాన్ని దగ్ధం చేశారని, జూన్ 22న శెట్టూరు మండలం మంచర్లపల్లిలో వెలుగు యానిమేటర్ శశికుమార్ వైసీపీ నేతల దాష్టీకాన్ని భరించలేక ఆత్మహత్యకు యత్నించారన్నారు. తూర్పు గోదావరి జిల్లా విశే్వశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్లబోయిన విజయలక్ష్మి, నాగమల్లేశ్వరి మాట్లాడుతూ 25 ఏళ్లుగా మా స్వాధీనంలో ఉన్న భూమిని కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని జక్కంపూడి రాజా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు.
1994లో కొనుగోలు చేసిన య.1-70 సెంట్ల భూమిని కబ్జా చేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేశామనే అక్కసుతో కొబ్బరిచెట్లను నరికి వేశారని తమ గోడును వెల్లబోసుకున్నారు. కార్యకర్తల సమస్యలను విన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. శరీరంపై గాయాలు చేస్తే కొన్నాళ్లకు మానిపోతాయని, అదే ఆర్థికమూలాలను దెబ్బతీస్తే కుటుంబాలు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందంటూ వైసీపీ నేతల అకృత్యాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతో ఆవేదనతో తమకు జరిగిన ఘోరాన్ని తమకు తెలియజేసేందుకు వస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదన్నారు. బాధితులను పట్టుకుని ఈ విధంగా మాట్లాడేందుకు వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందంటూ విరుచుకుపడ్డారు.

చిత్రం... చంద్రబాబుకు పరిస్థితి వివరిస్తున్న బాధితులు