ఆంధ్రప్రదేశ్‌

పాలనకు, మాటలకు పొంతన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 10: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న పాలనకు పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. మంగళవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగన్ వంద రోజుల పాలనపై కన్నా విశే్లషించారు.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు పట్టం కట్టారని అయితే ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలు మార్పును కోరుకుని ముఖ్యమంత్రిగా జగన్‌కు అవకాశం ఇచ్చారన్నారు.
అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గతంలో జగన్ చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతనలేదన్నారు. పాలనపై ముఖ్యమంత్రి జగన్ పట్టుకోల్పోయారని ఆయన చేష్టలను బట్టి తెలుస్తోందన్నారు. టీడీపీ నేతలు అరాచకాలు చేశారు కాబట్టే వారిని ప్రజలు ఓడించారని కన్నా చెప్పారు. అధికారం చేతులు మారింది తప్పించి వ్యవస్థ మారలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా వైసీపీ ప్రభుత్వం తమ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శించారు. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలైతే ఎందుకు రాత పరీక్షలు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు రూ.12వేలు పెట్టుబడి నిధులు ఇస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపారని విమర్శించారు.
అవినీతిని భూతంలా చూపి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారన్నారు. రాష్ట్రానికి వరదలు వస్తే సీఎం అమెరికా వెళ్ళారన్నారు. ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి కొత్త పాలసీ పేరిట ఇసుక దొరక్కుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఓ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ మతానికి ప్రభుత్వం అనుకూలం అనే భావన మూడు నెలల్లోనే ప్రజల్లో ఏర్పడిందన్నారు. దేవాలయాలకు దాతలు ఇచ్చిన భూములను ప్రభుత్వం ఇళ్ళ స్థలాల కింద పంపిణీ చేయటానికి ఆ భూములు ఎవరి సొత్తని ప్రశ్నించారు. బీజేపీ నేతల నాలుకలు చీలుస్తామని కొందరు మాట్లాడుతున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలన్నారు. బీజేపీలో చేరిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, వైసీపీ అక్రమాలకు నిరసనగా ఈనెల 16న పల్నాడులో ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రోసూరి వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్‌మోహన్ ప్రభాకర్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ