ఆంధ్రప్రదేశ్‌

‘చలో ఆత్మకూరు’పై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సేవ్ డెమోక్రసీ - సేవ్ పల్నాడు పేరిట చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధాన నేతల గృహాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. పలువురు నేతలను అర్ధరాత్రి నుంచే గృహనిర్బంధం చేశారు. బుధవారం ఉదయం ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్‌లు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. దీంతో రెండు జిల్లాల్లోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్‌ను సైతం గృహనిర్బంధంలో ఉంచారు. చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారులు ఎవరినీ అనుమతించక పోవడం, రాకపోకలను నియంత్రించడంతో పోలీసులు, పార్టీ శ్రేణులు, ముఖ్య నేతల మధ్య చాలా సేపు తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నివాసం వద్ద మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమం ఆద్యంతం తీవ్ర ఉద్రిక్తతలు, ఆందోళనలు, నిరసనల నడుమ కొనసాగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని కొనసాగించడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆది నుంచి నిరసిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడంతో వారం రోజుల క్రితం వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటుచేసి బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తూ వచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో బాధితులను స్వగ్రామాలకు తీసుకువెళ్లే ఉద్దేశంతో ఛలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే బుధవారం
జరగాల్సిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదిలోనే అడ్డుకుంది. తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకుని గృహ నిర్బంధం
చేశారు. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుండి బయలుదేరడంతోనే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం వద్దనున్న గేటుకు తాళ్లు కట్టి మరీ అడ్డుకోవడంతో టీడీపీ నేతలు, శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన టీడీఎల్‌పీ ఉప నేత కింజారపు అచ్చెన్నాయుడిని సైతం అడ్డుకోవడంతో మరోమారు అక్కడి వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ అక్కడికి చేరుకుని బాబు నివాసంలో మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారని, వారికి అల్పాహారం, భోజనాది సౌకర్యాల కోసం అనుమతించాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఉండవల్లి గుహల వద్దే పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మీడియాను సైతం లోపలికి అనుమతించక పోవడంతో ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఉండగా గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో ఏర్పాటుచేసిన వైసీపీ బాధితుల పునరావాస శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిబిరం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు లోపల ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తదితరులను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆయన నివాసంలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతున్న మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌లను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నియోజకవర్గ స్థాయిలో పలువురు నేతలను బైండోవర్ చేసి ఇళ్లకే పరిమితం చేశారు. కృష్ణా జిల్లాలో సైతం ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.
వైసీపీ నేతల గృహనిర్బంధం...
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పోటీగా వైసీపీ ఇచ్చిన పిలుపుతో గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ బాధితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉండటంతో అధికార పక్ష ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు. పల్నాడులోని వినుకొండ, నర్సరావుపేట, మాచర్ల, ఎమ్మెల్యేలు బొల్లాబ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డిలను వారి వారి నివాసాల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్త్ఫా, నంబూరు శంకరరావు తదితరులను పోలీసులు అడ్డుకుని బయటకు రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మొత్తమీద ప్రతిపక్ష, అధికార పక్షాలు పోటాపోటీగా చేపట్టిన ఛలో ఆత్మకూరు పర్యటన పోలీసు ముందస్తు నిర్బంధాలు, నియంత్రణ చర్యలు, ఆక్షలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అలజడులకు తావులేకుండా సమసిపోయేలా చేసింది. అయితే ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం, అరెస్ట్‌లు చేసిన తీరును చంద్రబాబు, ముఖ్యనేతలు తీవ్రంగా ఆక్షేపించారు.

చిత్రం...చంద్రబాబు నివాసం గేట్లు మూసి తాళ్లతో కడుతున్న పోలీసులు