ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతుండటంతో మొత్తం 70 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తివేసి నీరు దిగువకు వదులుతున్నారు. అయితే ఈ వరద తాకిడి వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కృష్ణా జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతానికి పులిచింతల నుంచి మూడు లక్షల క్యూసెక్కులుపైగా వరద నీరు చేరుతుండగా ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను
ఆరు అడుగుల పైకి ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతూ కాలువలకు 16వేల క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. గత నెల 13 నుంచి 20వ తేదీ వరకు భారీ ఎత్తున వరద రాగా అప్పట్లో ఈ సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో 8 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం ఎంతో సాఫీగా జరిగింది. అయితే ప్రస్తు అంచనాల ప్రకారం ఈ దఫా నాలుగు లక్షలకు నుంచి వచ్చే అవకాశం లేదంటున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ కళకళ
వరదల తాకిడితో ఐదేళ్ల తర్వాత తొలిసారిగా ఈ దఫా కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించి ఉన్న 13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు పూర్తిగా జరగటమే కాకుండా ఈ విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో జూలై మాసాంతం వరకు 12 శాతానికి మించి సాగవ్వని వరి ప్రస్తుత 90 శాతం లక్ష్యాన్ని అధిగమించడంతో రైతాంగంతోపాటు అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది. కృష్ణాలో వర్షపాతం ఆశించినంత మేర లేనప్పటికీ వరదనీటితో గత నెల రోజులుగా కాలువలన్నీ పూర్తి స్థాయిలో జలకళతో ఉట్టి పడుతున్నాయి. ఏదిఏమైనా మరో ఐదారు రోజుల్లో లక్ష్యానికి మించి పంటల సాగుకు అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కాలువలన్నీ జలకళను సంతరించుకుడటంతో కృష్ణాడెల్టాలో మొక్కజొన్న, చిరు ధాన్యాలు ఇతర పంటలు జోరుగా సాగవుతున్నాయి.

చిత్రం... బ్యారేజీ నుంచి దిగువకు విడుదలవుతున్న వరద నీరు