ఆంధ్రప్రదేశ్‌

రగులుతున్న నల్లమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 14: ప్రశాంతంగా ఉన్న నల్లమల అడవుల్లో అలజడి రేగింది. అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్న నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన సెగల్లోనూ ప్రత్యేకత ఉంది. సాధారణంగా సామాన్యుడు నిరసన ప్రారంభిస్తే ప్రముఖులు వారికి మద్దతుగా నిలిచేవారు. అలాంటిది నల్లమల అడవి విషయానికి వస్తే ముందు ప్రముఖులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండగా వారికి సామాన్యుడు తోడు కాబోతున్నాడు. దేశంలోని అతి పెద్ద అడవుల్లో ఒకటి, 14 అభయారణ్యాల్లో మూడవ స్థానంలో ఉన్న నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందన్న వార్తలే ఇందుకు కారణం. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమం జోరుగా సాగుతుండగా ఇప్పుడు జనం మేము సైతం అంటూ రోడ్లెక్కి నిరసన స్వరం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. నల్లమల అడవి అంటే ఇష్టపడని ప్రజలు ఉండరు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సుమారు 4 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పచ్చని అడవి. నల్లమల అడవిలో 3,728 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ అభయారణ్యంలో 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతముంది. ఈ ప్రాంతంలో జనసంచారం పూర్తిగా నిషిద్ధం. అంతేగాదు ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రావాలంటే సాధ్యమయ్యే పని కాదని నల్లమల అడవితో అనుబంధం ఉన్న వారు చెబుతూ ఉంటారు. నల్లమల అడవిలో ఉన్న కొండల్లో భైరవాని కొండ అత్యంత ఎతె్తైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ కొండ సుమారు 929 మీటర్ల ఎత్తు ఉంది. నల్లమలలోని కొండల సగటు ఎత్తు 520 మీటర్లుగా గుర్తించారు.
ఇక నల్లమల అడవిలో సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్షియస్‌గా ఉంటుంది. వేసవిలో ఇక్కడ 30 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదు కావని నిపుణులు వెల్లడిస్తున్నారు. చల్లటి వాతావరణం కలిగి ఉన్న నల్లమల అడవి ఉత్తరం నుంచి దక్షిణ దిశగా 144.87 కిలోమీటర్ల మేర విస్తరించగా తూర్పు, పడమర దిశలో 53 కిలోమీటర్లుగా ఉంది. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలను విడదీస్తూ నల్లమల కొనసాగుతుంది. మధ్యలో సరిహద్దులు ఉన్న నల్లమల అడవి ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోని పవిత్ర నదుల్లో ఒకటైన కృష్ణానది ఈ అడవి గుండా ప్రవహిస్తోంది. శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్న నల్లమల అడవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అడవిలో యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతిచ్చిందన్న వార్తల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. నల్లమల అడవి విస్తరించి ఉన్న తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు ప్రాథమికంగా 4 వేల బోర్లను వేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 4 నుంచి 8 ఇంచుల చుట్టు కొలత, 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోర్లను వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా బోర్లను వేయడానికి నల్లమల అడవిలోకి వాహనాలు వెళ్లేందుకు అనువుగా చెట్లను నరికి రహదారులను నిర్మించనున్నట్లు చర్చ సాగుతోంది. ఇక ప్రాథమిక పరిశీలన అనంతరం పూర్తి స్థాయి తవ్వకాలు చేపడితే నల్లమల అడవి 80శాతం నాశనమవుతుందని ఆ తరువాత యురేనియం కారణంగా మిగతా చెట్లు కూడా మరణిస్తాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా కరువు సీమగా పేరొందిన రాయలసీమకు జీవనాడిగా ఉన్న కృష్ణానది నీరు విషతుల్యమై తాగడానికి కూడా పనికిరాకుండా పోయే పరిస్థితి ఎదురుకాబోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో పీల్చడానికి గాలి కూడా ఉండని దుర్భర పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే తక్షణం అందరూ కదిలి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పిన పలువురు సినీ ప్రముఖులకు బాసటగా సామాన్యుడు నిలవడానికి సిద్ధమవుతున్నాడు. యురేనియం తవ్వకాల ప్రచారంతో నల్లమలలో రేగిన అలజడి ప్రశాంతంగా ముగుస్తుందా రక్తపాతమవుతుందా అన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.