ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: విహార యాత్ర పెను విషాదంగా మారింది. పాపికొండల అందాలు ఆస్వాదించేందుకు వెళ్లిన యాత్రికులు జల సమాధి అయ్యారు. ఓ ప్రైవేటు పడవ బోల్తా పడిన ఈ దుర్ఘటనలో 21 మంది సురక్షితంగా బయట పడగా, పది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 40 మంది ఆచూకీ తెలియడం లేదు. ముమ్మర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. నౌకాదళ హెలికాప్టర్లనూ రంగంలోకి దింపారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ మోహన్‌రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
60 మందికి పైగా పర్యాటకులతో పాపికొండలు విహార యాత్రకు బయలుదేరిన ఒక ప్రైవేటు పర్యాటక బోటు గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదం నుండి 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. పదిమంది మృత్యువాత పడగా, 40 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో వారిలో పలువురు చిన్నపిల్లలున్నారని ప్రమాదం నుండి బయటపడిన వారు చెబుతున్నారు. నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో సహాయక, గాలింపు చర్యలు చేపట్టడం కష్టసాధ్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదావరి జిల్లాల రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రత్యేక బోట్లలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. నౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతం నుండి ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రాయల్ వసిష్ఠ అనే రెండంతస్తుల ప్రైవేటు పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలుదేరింది. ఆ సమయంలో బోటులో పిల్లలు సహా 63మంది పర్యాటకులు, ఇద్దరు డ్రైవర్లు,
ఇద్దరు డ్యాన్సర్లు సహా తొమ్మిది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం ప్రాంతంలో బోటు హఠాత్తుగా ఒకపక్కకు ఒరిగిపోయి, నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో కొందరు పర్యాటకులు అందుబాటులో ఉన్న లైఫ్ జాకెట్లు ధరించి, బోల్తాపడిన బోటు పైభాగానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని కచ్చులూరు, తూటిగుంట గ్రామాలకు చెందిన వారు బోటు మునిగిపోతున్న విషయాన్ని గమనించి హుటాహుటిన పడవల్లో అక్కడకు చేరుకుని బోటుపైకి చేరిన 21 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చారు. నదిలో మునిగి మృతిచెందిన పదిమంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 40 మంది గల్లంతయ్యారు. సంఘటనాస్థలం వద్ద మూడు మృతదేహాలు, అంగుళూరు గ్రామం వద్ద మూడు మృతదేహాలు, దేవీపట్నం పోలీసు స్టేషన్ వద్ద నాలుగు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారిలో బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు కూడా ఉన్నారు. ఒడ్డుకు చేరిన వారిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సజావుగా వెళుతున్న బోటు హఠాత్తుగా ఒక్కసారిగా కుడివైపునకు ఒరిగిపోవడం మొదలయ్యిందని, దీనితో కొందరు బోటు పైభాగానికి చేరుకున్నారని, బోటు కొద్దిగా పైకి లేచినట్టు లేచి, ఒక్కసారిగా నిముషాల వ్యవధిలోనే మునిగిపోయిందని ప్రమాదం నుండి బయటపడిన వారు చెబుతున్నారు. రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పిల్లి సుభాష్‌చంద్రబోసు, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పరామర్శించారు.
ప్రమాద సమాచారంతో అప్రమత్తమైన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు డి మురళీధర్‌రెడ్డి, ఆర్ ముత్యాలరాజు, ఎస్పీలు అద్నాన్ నరుూం అస్మీ, నవదీప్‌సింగ్ గ్రేవాల్ హుటాహుటిన సహాయక, గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నివారణ బృందం (ఎన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తుల నివారణ బృందం (ఎస్డీఆర్‌ఎఫ్) సభ్యులు ప్రత్యేక బోట్లలో ప్రమాద స్థలానికి తరలివెళ్లారు. నౌకాదళానికి చెందిన హెలీకాఫ్టర్‌ను రంగంలోకి దించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టరేట్లలో సమాచారం కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు.
ప్రాథమిక సమాచారాన్ని బట్టి బోటులో ఉన్నవారిలో హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్ ప్రాంతానికి చెందిన 14మంది, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నరసాపురం తదితర ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్‌కు చెందిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన తొమ్మిది మంది గల్లంతైన వారిలో ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుండి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బృందంలో ఒకరు సురక్షితంగా బయటడపడగా, నలుగురు గల్లంతయ్యారు.

*చిత్రాలు.. ప్రమాదస్థలంలో మునిగిపోతున్న బోటు.* ప్రమాదం జరిగిన స్థలం
* పర్యాటక బోటు ప్రమాదానికి గురైన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది.