ఆంధ్రప్రదేశ్‌

వైకాపా గూటికి ‘తోట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న త్రిమూర్తులు మూడురోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి వైకాపాలో చేరామని చెప్పారు. ఇకపై సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, తమవంతు బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌కు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, అది సీఎం జగన్ వల్లే సాధ్యమన్నారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. గతంలో తనపై
ప్రత్యర్థులుగా పోటీచేసిన వైకాపా నేతలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కులాలతో రాజకీయాలు ముడిపడి ఉండవన్నారు. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ఒకప్పటి ప్రతిపక్షం వేరు, ఇప్పటి ప్రతిపక్షం వేరని ఆయనన్నారు. హూందాతనం, సంప్రదాయం, మంచిచేస్తే సమర్థించటం, చెడుచేస్తే అడ్డుకోవటం జరిగేవని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు టీడీపీ అధినేత పనితీరు గురించి మాట్లాడతానని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఆరోపణలపై స్పందిస్తూ అవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, కాపులందరికీ వర్తించదన్నారు. రాజకీయాల్లో రహస్యాలు ఉండకూడని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ త్రిమూర్తులు పార్టీలో చేరటం ఓ నూతన అధ్యాయమన్నారు. ఇకపై అన్ని కులాలు, మతాల సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వ వందరోజుల పాలన ప్రతిబింబిస్తోందని చెప్పారు. పీపీఏలలో అన్యాయంగా రాష్ట్రాన్ని దోచేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకంతో రాష్ట్రానికి, ప్రజలకు రూ. 700 నుంచి వెయ్యి కోట్ల మేర నష్టం జరుగుతోందన్నారు. ఈనేపథ్యంలో ప్రజాప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని ఆయనన్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పరాజయాన్ని చవిచూసినప్పుడు తాము వెరవలేదని, ఇప్పుడు అందరి కలయిక, పార్టీలో కలిసి పనిచేసే నైజం తప్పకుండా విజయానికి దోహదపడతాయని చెప్పారు. అంతిమంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలే శిరోధార్యమన్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు సీఎం జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లాంటి వికృత, కుల పక్షపాతిని ఎదుర్కోవాలంటే జగన్ ఒక్కరే సమర్థుడన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను అవలోకిస్తే ఎవరైనా సొంత పార్టీని, ఇంటివారిని తాకట్టుపెట్టే పరిస్థితులు ఉంటాయా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరు కావాలనుకుంటే వారు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబు విధానాలు ఆయనతో ఉన్న 23మంది ఎమ్మెల్యేలకు నచ్చటం లేదన్నారు. సీఎం జగన్ కనుసైగ చేస్తే పార్టీలో చేరేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో వైకాపా విజయం తథ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...తోట త్రిమూర్తులుకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి