ఆంధ్రప్రదేశ్‌

‘ఒకే దేశం - ఒకే భాష’ మోదీ, షా మరో కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: దేశంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ‘ఒకే దేశం - ఒకే భాష’ నినాదంతో మరో కుట్రకు నరేంద్ర మోదీ, అమిత్ షా తెరతీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. దేశానికి ఒకే భాష ఉండాలి, అది హిందీ అయి ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఇది లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు తూట్లు పొడవడమేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక, ఒకే దేశం - ఒకే భాష వంటి నిర్ణయాలతో దేశాన్ని అధ్యక్ష పాలన వైపు తీసుకెళ్లేందుకు, ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా పావులు కదుపుతున్నారన్నారు. దక్షిణ భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మేరకు బీజేపీ పట్టు సాధించేందుకు కుయుక్తులు ప్రారంభించిందని, దీనిలో భాగంగానే భాషాప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నానికి కొత్త కుట్రలను తెరపైకి తెస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు.
ఒకే భాష విధానం సరికాదు: మధు
దేవాదాయ శాఖలో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులపై బలవంతంగా హిందూ మతాన్ని రుద్దటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం - ఒకే భాష విధానాన్ని ముందు కు తెస్తూ హిందీని జాతీయ భాషగా ఆమోదించాలనటం భిన్నత్వంలో ఏకత్వానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయటం రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులకు భంగకరమన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆయా ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి తాము హిందువులంటూ డిక్లరేషన్ ఇవ్వాలంటూ జారీ అయిన ఆదేశాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దిగువ స్థాయి నుంచి కమిషనర్‌ట్‌లో పనిచేసే వారంతా హిందూ మతాన్ని ఆచరించాలని నిర్దేశించడం సరికాదని, ఇది లౌకికత్వానికి హానికరమన్నారు. ఆ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్ చేశారు. ఇక దేశ ప్రజలపై ఒకే భాషను రుద్దాలనుకోవటం దేశ ఐక్యతను దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మధు వివరించారు.