ఆంధ్రప్రదేశ్‌

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుండి కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 2 నుంచి సచివాలయాలు ప్రారంభమవుతున్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ నెల నుంచి పంపిణీ చేయాలని సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉంచాలన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు పొందుతున్న వారి జాబితాను బోర్డులో ప్రదర్శించాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాలసు సంబంధించి లబ్ధిదారుల జాబితా కూడా సచివాలయాల్లో ప్రకటించాలని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా పథకం ఎవరికి అందకపోయినా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
ఆటో, టాక్సీ యజమానులకు రూ. 10వేలు
సొంతంగా ఆటో, టాక్సీ, మాక్సీ కాబ్‌లు నడుపుకుంటున్న వారికి రూ. 10వేల ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దరఖాస్తులు స్వీకరించటంతో పాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆమోదించాలని సూచించారు.
ఉగాది నాడు పంపిణీ చేయనున్న 25 లక్షల ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఎంపిక, విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్ పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి లెక్కలు తేల్చాలన్నారు. నవంబర్ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, అధికారులు ఈ దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు
5.3 కోట్ల మందికి కంటి వెలుగు పరీక్షలు
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని సీఎం
ఆదేశించారు. ఆరు విడతలుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి వైద్యం అందేలా చూడాలన్నారు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలిదశ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేయాలన్నారు. రెండోవిడతగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3,4,5,6 విడతలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం మిగిలిన ప్రజలకు దశల వారీగా చికిత్సలు జరపాలన్నారు. ఇందుకోసం జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం వెబ్‌సైట్‌ను రూపొందించామని అధికారులు తెలిపారు. మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమైన విద్యార్థులను గుర్తించి ఆ మేరకు తదుపరి చికిత్స నిర్వహిస్తామన్నారు. కంటి వెలుగు కోసం రూ. 560 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్, శస్త్ర చికిత్స ఇతర కార్యక్రమాలన్నీ వైఎస్సార్ కంటి వెలుగు కింద చేపట్టాలని నిర్ణయించింది.
పౌష్టికాహార లోపాన్ని నియంత్రించాలి
పౌష్టికాహార లోపం, రక్తహీనత నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకో గలిగితే సమస్యను అధిగమించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపంతో పిల్లలు, తల్లులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల్లోని పేద మహిళలను ఆ సమస్య నుంచి కాపాడాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వం అధికమొత్తంలో ఖర్చు చేస్తున్నా ఎందుకు అధిగమించ లేకపోతున్నామని అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి పిల్లలు, తల్లులు, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు వెళ్లేలా చైతన్య పరచాలన్నారు. అక్కడ వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పౌష్టికాహార లోపం, ఎనీమియా పరీక్షలు జరిపిన అనంతరం వారి ఆరోగ్య కార్డులో పొందుపరచి ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలన్నారు. ఈ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే వాటిపై వలంటీర్లకు సమాచారం ఇచ్చి ఆ మేరకు పిల్లలు, తల్లులకు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ తనిఖీలు నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడే చిన్నారులకు రోజుకు రూ. 18 చొప్పున ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష జరిపారు. వర్షాల వల్ల జన జీవనానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అనంతపురం కలెక్టర్ సీఎంకు వివరించారు.
సీమ ప్రాజెక్ట్‌లు నింపాలి
వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తిస్థాయిలో నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. 117 టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా రిజర్వాయర్లు నిండలేదంటే కాల్వల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. వరద జలాలు సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఇసుక కొరతపై సమీక్ష
ఇసుక కొరతను అధిగమించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని అధికారులు వివరించారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహాలు ఉన్నాయని వరద తగ్గిన వెంటనే రీచ్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. వరద తగ్గుముఖం పట్టాక వీలైనంత ఇసుకను స్టాక్ యార్డులకు తరలించాలని సీఎం సూచించారు.
కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై వారికి వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. దరఖాస్తు పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అన్నీ అక్టోబర్ 2 నాటికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయాలన్నారు.
24, 27 తేదీల్లో స్పందన పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్
స్పందన కార్యక్రమం ద్వారా అందే వినతుల సత్వర పరిష్కారానికి ఈనెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తహశీల్దార్లు, ఎండీఒలు, మునిసిపల్ కమిషనర్లతో పాటు కలెక్టర్లు కూడా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. నవంబర్ నెల నుంచి ఈ విషయంలో ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. వినతులు ఇచ్చే వారి స్థానంలో మనం ఉంటే .. ఎలా ఆలోచిస్తామో.. అదే రీతిలో స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాలన్నారు. సమస్యలు తీరుస్తామనే ఆశతో వచ్చే ప్రజలకు ఉపశమనం కలిగించటమే మన బాధ్యత అన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి