ఆంధ్రప్రదేశ్‌

ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: దేశంలో ప్రాంతీయ పార్టీల శకం పూర్తి కావస్తోందని, జాతీయ సమైక్యతను నిలపగలిగేది జాతీయ పార్టీలేనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో మంగళవారం విశాఖలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సహకార లౌకిక వ్యవస్థకు జాతీయత అవసరమన్నారు. అది బీజేపీ వల్లే సాధ్యమని తాను బలంగా నమ్ముతున్నానని, మరో పది, పదిహేనేళ్ల పాటు దేశంలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గడచిన 72 ఏళ్లలో సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోలేకపోయామని, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఈసారి జమ్ము-కశ్మీర్ సహా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోగలిగామన్నారు. ఆర్టికల్ 370 విషయంలో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ తప్పుచేశారనే వాదన కంటే వివాదస్పదం అవుతున్న అంశాన్ని సవరించలేకపోయారని అన్నారు. వ్యాపార, పారిశ్రామిక వేత్తగా తాను టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గత అయిదేళ్ల కాలంలో కేంద్ర మంత్రిగా తాను రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఎంతో కృషి చేశానని, అయితే కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నది వాస్తవమేనని, గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పారు. తిరిగి మనమే అధికారంలోకి వస్తామన్న ధీమాతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమే నేటి దుస్థితికి కారణంగా పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అభిప్రాయపడ్డారు. సుస్థిర వౌలిక సదుపాయాలు కల్పిస్తే పౌర జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రం నుంచి అందాల్సిన సహాయంపై వివరించారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ కే హరిబాబు పాల్గొన్నారు.
బీజేపీ కలకాలం ఉంటుంది: టీజీ
భారతీయ జనతా పార్టీ కలకాలం ఉండే పార్టీ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ బీజేపీ కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్ళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు, బీజేపీలే జాతీయ పార్టీలని, అయితే కమ్యూనిస్టులు సిద్ధాంతపరంగా వ్యవహరిస్తుంటారన్నారు. జాతీయ పార్టీ బీజేపీయే దేశంలో కలకాలం నిలుస్తుందన్నారు. పాంతీయ పార్టీలంటే కుటుంబ పాలనతో కొన్నాళ్ళు ఉన్న తరువాత పోతుంటాయన్నారు. పడవ మునక సంఘటన దురదృష్టకరమన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా సిస్టమ్ బలోపేతం కావాలన్నారు. తప్పు జరిగిన తరువాత నోటీసులు జారీ చేయడం, కాంట్రాక్టర్లపైన, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వాలు మారినా సిస్టం మారకూడదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిషేధం తాత్కాలికమని, రాజ్యాంగపరంగా మీడియాకు హక్కులున్నాయని, ఇపుడు మీడియా రాజ్యమే నడుస్తోందంటూ విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఒకటి, రెండు ఛానళ్ళపై ప్రభుత్వ నిషేధం విధించిన విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా పైవిధంగా స్పందించారు.