ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జల్లెడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గోదావరిని జల్లెడ పడుతున్నారు. నదిలో ప్రత్యేక బోట్లలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలతో పాటు హెలికాఫ్టర్ ద్వారా సుదూర ప్రాంతాల వరకు గాలింపు జరుపుతున్నారు. ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు మునిగిపోయిన బోటును వెలికితీయడంపై అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గోదావరి నదిలో బోటు మునిగిపోయి బుధవారానికి నాలుగవ రోజుకు చేరింది. ప్రమాద ప్రాంతం కచ్చులూరు నుంచి దిగువ సముద్రం తీరం వరకు హెలీకాప్టర్‌లో గాలింపు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఇటు యానాం, అటు అంతర్వేది నదీ సంగమ ప్రాంతాల వరకు గాలింపు సాగుతోంది. మరోవైపు మునిగిపోయిన బోటు వెలికితీయడానికి బుధవారం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ సిబ్బందితో సాంకేతిక నిపుణుల బృందం బోటు ఎంత లోతులో ఉందనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకుంటోంది. బోటును ప్రవాహ దిశగా లాగడమా లేక పైకి లాగడమా అనే అంశంపై సమాలోచనలు సాగిస్తున్నారు. బోటు ఉన్న
ప్రాంతంలో వెలికితీయడానికి తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతాయని నిపుణులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కనీసం ఒడ్డు కూడా సరిగా లేకపోవడంవల్ల క్రేన్లు కూడా వినియోగించే అవకాశంలేదు. ముందుగా ఆ ప్రాంతంలో ఒక ఫంటును ఏర్పాటుచేశారు. ఈ ఫంటు నుంచి లోతు అంచనావేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. బోటు నదీ గర్భంలో మట్టిలో కూరుకుపోయింది. సుమారు 20 టన్నుల బరువు కలిగిన బోటును బయటకు తీయాల్సివుంది. లాంచీలో మరికొన్ని మృతదేహాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా మెరైన్ మాస్టర్ గౌరవభక్షి, కాకినాడ పోర్టు అధికారుల ఆధ్వర్యంలో బోట్లు వెలికితీతలో నిపుణుడైన సంప్రదాయ మత్స్యకార వర్గానికి చెందిన ధర్మాడ సత్యంతో పాటు నిపుణుల బృందం బుధవారం దేవీపట్నం నుంచి కచ్చులూరు వెళ్ళింది. ఈ బృందానికి బలిమెల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో వద్ద గతంలో మునిగిపోయిన బోట్లను వెలికి తీసిన అనుభవం వుంది. ప్రమాదస్థలికి భారీ తాళ్లు, వైర్లు, గేలాలు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఉన్న ఫంటు పైనుండి నదిలోకి తీగెల గేలం తగిలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తం 20 మంది సభ్యుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటోంది. మరోవైపు ముంబై, కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి వచ్చిన నిపుణులు సైతం రంగంలోకి దిగారు. ధర్మాడ సత్యం బృందం నదిలోకి దిగేందుకు ప్రయత్నించే సమయంలోనే ఆ ప్రాంతంలో భారీ వర్షంపడింది. దీంతో సుమారు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. సోనార్ పరికరంతో ఉత్తరాంఛల్ రాష్ట్రానికి చెందిన బృందం మునిగిపోయిన బోటు జాడ తెలుసుకోగలిగింది. బుధవారం కచ్చులూరు, దేవీపట్నం, రంపచోడవరంలో భారీ వర్షం పడింది. ఉత్తరాంచల్ బృందం తప్ప మిగిలిన బ్రందాలు ప్రమాదం జరిగిన సుడిగుండాల ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది.
బోటు ఆచూకీ లభ్యం:మంత్రి విశ్వరూప్
గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటు ఆచూకీ తెలిసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ముంబైకి చెందిన నిపుణులు మునిగిన లాంచీని సుమారు 300 అడుగుల లోతులో వుందని నిర్ధారించి వెళ్ళారని తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం ముంబాయి వెళ్ళి ప్లాన్ తయారు చేసుకుని మూడు రోజుల్లో వస్తారన్నారు.
*చిత్రం... బోటును వెలికి తీయడానికి కచ్చులూరు నుండి ప్రమాద ప్రాంతానికి తరలిస్తున్న వైర్లు, తాళ్లు తదితర సామాగ్రి