ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలను వీడని వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 20: వరుణుడు పగబట్టాడా అన్నట్లు కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో వరుసగా 5వ రోజు కూడా కుంభవృష్టి వర్షాలు కురిసాయి. డివిజన్‌లో శుక్రవారం తెల్లవారుజాము వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. డివిజన్‌లోని ఆళ్లగడ్డ మండలంలో అత్యధికంగా 14.42 సెం.మీ వర్షపాతం నమోదైంది. డివిజన్‌లోని అన్ని మండలాల్లో 3 సెం.మీ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో ప్రజా జీవనం అతలాకుతలమైంది. డివిజన్‌లోని 13 మండలాల్లో 118 గ్రామాల్లో సుమారు 67 వేల మంది ప్రజలు వర్షం ధాటికి నిలువనీడ లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పలుచోట్ల మిద్దెలు నేలకూలాయి. 31 వేల హెక్టార్లలో పంట పూర్తిగా నష్టపోగా మరో 2 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. డివిజన్‌లో 650 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు నాశనమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కుందూ, పాలేరు, చామకాలువ, మద్దిలేరు వంటి చిన్న నదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. కుందూ నదిలో 14 వేల క్యూసెక్కుల నీటి పారుదలకు అవకాశం ఉండగా సుమారు 60 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో పొలాలు, గ్రామాలను ముంచెత్తుతూ ఉరకలు వేస్తోంది. సుమారు 35 గ్రామాలకు రహదారుల వ్యవస్థ దెబ్బతినడంతో ఆయా గ్రామాల ప్రజలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నట్లైంది. వరుసగా 5 రోజులుగా చీకటి పడితే కుంభవృష్టి కురుస్తుండటంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కాగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ప్రజలు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుణుడు శాంతించి సాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప పూర్తిస్థాయి సహాయక చర్యలకు వీలు కాదని అధికార యంత్రాంగం వెల్లడిస్తోంది. తాత్కాలికంగా ఏర్పాట్లు చేశామని, అయితే అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా సుమారు రూ. 670.62కోట్ల మేర నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.