ఆంధ్రప్రదేశ్‌

జాడలేక వారం అయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం :తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పాపికొండల ప్రాంతం వెళ్తోన్న పర్యాటక బోటు బోల్తా పడి గత ఆదివారమే జరిగింది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో 14 మంది ఆచూకీ నేటికీ జాడ లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోధన వర్ణనాతీతం..గుండె నిండా దుంఖంతో వచ్చీపోయే అంబులెన్స్‌ల వైపు చూస్తున్నారు. కానరాని ఆచూకీ కోసం కడుపు కోతతో ఎదురు చూస్తున్నారు. బోటును వెలికి తీసే పరిస్థితి కనిపించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆసుపత్రి వద్ద ఉండొద్దు ఆచూకీ లభిస్తే కబురు చెబుతామని అధికారులు చెప్పడాన్ని బట్టి చూస్తుంటే తమకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. బరువెక్కిన గుండెతో బాధితులు ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. ఆదివారం ఒక మహిళ మృతదేహం లభించింది. దీంతో ఇప్పటి వరకు 37 మంది మృతదేహాలు లభించాయి. 77 మంది ఈ ప్రమాదంలో చిక్కుకోగా 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. ఇంకా 14 మంది ఆచూకీ తెలియ లేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం హెలీకాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు ఇంకా జల్లెడ పడుతున్నాయి. బోటును వెలికితీసేందుకు సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్నామని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పారు. అయితే గత రెండు రోజులుగా బోటు వెలికితీత ప్రక్రియలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. వెలికి తీసేందుకు ముందుకొచ్చిన బృందాలన్నీ వెను తిరిగినట్టు తెలుస్తోంది. మెరైన్ మాస్టర్ భక్షీ ముంబాయి నుంచి నెదర్లాండ్ బృందంతో చర్చించి సాంకేతిక కార్యాచరణతో వస్తే తప్ప వెలికి తీత కార్యక్రమం మొదలు కాదని తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న కాకినాడ పోర్టు అధికారి ప్రమాద ప్రాంతానికి వచ్చి పరిశీలించి కలెక్టర్‌కు వివరాలు తెలియజేసినట్టు చెబుతున్నారు. నిండు ప్రాణాలు జల సమాధి అయినట్టు నిజాలు కూడా జల సమాధి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ నరుూమ్ అస్మి ప్రమాదానికి గురైన బోటులో లైఫ్ జాకెట్లు ధరించి వున్న దేవీపట్నం పోలీసులు తీసిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పోలీసుల వద్ద వున్న ఫొటోలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిన నేపధ్యంలో ఈ ఫొటో మీడియాకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆచూకీ తెలియాల్సిన వారిలో ఏపీకి చెందినవారితోపాటు తెలంగాణాకు చెందిన వారు కూడా ఉన్నారు. మంచిర్యాలకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ రమ్యశ్రీ, రామాంతపూర్‌కు చెందిన పవన్‌కుమార్, అతని భార్య వసుంధర భవాని, వరంగల్‌కు చెందిన ధర్మారావు, కొమ్ముల రవి, రాజ్‌కుమార్ తదితరుల ఆచూకీ తెలియాల్సి ఉందంటున్నారు. మరోవైపు గోదావరి నది స్పల్పంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద 25.70 అడుగులు, ధవళేశ్వరం వద్ద ఆదివారం రాత్రి 10.80 అడుగుల మట్టంలో గోదావరి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబందించి ధవళేశ్వరం ఆర్మ్‌లో 0.70 మీటర్లు, ర్యాలీ ఆర్మ్‌లో 0.80 మీటర్లు, మద్దూరు ఆర్మ్‌లో 0.80 మీటర్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 0.70 మీటర్ల మేరకు గేట్లను ఎత్తి వేసి 3.60 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. పోలవరం వద్ద 9.00 మీటర్ల మట్టంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఏదేమైనప్పటికీ త్వరితగతిన బోటును వెలిసి తీయాలని, గాలింపు ముమ్మరం చేయాలని బాధితులు కోరుతున్నారు.

*చిత్రం... కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోల్తా పడిన ప్రమాదానికి ముందు బోటులో లైఫ్ జాకెట్లు ధరించి ఉండగా దేవీపట్నం పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటో