విశాఖపట్నం

బంగారం కన్నా విలువైంది నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రస్తుత పరిస్థితుల్లో నీరు బంగారం కన్నా విలువైందని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణ అన్నారు. జిల్లాలోని సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులకు వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమం ఇక్కడి ఇరిగేషన్ ప్రాజెక్టు హౌస్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షం బిందువును భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల నిమిత్తం 137 ఎంజిడిల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 44 ఎంజిడిలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను పెంపొందించాలన్నారు. ప్రభుత్వం పంట సంజీవని పథకం కింద గ్రామంలో 100 ఇంకుడు గుంతలను తవ్వితే 14 లక్షల రూపాయల మేరకు గ్రామంలో సిసి రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర రీజియన్ చీఫ్ ఇంజనీర్ సిహెచ్. శివరాంప్రసాద్ మాట్లాడుతూ వివిధ అవసరాల నిమిత్తం నీటి వినియోగం ఎక్కువ అయిందని, దీంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగిందన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షం ఒకే సారి ఎక్కువగా కురుస్తుండటంతో నీరు సముద్రంలో కలుస్తోందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువులకు, కాలువలకు మరమ్మతులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశానికి వైజ్ కమ్యూనికేషన్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.వి.వర్లు అధ్యక్షత వహించగా, జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యుడు కర్రి అప్పారావు, జలవనరుల శాఖ ఎస్.ఇ ఆర్.నాగేశ్వరరావు, ఇఇ కె.మల్లికార్జునరావు, తాండవ రిజర్వాయరు కమిటీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, రైవాడ రిజర్వాయరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బొడ్డు వెంకట రమణ, కోనాం రిజర్వాయరు కమిటీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గండి ముసలినాయుడు తదితరులు ప్రసంగించారు.

26న ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్సు సమ్మిట్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాలలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా 26న ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సమ్మిట్‌ను నగరంలో నిర్వహించనున్నట్లు ఎపి ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శివసాగరరావు తెలిపారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాలకు, ఇతర దేశాల్లోని విమానాశ్రయాలకు కనెక్టవిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఎయిర్ కనెక్టవిటీ అవసరమన్నారు. ఎపి ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ రామకోటయ్య మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి ఏటా 13 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు. కనెక్టివిటీ పెరిగితే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రి, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విదేశీ విమానాయాన సంస్థల ప్రతినిధులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యలను అధికారులతో చర్చించేందుకు వీలు అవుతుందని తెలిపారు. ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ డైరెక్టర్ ఒ.నరేష్‌కుమార్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సౌకర్యం, టెంపరేచర్ కంట్రోల్డ్ స్టోరేజీ సౌకర్యం వంటివి అవసరమన్నారు. దీనిని అధికారులు, మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. దీని వల్ల విశాఖ విమానాశ్రయంలో వౌలిక సదుపాయాలు ఒనగూరే వీలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎపి ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డి.ఎస్.వర్మ తదితరులు మాట్లాడారు.

నగరంలో తపాలా సేవలకు అంతరాయం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: నగరంలోని వివిధ పోస్ట్ఫాసులను కోర్ బ్యాంకింగ్ సొల్యుషన్స్ పరిధిలోకి తీసుకువస్తుండటంతో తపాలా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చిన్న మొత్తాల పొదుపు, పింఛన్ల చెల్లింపు తదితర లావాదేవీలు దాదాపు నిలిచిపోయాయి. మొరాయిస్తున్న నెట్‌వర్క్‌తో ఈ లావాదేవీల కొసం వచ్చే వారితో చాలా చోట్ల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. నగరంలోని 66 తపాలా శాఖ కార్యాలయాల్లో 52 శాఖలను కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకు వసున్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానం అమలుకు ఈ విధానాన్ని అన్ని తపాలా కార్యలయాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలోకి మారడం వలన ఏ శాఖ నుంచి అయినా లావాదేవీలు నిర్వహించుకునే వీలు, బ్యాంక్‌ల తరహాలో కొన్ని లావాదేవీలు నిర్వహించేందుకు వీలు అవుతుంది. వివరాలన్నింటి కంప్యూటరీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ సక్రమంగా పని చేయకపోవడం, బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉండటంతో కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి. దీంతో చినవాల్తేరు, ఇసుకతోట, విశాలాక్షినగర్, ఆంధ్ర యూనివర్సిటీ, లాసన్స్‌బే కాలనీ, దొండపర్తి తదితర ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల్లో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజు మొత్తం మీద నాలుగైదు లావాదేవీలను మాత్రమే చేసే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల తపాలా సిబ్బందితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ డిపాజిట్లపై వడ్డీని డ్రా చేసేందుకు వచ్చే వారు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల నుంచి నిధులను డ్రా చేసేందుకు వచ్చే వారు ఈ పని చేయని కంప్యూటర్‌లు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో కిసాన్ పత్రాలు, ఇతర ఆదాయపు పన్ను కింద డిపాజిట్ చేసేందుకు వచ్చే వారితో రద్దీగా ఉంటున్నాయి. కానీ లావాదేవీలు నత్తనడకన జరుగుతుండటం విమర్శలకు గురి అవుతున్నది. 30 నిమిషాలకు కూడా ఒక లావాదేవీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఇటు ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పోస్టు మాస్టర్లు, సిబ్బంది రాత్రి పొద్దు పోయే వరకూ పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబిఎస్ విధానం ద్వారా నిర్వహించిన లావాదేవీలను కొత్త సాఫ్ట్‌వేర్ విధానంతో పోల్చి చూసుకుని నివేదిక పంపాలి. దీంతో రాత్రి పొద్దు పోయే వరకూ పని చేస్తున్నారు. ఈ విషయమై తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ (విశాఖ రీజయన్) కెవిఎల్‌ఎన్ మూర్తి వద్ద ప్రస్తావించగా, తపాలా కార్యాలయాల వద్ద ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అంగీకరించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, ఈ మాసాంతానికి ఈ విధానం సక్రమంగా పని చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

11 నుంచి విమ్స్ సేవలు
* మంత్రి కామినేని
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (విమ్స్)లో ఔట్ పేషంట్ సేవలను ఏప్రిల్ 11 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విమ్స్ ప్రారంభానికి సంబంధించి గతంలో కొన్ని తేదీలు ప్రకటించినా, ఈ సారి మార్పు ఉండబోదని స్పష్టంచేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తుందని మీడియాకు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణ బోర్డుగా మాత్రమ సేవలు అందిస్తున్నదని తెలిపారు. కానీ త్వరలో విమ్స్ సహా మరో పరీశోధనా సంస్థ ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి రానున్నాయని తెలిపారు. ఈ ఆంశంపై విస్తృతంగా చర్చించాక విశ్వవిద్యాలయానికి అనుంబంధంగా విమ్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వివిధ పరికరాలు మరమ్మతులకు గురైతే వాటిని ఆ రోజే మరమ్మతు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల తీరు మెరుగుపడిందని, అయినా ఇంకా మెరుగు పరిచేందుకు వీలు ఉందని తెలిపారు.

సర్కార్ కొలువుల్లో సోలార్
* పవర్ ప్రాజెక్టులపై శ్రద్ధ చూపని అధికారులు
* ఇళ్ళపై సోలార్ రూప్‌టాప్‌లకు అవగాహనాలోపం
* ఒకే సదస్సుతో సరి...
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: వేసవి మండిపోతోంది...విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. ఏసీ వాడకాలు సంగతి చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో 3సోలార్ పవర్ ప్రాజెక్టు2లు అందుబాటులోకి వస్తే విద్యుత్ డిమాండ్‌ను తగ్గించినట్టు అవుతుంది. వినియోగదారులకు, సర్కార్ కొలువులకు ఆర్ధిక భారం తగ్గుతుంది. అన్నింటికంటే ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. కాలుష్యాన్ని నియంత్రించినట్టు అవుతుంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు, సోలార్ రూప్‌టాప్ ప్రాజెక్టుల వలన ఇటువంటి అనేక రకాలైన ప్రయోజనాలున్నాయి. అయినా గత రెండేళ్ళుగా దీని గురించిన ప్రకటనలే తప్ప వీటిని ఏర్పాటు చేసుకునే పరిస్థితులు అతి తక్కువుగానే ఉంటున్నాయి.
* సర్కార్ కొలువుల్లో కనిపించని స్పందన...
సర్కార్ కొలువుల్లో సోలార్ పవర్ వినియోగం పగటి కలగానే మారిపోతోంది. గత కొనే్నళ్ళుగా ప్రచారమే జరుగుతుంది. తప్పితే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు అనేది జరగడంలేదు. దీంతో నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిని తప్పనిసరి చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచించాయి. అయినా ఫలితం లేకపోయింది. విశాఖ నగరంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీంటిలో పగలు సైతం దీపాలు, ఫ్యాన్లు, ఏసిల వాడకం తప్పనిసరి. రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు, ఎక్సైజ్ శాఖలు, ఖజనా, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పంచాయితీరాజ్, లేబర్ కమిషనర్ కార్యాలయం, నీటిపారుదలశాఖ, జిల్లాప్రజాపరిషత్, సంక్షేమభవన్, ప్రభుత్వ సంక్షేమగృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పశుసంవర్ధకశాఖ, ఉద్యానవనశాఖ, జ్యూడిషీయల్ వంటి వాటిల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం నెడ్‌క్యాప్ సహకరించేందుకు ముందుకొస్తుంది. దీని సహాయంతో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోగలిగితే కొన్నాళ్ళు మంచి ఫలితాలుంటాయి. ఆర్ధికభారాన్ని తగ్గించుకోవడంతోపాటు, విద్యుత్‌ను ఆదా చేస్తూనే, దీని డిమాండ్‌ను అధిగమించవచ్చు.
* కలెక్టరేట్ ఆర్ధిక భారం...
కలెక్టరేట్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతినెల కనీసం ఐదు లక్షల మేర విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. నాలుగు నుంచి ఆరు లక్షల వరకు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. అదే వేసవి సీజన్‌లో వాడకం కాస్త పెరుగుతుంది. కలెక్టరేట్‌లో ఆయా విభాగాల్లో దీపాలు, ఫ్యాన్లతోపాటు, ఉన్నతాధికారుల ఛాంబర్‌ల్లో ఏసిల వాడకం ఉంటుంది. దీనివల్ల సాదారణ రోజుల కంటే కూడా మరింత ఎక్కువగా బిల్లులు వస్తాయి. అందువల్ల ఇటువంటి చోట సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేస్తే నెలవారి బిల్లుల భారం తగ్గుతుందని భావించిన అధికారులు మూడేళ్ళ కిందటే సోలార్ కోసం ప్రతిపాదించారు. ప్రత్యేక ఏజెన్సీ ద్వారా దీనిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈలోపు కేంద్రమే సబ్సిడీని ప్రకటించడం, దీనికి సంబందించిన విస్తృత ప్రచారం జరపడంతోపాటు జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అయినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యమైన కెజిహెచ్, ఘోసాసుపత్రి, ఇఎన్‌టి, కంటి, ఛాతి, మానసికవైద్యశాల, వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయాలున్నాయి. వీటన్నింటిలో కంటే కెజిహెచ్‌లో సోలార్ పవర్ అవసరాన్ని గుర్తించిన వైద్యాధికారులకు రెండేళ్ళ కిందటనే ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపారు. అయినా వీటికి కదలిక లేదు. ఈ ఆసుపత్రిలో విద్యుత్ ద్వారానే నిత్యం నీటిసరఫరా జరుగుతుంటుంది. అలాగే వార్డులు, కార్యాలయాలు, పలు విభాగాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా తప్పనిసరి. అందువల్ల ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడం, భారాన్ని తగ్గించునే వీలుంది. ప్రతినెల లక్షలాది రూపాయల మేర బిల్లులు చెల్లిస్తుండగా ఏడాది మొత్తంమీద కోటికి పైగానే చెల్లించిస్తోంది. వీటితోపాటు గతంలో అనేకసార్లు జిల్లా ప్రధాన ఖజనా కార్యాలయంతోపాటు ఉప కార్యాలయాల్లోను సోలార్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసాయి, అలాగే ఆర్టీసీ కార్యాలయం, డిపోలు, ఆర్టీసీద్వారకాకాంప్లెక్స్, పలు విభాగాల్లోను ఈ ప్రాజెక్టు గురించి ప్రతిపాదనలు సంస్థ యాజమాన్యానికి పంపారు. దీనిపై అధ్యయనం చేసిన యాజమాన్యం తప్పనిసరి చేయాలని భావించింది. అయితే తరువాత మళ్ళీ వీటిని పెండింగ్‌లో పెట్టేశారు. ఈ విధంగా అనేక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రతిపాదనలతోనే సరిపెడుతున్నారు. తప్పితే వీటిని కార్యరూపం దాల్చేలా చేయలేకపోతున్నారు.

విద్యార్ధులకు పరీక్ష...
* ప్రయాణికులకు శిక్ష...
* అసలే మండుటెండలు...అందుబాటులోలేని ఆర్టీసీ
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: పదవ తరగతి విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నాయి. 12గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిర్వహిస్తోంది. ఉదయం పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళిన బస్సులు ఆయా స్కూళ్ళ వద్దనే ఉంటూ తిరిగి పరీక్ష ముగిసినంత తరువాత విద్యార్ధులను తీసుకువెళ్తున్నాయి. ఈ మధ్య మూడు గంటలకాలం ఒకేచోట ఉండిపోవడం, పరీక్షా కేంద్రాలకు నడిపే బస్సుల స్థానంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ జిల్లావ్యాప్తంగా దాదాపు 80 బస్సుల వరకు పరీక్షలకు కేటాయించారు. ప్రతి డిపో నుంచి కనీసం ఐదేసి బస్సుల వంతున నిర్వహిస్తున్నారు. అదీ ఉదయం సమయంలో కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, ఆసుపత్రులకు వెళ్ళే రోగులు, దుకాణాలు, మార్కెట్లు, రైతుబజార్లకు వెళ్ళాల్సిన మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే మండుతున్న ఎండతో ఉదయం 11 గంటలు దాటిన నుంచి ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం ఈ ఉదయం సమయంలో అందుబాటులోలేని బస్సుల వలన సామాన్యులకు కష్టాలు తప్పడంలేదు.

రేడియాలజీ విభాగంలో ఎక్స్‌రే
* త్వరలో అందుబాటులోకి రానున్న లిఫ్ట్‌లు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 22: కేజిహెచ్ రేడియాలజీ విభాగంలో కొత్తగా ఎక్స్‌రే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలందించడంలో భాగంగా దీనిని కొనుగోలు చేశారు. అత్యంత అధునాతనమైన దాదాపు రూ.13లక్షల విలువైన ఈ ఎక్స్‌రే యూనిట్ వలన రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్షణాల్లో ఎక్స్‌రేను తీసే సౌలభ్యం ఉంటుంది. దీనివల్ల గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, విశాఖ కేజిహెచ్‌లో రేడియోలజీ విభాగాలకు తొలిదశలో ఎక్స్‌రే యూనిట్లను సమకూర్చినట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. అలాగే గత కొంతకాలంగా మొరాయించిన లిఫ్ట్‌లకు త్వరలో మోక్షం లభించనుంది. దాదాపు 70లక్షల వ్యయంతో వీటిని ఆధునీకరిస్తున్నందున రోగులకు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. క్యాజువాలటీ, ఆసుపత్రి సూపర్‌స్పెషాలిటీ విభాగాల వద్ద ఉండే రెండింటికి మరమ్మతులు చేపడుతున్నారు. అవసరాన్నిబట్టి వీటికి అధునాతన పరికరాలు అమర్చుతారు. రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖ ఎంపీ డాక్టర్ హరిబాబు దృష్టికి ఆసుపత్రి వైద్యులు ఏడాది కిందటనే వీటి గురించి తీసుకువెళ్ళారు. రోగులకు అవసరమైన లిఫ్ట్‌లు గత కొంతకాలంగా పనిచేయకపోవడాన్ని తప్పుబట్టిన వీరు ప్రతిపాదనలు కోరారు. అయినా గత ఏడాదికాలంగా వీటికి మోక్షం లభించనేలేదు. ఎట్టకేలకు ఇటీవల ప్రభుత్వం రూ.60 లక్షలకు పైగానే మంజూరు చేసింది. దీంతో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. సూపర్‌స్పెషాలిటీ విభాగంలో ఇప్పటికే లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ప్రత్యేకించిన నిధులతో సమకూర్చగలిగారు.

26న గీతం వేదికగా టెడ్‌ఎక్స్
* విభిన్న రంగా ప్రముఖులతో ప్రసంగాల ఏర్పాటు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: దేశంలోని వివిధ రంగాలకు చెందిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ప్రసంగాలతో కూడిన టెడ్‌ఎక్స్ కార్యక్రమానికి ఈ నెల 26వ తేదీన గీతం విశ్వవిద్యాలయం వేదికగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా టెడ్‌ఎక్స్ పేరిట ఏర్పాటయ్యే కార్యక్రమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా గీతం విశ్వవిద్యాలయంలో జరుగనున్న టెడ్‌ఎక్స్‌కు వివిధ రాష్ట్రాల నుండి విద్యార్ధులు పెద్దఎత్తున పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా భిన్నరంగాల్లో వస్తున్న సరికొత్త మార్పులను, స్ఫూర్తిని రగిలించే వ్యక్తుల జీవితాలను స్వయంగా వారి నోటి వెంట వినే అరుదైన అవకాశం టెడ్‌ఎక్స్ ద్వారా విద్యార్ధులకు లభించనుంది. గత నాలుగేళ్ళుగా నిరాటకంగా గీతం విశ్వవిద్యాలయంలో జరుగుతున్న టెడ్‌ఎక్స్ కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి.
* గీతం టెడ్‌ఎక్స్‌కు హాజరుకానున్న ప్రముఖులు
అనుభవ్ వాద్వా: వినియోగం పూర్తయ్యాక వృధాగా పారవేసే భారీ వాహనాల నుంచి చిన్న వాహనాల వరకు టైర్లను సేకరించి వాటిని రీసైక్లింగ్ విధానంలో రసాయనాలు ఉపయోగించి పెట్రోలు వివిధ వస్తువుల ఉత్పత్తికి వినియోగిస్తున్న 15 ఏళ్ళ వయస్సు గల అనుభశన్ వాద్వా టెడ్‌ఎక్స్‌లో ప్రసంగించనున్నాడు. చిన్న వయస్సులోనే 3టైర్ లెస్సీ2 పేరిట కంపెనీని నెలకొల్పి సిఇఓగా మారడంతోపాటు ప్రపంచ దృష్టిని ఈ టీనేజ్ పరిశోధకుడు పారిశ్రామికవేత్త తనకు స్ఫూర్తినిచ్చిన విషయాలను గీతం వేదికపై వెల్లడించనున్నారు.
* రుతికా భట్టాచార్య : దేశంలోని చట్ట సభలకు ఎంపికవుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారి ప్రాంతంలో సమస్యలను విశే్లషణాత్మకంగా తెలియజేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికా రచన చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన స్వానితి స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకురాలు రుతికా భట్టాచార్య టెడ్‌ఎక్స్‌లో ప్రసంగించనున్నారు. వినూత్నంగా నడుపుతున్న స్వచ్చ్ధం సంస్థ ద్వారా ప్రజాప్రతినిధులను ఏ మేరకు ప్రభావతి చేయగలిగానో ఆమె స్వయంగా తెలియజేయనున్నా.
* కె.శ్రీనివాస చక్రవర్తి: పలు భారతీయ భాషలకు ఉమ్మడిగా భారతి పేరిట స్క్రిప్ట్‌ను రూపొందించిన యువ సాంకేతిక నిపుణులు స్వల్ప వ్యవధిలో వివిధ భాషలను ఎలా నేర్చుకోవచ్చో టెడ్‌ఎక్స్ వేదికపై వివరించనున్నారు.
* కిషోర్ మంధ్యన్ : ఐక్యరాజ్యసమితి తరపున పలు దేశాల్లో శాంతి స్థాపనకు, రాజకీయ సుస్ధిర ఏర్పడటానికి, మానవ హక్కుల పరిరక్షణకు విశేషంగా కృషి చేసిన భారతీయ ప్రముఖుడు కిషోర్ మంధ్యన్ తన అనుభవాలను టెడ్‌ఎక్స్ వేదిక నుంచి వివరించడానికి గీతం విశ్వవిద్యాలయానికి రానున్నారు.
* అజిత సుచిత్ర వీరా: చలన చిత్ర రంగంలో ఒక మహిళ డైరెక్టర్‌గా, రైటర్, ఫోటోగ్రాఫర్, ప్రొడ్యుసర్‌గా ఎదగడానికి గల వాతావరణాన్ని సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకురాలు అజిత సుచిత్ర వీర వివరించనున్నారు. సామాజిక అంశాల నుంచి వాస్తవ కథా రూపాలను తెరకు ఎక్కించడంతోపాటు శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఆథ్యాత్మిక అంశాలను తెరపై ఏ విధంగా ఆవిష్కరించవచ్చో ఆమె తెలియజేయనున్నారు.
* సురేష్ ఎరియత్ : దేశంలో మొదటిసారిగా యూనిమేషన్ స్టూడియోను స్థాపించి బాలలను ఆకట్టుకునే యూనిమేషన్ చిత్రాలతోపాటు పలు సంస్థలకు ప్రచార చిత్రాలను రూపొందించి విశేష ఖ్యాతిని ఆర్జించిన సురేష్ ఎరియత్ టెడ్‌ఎక్స్ వేదికపై తన యానిమేషన్ చిత్రాలతో సందడి చేయనున్నాడు. భారతదేశంలో యానిమేషన్ చిత్ర రూపకల్పనలో, సాధక, బాధకాలను విద్యార్ధులతో పంచుకోనున్నాడు.
* యాంటెనో సోలార్ జాన్: దేశంలో న్యూరో లింగ్విస్టిక్ నిపుణుడుగా పేరోందిన జాన్ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన సూచనలతోపాటు ప్రతిఒక్కరికి వారు ఎంత ఎంతకాలం జీవించి ఉంటారో అనే అంశాలను కూడా ప్రస్తుత జీవిత విశేషాలను బట్టి ముందస్తుగా వివరించడంలో సిద్ధహస్తుడు. ఆసక్తి కలిగించే జాన్ ప్రసంగాన్ని టెడ్‌ఎక్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వీరితోపాటు ప్రముఖ క్రీడా విశే్లషుకుడు, స్పోర్ట్స్ మెకానిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యం రామకృష్ణన్, సంగీత వాయిద్యాల నుంచి వెలువడే విధంగా నోటితో సంగీతాన్ని శ్రవణానందంగా వినిపించే రాజువర్మ టెడ్‌ఎక్స్‌లో ప్రసంగించనున్నారు. దీనిని గీతం విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎమ్‌ఎస్ ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని విద్యార్ధి వ్యవహారాల డైరెక్టర్ కె.వీరభద్రం తెలిపారు.

క్షయవ్యాధిపై గీతం ఆసుపత్రి అవగాహన కార్యక్రమాలు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: ప్రపంచ క్షయవ్యాధి దినం సందర్భంగా గీతం విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గల గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ అండ్ రీసెర్చ్‌లో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సివి రావు ముఖ్యఅతిథిగా పాల్గొని క్షయవ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, టిబి లక్షణాలు బహిర్గతం అయితే సమీప వైద్యశాలలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రజలను చైతన్యపరచడానికి గీతం వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యబృందం ఆధ్వర్యంలో నగరంలో వారం రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఛాతి, టిబి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గీతం ఆసుపత్రిలో టిబి రోగుల కోసం వారం రోజులపాటు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే సామాజిక వైద్య విభాగం వైద్యులు డాక్టర్ భరణి కృష్ణ మాట్లాడుతూ టిబి వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడానికి పలు సూచనలు చేశారు. రెండు వారాలకు మించి కపంతో కూడిన దగ్గు రావడం, రాత్రిపూట జ్వరంతో బాధపడటం, విపరీతమైన నీరసం, బరువు తగ్గడం దగ్గినపుడు రక్తం పడటం వంటి లక్షణాలు గమనించిన వారు నిర్లక్ష్యం చేయకుండా సమీప వైద్యాలయాన్ని లేదా గీతం ఆసుపత్రిలోని క్షయవ్యాధి పరీక్షా విభాగాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో గీతం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరలక్ష్మి, ఆసుపత్రి వైద్యాధికారులు, వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తాం
* మక్కా మసీదు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
* ఎమ్మెల్యే వాసుపల్లికి అభినందనలు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ప్రకటించారు. జగదాంబ జంక్షన్ మక్కామసీదు పెద్దలు ఆయనను కలిసి ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయమన్నారు. దీనికి స్పందంచిన ఆయన వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ను ఏర్పాటు చేయించారు. దీంతో వారు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. మైనార్టీ రుణాలు, ప్రభుత్వం అమలుచేస్తోన్న జీవనోపాధి పథకాలు, ఇతర సంక్షేమ ఫలాలను వారికే అందేటట్టు కృషి చేస్తామన్నారు. నజీర్, అప్సర్‌ఖాన్, రహీంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకోండి
* జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: స్వచ్ఛమైన తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జివిఎంసి కమీషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ముడస్లరోవ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్స్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. రిజర్వాయర్ ప్రాంతంలో కొన్నిచోట్ల బురద నీరు రావడంతో అప్రమత్తమై మొత్తం ఫిల్టర్ బెడ్‌లను పరిశుభ్రం చేయడం, మరమ్మతు చేసినట్టు యస్‌ఇ ఆనందరావు వివరించారు. నీరు కొంచెం రంగులో వస్తున్నందున ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారన్నారు.

గ్రీన్ బెల్ట్ ఆక్రమణలకు గురికాకుండా చర్యలు
* జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: గ్రీన్‌బెల్ట్ ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్ర పర్యటనలో భాగంగా మద్దిలపాలెం కూడలి నుండి యన్‌ఏడి కూడలి వరకు గల గ్రీన్‌బెల్ట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. కంచెలేని చోట కంచె ఏర్పాటు చేయాలన్నారు. నాటిన చెట్లకు నిర్దేశించిన ప్రకారం వాటరింగ్ చేయాలని చెట్లు చనిపోకుండా ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. గ్రీన్‌బెల్ట్‌లో వెండర్స్ ఆక్రమిచిన ఫాస్ట్ఫుడ్ తదితరాల స్టాల్స్‌లో అమ్మకాలు సాగించకుండా వారందరికీ ఒక జోన్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్‌బెల్ట్‌ని ఆనుకుని ఉన్న కాలువలను మరమ్మతు చేయడం, ఆక్రమణలను తొలగించడం, ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ డి.వెంకటరత్నంను ఆదేశించారు. మద్దిలపాలెం, బిర్లాజంక్షన్, విప్రో కూడలి, రామచంద్రనగర్, ధర్మనగర్, ఆశోక్‌నగర్, రవీంద్రనగర్, లక్ష్మీనగర్‌లో పర్యటించారు. పర్యటనలో ఏడిహెచ్ దామోదర్, జోన్-2 కమీషనర్ పి.నల్లనయ్య, ఈఈ వెంకటీ, ఏసిపి సంజీవి, 4వ జోనల్ కమీషనర్ సిహెచ్.నాగ నరసింహారావు, వేణుగోపాల్, వేణుగోపాలరావు, ఏసిపి శోభన్‌బాబులు పాల్గొన్నారు.

కన్నయ్యపై దాడి అప్రజాస్వామికం
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 24: జెఎన్‌యు విద్యార్ధి నాయకుడు కన్హయ్‌పై దాడి అప్రజాస్వామిక చర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్ ఖండించారు. విజయవాడ బహిరంగసభలో కన్హయ్‌కుమార్ ప్రసంగం చేస్తున్న సమయంలో దాడులు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. సంఘ్‌పరివార్ శక్తుల దాడులను ఖండించాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్టీసీకాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద సీపీఐ గ్రేటర్ విశాఖ నగర సమితి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో హిందూత్వ వాదనను వ్యతిరేకించిన వారిపై కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిలోభాగంగా దాడులు జరుగుతున్యాని ఆవేదన వ్యక్తంచేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా కేంద్రంలోని బిజెపి వ్యవహరిస్తోందన్నారు. బిజెపి, సంఘ్‌పరివార్, ఏబివిపి సంఘాలు చేస్తున్న మతోన్మాద దాడులను అడ్డుకోవాలన్నారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్ధులు, సంఘం నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ఏ మేరకు సమంజసమన్నారు. విశ్వవిద్యాలయాల్లో పోలీసులను మోహరింపజేసి సభలు, సమావేశంలో జరగనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి డి.మార్కేండేయులు, సహాయ కార్యదర్శులు జి.రాంబాబు, జెడి నాయుడు, ఎంఏ భేగం, విమల, జి.వామనమూర్తిలు పాల్గొన్నారు.

మన్యంలో మండుతున్న ఎండలు
విలవిలలాడుతున్న ఏజెన్సీ వాసులు
అరకులోయ, మార్చి 24: విశాఖ మన్యంలో ఎండలు మండుతున్నాయి. మండుటెండలతో ఏజెన్సీ వాసులు విలవిలలాడుతున్నారు. భానుడు భగభగమంటూ నిప్పులు చిమ్ముతుండడంతో ఈ ప్రాంత వాసులతో పాటు పర్యాటకులు సైతం అల్లాడుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మార్చి నెలాఖరులోనే మే నెలను తలపించే రీతిలో ఎండలు కాస్తుడడంతో దీన్ని తట్టుకోలేని వారంతా చల్లదనం కోసం గెడ్డలు, వాగులు, చెరువులు, చెట్ల నీడ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఉదయం పది గంటల నుంచే రహదారులు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యవసాయ, ఉపాధి కూలీలు ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు అత్యధిక శాతం నమోదు అవుతుండడం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయేమోనని భావిస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులు నెలకొనడంతో పలు చోట్ల మంచినీళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఉక్కబోత, వేడి, వడగాలుల భారి నుంచి రక్షణ పొందేందుకు చల్లని పానియాలను సేవిస్తున్నారు. దీంతో కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, కూల్ డ్రింక్స్, లస్సీల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో యువకులు జలకాలాటల్లో మునిగి తేలుతున్నారు.

అభివృద్ధికి సమర్ధవంతమైన నాయకత్వం అవసరం
కోటవురట్ల, మార్చి 24: సమర్ధవంతమైన నాయకత్వం ఉన్న గ్రామాలు అభివృద్ధిలో ముందుంటాయని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. మండలంలో సుంకపూర్‌లో గురువారం నీరు - చెట్టు పథకం కింద 9.50 లక్షల రూపాయలతో చేపట్టే పెద్దచెరువు పూడిక తీత పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సుకంపూర్ గ్రామం ఆదర్శవంతంగా రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణంగా గ్రామ నాయకత్వమేనన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో గ్రామంలో 50 లక్షల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మండల దేశం పార్టీ అధ్యక్షులు లాలం కాశీనాయుడు విజ్ఞప్తి మేరకు సుంకపూర్ నుంచి జల్లూరు వరకు అరకిలో మీటరు సి.సి. రోడ్డుకు 24 లక్షల రూపాయల మంజూరుకు హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి మంజూరైన ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల్లో ఈరహదారికి కేటాయిస్తామన్నారు. రెండవ విడత పెద్ద చెరువు మరమ్మతులకు మరో 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానన్నారు. రజకుల దోభీఘాట్‌కు 5.60 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. గ్రామాభివృద్దికి ప్రజలు సహకరించాలన్నారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా దేశం పాలన కొనసాగుతుందన్నారు.