ఆంధ్రప్రదేశ్‌

రెండు దశల్లో వాటర్ గ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే లక్ష్యంతో సంకల్పించిన వాటర్ గ్రిడ్‌ను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌పై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వాటర్‌గ్రిడ్ అమలుపై చర్చించారు. రూ. 46,675 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ డిజైన్లు 30 ఏళ్ల దీర్ఘకాల ప్రయోజనాలతో రూపొందించినట్లు మంత్రులు తెలిపారు. 2022 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,982 గ్రామీణ ప్రాంత హేబిటేషన్లు, 99 అర్బన్ ఏరియాలకు రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలి దశలో రూ. 37, 475 కోట్లు, రెండవ దశలో రూ. 9వేల కోట్లతో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందుకోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ద్వారా రూ. 2500 కోట్ల రుణానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. రాష్ట్రంలోని 110 అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్‌బీ)లకు 1418.49 ఎంఎల్‌డీల నీటిని అందించాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాలకు రిజర్వాయర్ల నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేయాలని మంత్రులు నిర్దేశించారు. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అధికారులు వివరించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భూగర్భజలాలు 1100 అడుగులకు చేరాయని తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దీర్ఘకాలికంగా భూగర్భజలాల వినియోగం జరుగుతోందని చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో ఉపరితల నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఆక్వా కల్చర్ కారణంగా గోదావరి జిల్లాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయనే అంశంపై సమావేశంలో చర్చించారు. ప్రత్యామ్నాయంగా పైపులైన్ల ద్వారా మంచినీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కడప, నెల్లూరు జిల్లాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురవుతోందని చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తాగునీటి నాణ్యతలో లోపాలు ఉన్నాయని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే హేబిటేషన్ల సంఖ్య పెరిగిందని ఈ జిల్లాల్లో 2011 నాటికి 591 హేబిటేషన్లు ఉండగా ప్రస్తుతం 6267కు పెరిగాయని వీటికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. వర్షపాతం లోటు కారణంగా రాయలసీమ జిల్లాల్లో బోరుబావులు ఎండిపోతున్నాయని, వాటర్ గ్రిడ్ ద్వారా రిజర్వాయర్ల నుంచి ఈ ప్రాంతానికి తాగునీటి సరఫరా చేయాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల ద్వారా వాటర్ గ్రిడ్‌కు నీటి లభ్యత ఉంటుందని జలజీవన్ మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటి వనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత పాటించాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.