ఆంధ్రప్రదేశ్‌

దిగుబడి ఆధారంగా పంటల బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 1: వర్షాభావం కారణంగా ప్రతి ఏటా పంటల్ని తీవ్రంగా నష్టపోతూ ఆర్థికంగా కుంగిపోతున్న రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అందులో భాగంగా పంట దిగుబడి ఆధారంగా రైతులకు పంట బీమా ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి పంటల స్థితిగతులను పరిశీలించాలని వ్యవసాయాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులను సిఎం ఆదేశించారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వ్యవసాయాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులు ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాల్ని శాస్ర్తియంగా అంచనా వేయాలన్నారు. దీని ఆధారంగా పంట బీమా ప్రయోజనాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. భూమి సాగు చేస్తున్న రైతులకే బీమా సదుపాయంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఇతర ప్రయోజనాలు అందాలని అన్నారు. బ్యాంకర్లు సైతం పంట సాగు చేస్తున్న అర్హులైన రైతులకే రుణాలు ఇవ్వాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని ప్రభుత్వం అందజేస్తోందని, భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే అనంతపురం జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల్లో మనోధైర్యం నింపి కరవును ఎదుర్కొనేందుకు పంట సంజీవని కింద లక్ష ఫారంపాండ్లు నిర్మిస్తున్నామని సిఎం వివరించారు. ఇప్పటికే 66 వేల ఫారంపాండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రతి 5 ఎకరాలకు ఒక ఫారంపాండ్ నిర్మించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. సమీపంలో ఉన్న కుంటల ద్వారా ఆయిల్ ఇంజన్లు, పైపులు, రెయిన్‌గన్లు ఉపయోగించి రక్షక తడులు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నీరు లేని చోట ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్ల ద్వారా వేరుశెనగ పంటలకు రక్షక తడులు అందిస్తున్నామన్నారు. చెరువులు, బోరుబావులు, ఫారంపాండ్లను తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏ పంట ఎలాంటి దశలో ఉంది, సమీపంలో జల వనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్న విషయాల్ని కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటామన్నారు. అధికారుల్ని అప్రమత్తం చేసి రైతులను ఆదుకుంటామన్నారు.
ఎండిన పంటను పరిశీలించిన సిఎం
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం కంచెనపల్లెలో పర్యటించి ఎండిన వేరుశెనగ పంటను పరిశీలించారు. ముఖ్యమంత్రి నేరుగా పొలాల్లోకి వెళ్లి ఎండిపోయిన వేరుశెనగ మొక్కలను పెరికి చూశారు. మొక్కకు బుడ్డలున్నాయో పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులపై రైతులను ఆరా తీశారు. ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు రెయిన్‌గన్ల ద్వారా నీటి తడులు అందిస్తామన్నారు. పైపుల సాయంతో రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడుతామన్నారు.

చిత్రం.. అనంతపురంలో బ్యాంకర్లు, బీమా అధికారుల సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి