ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఏఎస్‌తో బహుళ ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించటంలో స్టేషన్ ఆటోమేషన్ సిస్టం (ఎస్‌ఏఎస్) కీలక పాత్ర వహిస్తుందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) స్పష్టం చేసింది. ఏపీలోని సబ్ స్టేషన్లలో ఎస్‌ఏఎస్‌ను అమలు చేసే విషయమై పీజీసీఐఎల్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. టీఎస్సీ శర్మ నేతృత్వంలోని 9 మంది సభ్యుల పీజీసీఐఎల్ కమిటీ.. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్, జేఎండీ చక్రధర్‌బాబు, ఇతర సీనియర్ అధికారులకు ఎస్‌ఏఎస్ వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. దేశంలో ఏర్పాటుకానున్న సబ్ స్టేషన్లతో పాటు మారుతున్న టెక్నాలజీ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎస్‌ఏఎస్ పాత్రను విస్మరించలేమని పీజీసీఐఎల్ అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్లను ఆటోమేషన్ పరికరాలతో సిద్ధంగా ఉంచాలని, తద్వారా రిమోట్‌తో కార్యకలాపాలు నిర్వహించ వచ్చన్నారు. ఏపీలో మొత్తం విద్యుత్ వ్యవస్థను సెంట్రల్ కంట్రోల్ లొకేషన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్డీసీ) ద్వారా పర్యవేక్షించే వీలుందని తెలిపారు. దీనివల్ల సరఫరా నష్టాలను తగ్గించుకోవచ్చని కూడా చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతరాయాల్లేని కరెంట్ సరఫరా చేసి వినియోగదారులకు ఉత్తమ సేవలందించటమే లక్ష్యంగా ఎస్‌ఏఎస్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించటంలో టెక్నాలజీ ఎప్పుడూ ఉపకరిస్తుందన్నారు. ఈ విషయంలో ఏపీ ట్రాన్స్‌కో, బీఈఈ, ఐఈఏ, ఈఈఎస్‌ఎల్, టీఈఆర్‌ఐ, పీజీసీఐఎల్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్‌ఏఎస్‌ల వల్ల మొత్తం సరఫరా నెట్‌వర్క్ విశ్వసనీయత పెరగటంతో పాటు సమస్యల పరిష్కార సామర్థ్యాలు కూడా పెరుగుతాయని తెలిపారు. లైన్ నష్టాల తగ్గింపు, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఉపకరిస్తుందన్నారు. ఆటోమేషన్ వల్ల వినియోగదారులకు అంతరాయాల్లేని కరెంట్ సరఫరా చేసేందుకు అవసరమైన నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణలో సాధారణంగా ఎదురయ్యే లోపాలను కూడా నియంత్రించే వీలు కలుగుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన సబ్‌స్టేషన్లను మెరుగుపరచటంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్‌ఏఎస్‌లో అధునాతన టెక్నాలజీ సబ్ స్టేషన్లలో అన్ని పరికరాలను పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రియ అంతా రిమోట్ కంట్రోల్ సెంటర్, స్థానిక కంట్రోల్ కేంద్రాల నుంచి కొనసాగుతుందని వివరించారు. కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం ఉన్న సరఫరా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలను అనుసరించడం ద్వారా సింగపూర్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సరఫరా, పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించుకో గలుగుతున్నాయని గుర్తుచేశారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించటమే సీఎం జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా చెప్పారు.
ఈదురు గాలులు, తుపాన్లు, ఇతర ప్రకృతి విపత్తుల సమయాల్లో సైతం లైన్లలో ఏర్పడిన లోపాలు, నష్టాలను ఎస్‌ఏఎస్ గుర్తిస్తుందని తెలిపారు. దీనివల్ల తక్కువ సమయంలోనే సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఏఎస్‌లో సైబర్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నందున ఎలాంటి హ్యాకింగ్, సైబర్ దాడులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
ఎస్‌ఏఎస్‌ల వల్ల వినియోగదారులతో పాటు విద్యుదుత్పత్తి సంస్థలకు ఖర్చులు తగ్గుతాయన్నారు. విద్యుత్ వినియోగాన్ని రియల్‌టైం పద్ధతిలో చూసుకునే అవకాశం ఉన్నందున వినియోగదారులు తమ వాడకం తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ ఆటోమేటెడ్ వ్యవస్థ, సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన కచ్చిత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిపారు. దీనివల్ల విద్యుత్ సంస్థలు మెరుగైన ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు, నాణ్యమైన ఇంజనీరింగ్‌కు వీలుంటుందని వివరించారు.రాష్ట్రంలోని 400 కేవీ సబ్‌స్టేషన్లలో దశలవారీగా ఎస్‌ఏఎస్‌ను అమలు చేసేందుకు పీజీసీఐఎల్‌తో చర్చలు జరుపుతామని జేఎండీ తెలిపారు. తాము దేశవ్యాప్తంగా 765 కేవీ, 400 కేవీ లైన్లు, సబ్‌స్టేషన్లు నిర్వహిస్తున్నామని పీజీసీఐఎల్ అధికారులు వివరించారు. 400 కేవీ సబ్‌స్టేషన్లన్నీ దాదాపు ఆటోమేషన్‌తోనే నిర్వహిస్తున్నామని దీనివల్ల కార్యకలాపాలు, నిర్వహణ ఖర్చు తగ్గుతుందన్నారు. పరిస్థితులను బట్టి అప్రమత్తం చేయటం, సమీకృత సమాచారం, కరెంట్ డౌన్ సమయాన్ని తగ్గించటం, నిర్వహణను సులభతరం చేయటం, మానవ వనరులను సమర్థంగా వినియోగించటంలో కూడా ఎస్‌ఏఎస్ దోహద పడుతుందని వివరించారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఎస్‌సీ శర్మ, సీజీఎం ఎస్‌ఎస్ విందాల్, అవినాశ్, ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్లు జి రాజాబాబు, ఎస్ శ్రీరాములు, బివి. శాంతి శేషు, ఈడీ శ్రీరాములు, కె ప్రవీణ్‌కుమార్, ఆనందరావు, చీఫ్ ఇంజనీర్ (టెలికాం) కె కాంచన్‌బాబు, పవర్ సిస్టమ్స్ సీఈ ఎంబీ శ్రీనివాస్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ఎస్‌ఏఎస్ అమలుపై విద్యుత్‌సౌధలో జరిగిన వర్క్‌షాప్ దృశ్యం